కిటికీ మెష్‌పై దుమ్ము, మురికి పేరుకుపోయాయా? ఈ 4 చిట్కాలతో ఈజీగా క్లీన్ చేయండి!
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కిటికీల మెష్‌లు (Window Mesh) మాత్రం త్వరగా మురికిగా మారుతుంటాయి. ముఖ్యంగా బయట నుంచి వచ్చే దుమ్ము, వాహనాల పొగ, చిన్న చిన్న పురుగుల అవశేషాలు మెష్‌కు అంటుకుని పేరుకుపోతాయి. దీంతో గాలి సరిగా లోపలికి రాకపోవడమే కాకుండా కిటికీలు కూడా అపరిశుభ్రంగా కనిపిస్తాయి. వీటిని శుభ్రం చేయడానికి చాలామంది ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని భావిస్తారు. కానీ ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
ముందుగా మెష్‌పై దుమ్మును తొలగించండి
ముందుగా కిటికీ మెష్‌పై ఉన్న పొడి దుమ్మును తొలగించాలి. ఇందుకోసం సాఫ్ట్ బ్రష్ (Soft Brush) లేదా వాక్యూమ్ క్లీనర్ (Vacuum Cleaner) ఉపయోగించవచ్చు. వాక్యూమ్ క్లీనర్‌కు బ్రష్ అటాచ్మెంట్ అమర్చి తక్కువ పవర్‌తో మెష్‌కు రెండు వైపులా నెమ్మదిగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల మెష్‌కు అంటుకున్న దుమ్ము సులభంగా తొలగిపోతుంది. గట్టిగా రుద్దకుండా జాగ్రత్తపడాలి. లేదంటే మెష్ చిరిగిపోయే అవకాశం ఉంటుంది.
డిష్ సోప్‌తో జిడ్డు మరకలను తొలగించండి
ఆ తర్వాత ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా లిక్విడ్ డిష్ సోప్ (Dish Soap) కలపాలి. ఈ నీటిలో మైక్రోఫైబర్ క్లాత్ (Microfiber Cloth) లేదా మెత్తని స్పాంజ్‌ను ముంచి అదనపు నీటిని పిండేయాలి. తర్వాత మెష్‌పై పై నుంచి కిందకు సున్నితంగా తుడవాలి. మరీ ఎక్కువ నీటిని ఉపయోగించకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల దుమ్ముతో పాటు జిడ్డు మరకలు కూడా తొలగిపోతాయి.
ఇవి కూడా చదవండి
చిన్న రంధ్రాల్లోని మురికికి టూత్ బ్రష్ వాడండి
మెష్‌లోని చిన్న చిన్న రంధ్రాల్లో దుమ్ము పేరుకుపోయినప్పుడు సాఫ్ట్ టూత్ బ్రష్ (Soft Toothbrush) ఉపయోగపడుతుంది. బ్రష్‌తో గట్టిగా నొక్కకుండా చిన్న చిన్న కదలికలతో శుభ్రం చేయాలి. ముఖ్యంగా మూలలు, అంచుల దగ్గర పేరుకున్న మురికిని తొలగించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మెష్ సున్నితంగా ఉంటే ముందుగా ఒక చిన్న భాగంలో పరీక్షించి చూడాలి.
మెష్‌ను శుభ్రం చేసిన తర్వాత ఇలా ఆరబెట్టండి
శుభ్రం చేసిన తర్వాత మరోసారి సాధారణ నీటిలో తడిపిన శుభ్రమైన గుడ్డతో తుడవాలి. సబ్బు అవశేషాలు పూర్తిగా తొలగిపోయేలా చూసుకోవాలి. అనంతరం పొడి మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడిచి, కిటికీని తెరిచి ఉంచి సహజంగా ఆరనివ్వాలి. మెష్ పూర్తిగా ఆరిన తర్వాతే కిటికీని మూసివేయడం మంచిది.
ఇక కిటికీల మెష్‌పై దుమ్ము ఎక్కువగా పేరుకోకుండా ఉండాలంటే వారానికి ఒకసారి పొడి గుడ్డ లేదా సాఫ్ట్ బ్రష్‌తో తుడవాలి. ఇలా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే దుమ్ము గట్టిగా పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే కిటికీ ఫ్రేమ్‌లు, మూలలను కూడా శుభ్రం చేయాలి. మెష్ తొలగించగలిగే రకానికి చెందినదైతే తయారీదారు సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
ముఖ్యంగా మెష్‌ను శుభ్రం చేసేటప్పుడు హై ప్రెజర్ వాటర్, గట్టి బ్రష్‌లు, బలమైన రసాయనాలు ఉపయోగించకూడదు. ఇవి మెష్ దెబ్బతినడానికి కారణమవుతాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే కిటికీల మెష్ ఎక్కువకాలం మన్నడంతో పాటు ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకోవచ్చు.







