విశ్వవేదికపై తెలంగాణ పారిశ్రామిక శంఖారావం
తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించబోతోంది. 80 వేల చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద మల్టీ సెక్టార్ ఎక్స్పోగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ గ్లోబల్ సమ్మిట్ కేవలం వ్యాపార ఒప్పందాలకే పరిమితం కాకుండా.. తెలంగాణ ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా మారనుంది. వివిధ రంగాలకు చెందిన వెయ్యికి పైగా దిగ్గజ కంపెనీలు ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నాయి. ఇప్పటికే ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 1500 మంది సీఈవోలు, ఎండీలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాల రాయబారులు హాజరయ్యేందుకు అంగీకరించారు. మరో 1500 మంది పారిశ్రామిక ప్రతినిధులు రానున్నారు. అంటే దాదాపు 3000 మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలు ఒకే వేదికపైకి రావడం తెలంగాణ పారిశ్రామిక అనుకూల విధానాలకు నిదర్శనం. ముఖ్యమైన ప్రతినిధులను ఆహ్వానించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించడం ద్వారా ఈ సదస్సుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
సదస్సులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పెవిలియన్లు విభిన్న రంగాల సమ్మేళనంగా నిలవనున్నాయి. రక్షణ రంగ సామర్థ్యాన్ని ప్రదర్శించే ‘రక్షా ఎక్స్పో’లో భాగంగా డిసెంబర్ 7న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు, ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ విన్యాసాలను ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన హాస్టళ్ల విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేలా అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ‘ఇండియా జాయ్’ కాంక్లేవ్ వేదికగా సుమారు 150 యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ కంపెనీలు తమ సృజనాత్మకతను ప్రదర్శించనున్నాయి. వీటితో పాటు స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శనలు పెట్టుబడిదారులను ఆకర్షించనున్నాయి.
భవిష్యత్ తరాలకు అవసరమైన నైపుణ్యాలను అందించే లక్ష్యంతో ‘ఎడ్యుకేషన్ కాంక్లేవ్’ను అత్యంత కీలకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో యూకే, యూరోపియన్ పెవిలియన్లతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే ఐఎస్బీ, ఐఐటీ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ, హెచ్‌సీయూ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ప్రతినిధులు అంతర్జాతీయ అతిథులతో ముఖాముఖి చర్చలు జరిపేలా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యా రంగ సంస్కరణలపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. డిసెంబర్ 7న అంతర్జాతీయ విద్యావేత్తలతో ‘స్కూల్స్ ఆఫ్ ది ఫ్యూచర్’పై, 8న ‘రీఫార్మ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్’ అనే అంశంపై ప్రత్యేక చర్చల్లో పాల్గొననున్నారు.
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యతను చాటుతూ నిర్వహిస్తున్న ‘క్లైమేట్ కాంక్లేవ్’లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, స్వచ్ఛంద సంస్థలు పాలుపంచుకోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఈ సదస్సు నిర్వహణలో సాంకేతికతకు, ఆతిథ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రతినిధుల ప్రవేశం కోసం ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగించడంతో పాటు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా వివిధ దేశాల కళా బృందాల ప్రదర్శనలు, చేనేత వస్త్రాల స్టాళ్లు, 30 ప్రత్యేక ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక సదస్సు ముగిసిన తర్వాత డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు సాధారణ పౌరులు, ఔత్సాహికులు సైతం ఈ ఎక్స్పోను సందర్శించే అవకాశం కల్పించారు. మొత్తంమీద.. ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనల త్రివేణి సంగమంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సిద్ధమవుతోంది.







