మిస్టరీ మనీ: ట్రంప్‌కు ఎవరు సీక్రెట్‌గా రూ.2,500 కోట్లు పంపించారు? అసలు కథేంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ప్రభుత్వ ఖాతాలోకి ఒక్కసారిగా రూ.2,500 కోట్లకు పైగా వచ్చి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? అసలు ఆ డబ్బు దేనికి ఉపయోగించబోతున్నారు? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఇప్పటికే యాపిల్, ఎన్విడియా, గూగుల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు ట్రంప్ ప్రాజెక్టులకు భారీగా విరాళాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ విరాళాల వెనుక కేవలం అభిమానం మాత్రమే ఉందా? లేక అమెరికా ప్రభుత్వంతో తమ పనులు చక్కబెట్టుకోవాలన్న వ్యూహం కూడా ఉందా?
పార్కుల కోసం ఏర్పాటైన ఖాతాలోకి ఇంత డబ్బు ఎలా వచ్చింది?
అమెరికా నేషనల్ పార్క్ సర్వీస్‌కు చెందిన ఈ ఖాతాను మొదట జాతీయ పార్కుల నిర్వహణ, అభివృద్ధి కోసం విరాళాలు సేకరించేందుకు ఏర్పాటు చేశారు. గతంలో ఈ ఖాతాకు ఏడాదికి వచ్చే విరాళాలు 100 మిలియన్ డాలర్లలోపే ఉండేవి. కానీ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైన తర్వాత ఈ ఖాతాలోకి భారీగా నిధులు రావడం మొదలైంది. ముఖ్యంగా 2026 సెప్టెంబర్‌లో జరిగిన డిపాజిట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
న్యూయార్క్ టైమ్స్ పరిశీలించిన ఆర్థిక పత్రాల ప్రకారం.. సెప్టెంబర్‌లో 50 మిలియన్ డాలర్ల విరాళాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తే, వాస్తవంగా 347 మిలియన్ డాలర్లు వచ్చాయి. అంటే ఊహించిన దానికంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు ఇచ్చారో, ఏ అవసరం కోసం ఇచ్చారో మాత్రం ఆర్థిక నివేదికల్లో స్పష్టంగా కనిపించడం లేదు.
ట్రంప్ ప్రాజెక్టులకు కార్పొరేట్ కంపెనీల అండ!
ఈ డబ్బు ఎందుకు వస్తోందన్న చర్చకు మరో ఇంట్రస్టింగ్ యాంగిల్ ఉంది. ట్రంప్ తన రెండో విడత పాలనలో వాషింగ్టన్ రూపురేఖలనే మార్చే పనిలో ఉన్నారు. వైట్‌హౌస్‌లో భారీ బాల్రూమ్ నిర్మాణం, లింకన్ మెమోరియల్ వద్ద రిఫ్లెక్టింగ్ పూల్ మరమ్మతులు, నగరంలో భారీ విజయ తోరణం నిర్మించాలన్న ప్రణాళిక.. ఇలా ఆయనకు నచ్చిన ప్రాజెక్టులు వరుసగా ముందుకు వెళ్తున్నాయి.
ఈ ప్రాజెక్టులకు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 790 మిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే దాదాపు రూ.6,600 కోట్లకు పైగా. ఇందులో కార్పొరేట్ సంస్థల విరాళాలు కూడా ఉన్నాయి. వాషింగ్టన్ పోస్ట్ పరిశోధన ప్రకారం.. యాపిల్, ఎన్విడియా వంటి సంస్థలు ఒక్కొక్కటి 25 మిలియన్ డాలర్ల చొప్పున బాల్రూమ్ నిర్మాణానికి విరాళాలు ఇచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి సంస్థల పేర్లు కూడా ఈ విరాళాల వ్యవహారంలో వినిపించాయి.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సంస్థలు బాల్రూమ్ కోసం ఇచ్చిన విరాళాలు, సెప్టెంబర్‌లో తాజాగా ప్రభుత్వ ఖాతాలోకి వచ్చిన రూ.2,500 కోట్లకు పైగా మొత్తానికి ఒకటే మూలమని నిర్ధారణ కాలేదు. అయినా ఇంత పెద్ద కంపెనీలు అధ్యక్షుడి ప్రాజెక్టులకు ఎందుకు భారీగా డబ్బు ఇస్తున్నాయన్న ఆసక్తి మాత్రం పెరుగుతోంది.
విరాళాలు ఇస్తున్న కంపెనీలు ఏమి ఆశిస్తున్నాయి?
ట్రంప్ ప్రభుత్వంతో వ్యాపార సంబంధాలు ఉన్న సంస్థలు ఆయన ప్రాజెక్టులకు భారీ విరాళాలు ఇస్తున్నప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార అనుమతులు, నియంత్రణ విధానాలు వంటి అంశాల్లో ఈ కంపెనీలకు అమెరికా ప్రభుత్వంతో సంబంధాలు ఉంటాయి. అలాంటప్పుడు విరాళాలు ఇవ్వడం వెనుక ఏదైనా వ్యాపార ప్రయోజనం ఉందా? అధికార కేంద్రానికి దగ్గరగా ఉండాలన్న ఆలోచన ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే విరాళాలు ఇచ్చినంత మాత్రాన ప్రతిఫలంగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నాయని చెప్పలేం. అలాంటి ఆధారాలు ఇప్పటివరకు బయటపడలేదు. కానీ విరాళాల వివరాలు పూర్తిగా పారదర్శకంగా లేకపోతే ఇలాంటి అనుమానాలకు తావు ఏర్పడుతుందన్నది మాత్రం నిజం.
లాబీయిస్టుల పాత్రపై కూడా ప్రశ్నలు!
ఇక అమెరికాలో పెద్ద కంపెనీలు తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు కొనసాగించేందుకు లాబీయిస్టుల సేవలు ఉపయోగించుకుంటాయి. ట్రంప్ బాల్రూమ్ నిర్మాణానికి విరాళాలు సమకూర్చడంలోనూ కొందరు ప్రముఖ లాబీయిస్టులు కీలకంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్లు రిచర్డ్ బ్లూమెంటాల్, ఆడమ్ షిఫ్ నవంబర్ 19న కొందరు ప్రముఖ లాబీయిస్టులను వివరణ కోరారు. ఏ కంపెనీలను విరాళాల కోసం సంప్రదించారు? విరాళాలు ఇచ్చినవారికి ఏమైనా హామీలు ఇచ్చారా? ఈ నిధుల సేకరణ వెనుక ప్రభుత్వంతో సంబంధాలున్నాయా? వంటి అంశాలపై సమాచారం కోరారు. అంటే ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం డబ్బు ఎవరిచ్చారన్న ప్రశ్న దగ్గరే ఆగిపోలేదు. ఆ డబ్బు సేకరణ వెనుక ఎవరున్నారు? దాతలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది.
అసలు విషయం అడిగితే ప్రశంసలతో సరిపెట్టిన ప్రభుత్వం!
ఇంతకీ సెప్టెంబర్‌లో వచ్చిన భారీ డబ్బు ఎవరిచ్చారు? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అని మీడియా అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖను ప్రశ్నించింది. అయితే ఆ శాఖ ప్రతినిధి మాత్రం నిధుల మూలం గురించి నేరుగా సమాధానం చెప్పకుండా ట్రంప్‌ను ప్రశంసించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వాషింగ్టన్‌ను మరింత అందంగా, సురక్షితంగా మార్చేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, నేషనల్ పార్క్ సర్వీస్ ఆ పనులను సమర్థంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు గతంలో అంతర్గత వ్యవహారాల శాఖలో న్యాయవాదిగా పనిచేసిన టోనీ ఐరిష్ మాత్రం ఈ వ్యవహారంలో పారదర్శకత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విరాళాలు ఇచ్చేవారు ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రయోజనాలు ఆశిస్తున్నారా అన్నది తెలియాలంటే నిధుల మూలాలు, వాటి ఉద్దేశాలు బయటపడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తానికి …
ట్రంప్ ఖాతాలోకి వచ్చిన డబ్బు లెక్కలు కనిపిస్తున్నాయి.. కానీ ఆ డబ్బు వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు, వారి అసలు ఉద్దేశాలు మాత్రం ఇంకా తెర వెనుకే ఉన్నాయి. ఆ తెర ఎప్పుడు తొలగుతుంది? అప్పుడే ఈ రూ.2,500 కోట్ల మిస్టరీకి అసలు సమాధానం దొరుకుతుంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







