ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భారీ కోతలు..!
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 17న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 73.3 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. అయితే, అర్హులైన ఓటర్లకు తమ పేర్లను తిరిగి నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక అవకాశం కల్పించినప్పటికీ, క్షేత్రస్థాయిలో స్పందన అత్యంత మాత్రంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం వెయ్యి మంది మాత్రమే తాజా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించడం గమనార్హం.
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ గణాంకాల ప్రకారం, జిల్లాల్లో సగటున 50 నుంచి 100 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ముసాయిదా జాబితాలో కోతకు గురైన 73.3 లక్షల ఓటర్ల వివరాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శాశ్వతంగా చిరునామా మారిన వారు 45.1 లక్షల మంది ఉన్నారు. అందుబాటులో లేనివారు లేదా ఆచూకీ తెలియని వారు 11.2 లక్షలున్నారు. 9.2 లక్షల మంది ఓటర్లు మరణించారు. ఇతర చోట్ల ఓటు హక్కు కలిగిన వారు 6.7 లక్షలున్నారు.
బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాతే ఈ ‘ఏఎస్డీడీ’ జాబితాను రూపొందించామని, ఎక్కడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదని సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు ఈసీ ప్రత్యేక అవకాశం ఇవ్వకముందే చాలామంది ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవడం వల్లే తాజా ఫారాలకు స్పందన తక్కువగా ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ముసాయిదా జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ, రికార్డుల్లో లోపాలున్న 92.8 లక్షల మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో 60.1 లక్షల మంది వివరాలలో వ్యత్యాసాలు ఉండగా, 31.8 లక్షల మంది పాత జాబితాలతో సరిపోలలేదు. నవంబర్ 20 నాటి నివేదికల ప్రకారం, నోటీసులు అందుకున్న వారిలో దాదాపు 99 శాతం అంటే 92 లక్షల మంది తుది జాబితాలో చేరేందుకు అర్హత సాధించారు. మొత్తం 2,64,87,213 మంది ముసాయిదా ఓటర్లలో 2,63,96,341 మంది అంటే 99.6 శాతం తుది జాబితాకు ఖరారయ్యారు. మరో 58,772 మందిని అనర్హులుగా గుర్తించగా, ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోనే 13,493 మంది ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 32,100 కేసులు పెండింగ్లో ఉండగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే 22,958 కేసులు (71.5శాతం) అపరిష్కృతంగా ఉండటం గమనార్హం. పొరుగున ఉన్న రంగారెడ్డిలో కేవలం 29, మేడ్చల్ మల్కాజిగిరిలో 22 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అర్హులైన ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు బీఎల్ఓలు నవంబర్ 30 వరకు తాజా ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరిస్తారు. అనంతరం అన్ని పరిశీలనలు పూర్తి చేసి డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.







