కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవుల పందేరం!
అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ అంశం ఉత్కంఠకు దారితీస్తోంది. గతంలో నామినేట్ అయిన బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14తో ముగిసింది. దీతో ఖాళీ అయిన ఈ మూడు స్థానాల కోసం సుమారు 30 మందికి పైగా సీనియర్ నేతలు, ప్రభుత్వ సలహాదారులు, ఉద్యమకారులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎంపిక ప్రక్రియ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌కు మొదటి పెద్ద రాజకీయ పరీక్షగా మారింది.
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం సామ రామ్మోహన్ రెడ్డి, రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు అవకాశం కల్పించింది. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి ఈ స్థానాలను కేటాయించడంతో, గవర్నర్ కోటాలో మాత్రం సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బలహీన వర్గాలు, ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది.
బీసీ సామాజికవర్గం నుంచి పద్మశాలీలైన మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పున్న కైలాష్ పోటీ పడుతున్నారు. ఇక ముదిరాజ్ వర్గం నుంచి నీలం మధు, మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. వీరితో పాటు చనగాని దయాకర్, సత్తు మల్లేశ్, కౌశిక్ యాదవ్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లతో పాటు ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్ రావు (బ్రాహ్మణ కోటా), షబ్బీర్ అలీ (మైనార్టీ కోటా), మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, చాడగొండ వెంకటేశ్ (ఎస్సీ కోటా), బెల్లయ్య నాయక్ (ఎస్టీ కోటా)లతో పాటు కొండా మురళి, బోరెడ్డి అయోధ్య రెడ్డి, ఆరెపల్లి మోహన్ వంటి నేతలు అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నారు.
అందుబాటులో ఉన్నవి కేవలం మూడు స్థానాలు మాత్రమే కావడం, ఆశావహుల జాబితా భారీగా ఉండటంతో ఎంపిక ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కొందరు నేతలు ప్రభుత్వ పనితీరుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో, ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో ఏమాత్రం అసంతృప్తి తలెత్తినా అది రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి ఇన్‌ఛార్జి బీఎం సందీప్ వివిధ ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ మూడు స్థానాలను భర్తీ చేసి మిగిలిన వారికి కార్పొరేషన్ పదవుల హామీ ఇవ్వాలా, లేక వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి అన్ని సామాజికవర్గాలకు ఒకేసారి సర్దుబాటు చేయాలా అనే అంశంపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీలో ఐక్యతను కాపాడుతూ, సామాజిక సమీకరణాలను సమన్వయం చేస్తూ ఈ మూడు పదవులను భర్తీ చేయడం కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్ గా మారింది.







