ఇన్ఛార్జ్ సందీప్‌తో రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి భేటీ
అధికార కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ బీఎం సందీప్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాత్రి వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణ, ఎమ్మెల్యేల అసంతృప్తి, బహిరంగ ప్రకటనల ప్రభావంపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం.
పార్టీ నేతలు బహిరంగంగా చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయని, ఇది పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందని ఇంచార్జ్ సందీప్ ఇరువురు ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఏవైనా ఇబ్బందులు లేదా అసంతృప్తులు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఒకవేళ అధిష్టానంతో మాట్లాడాలని భావించినా అందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అవసరమైన ఏర్పాట్లు చేస్తానని సందీప్ హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించాలంటే నేతలంతా ఐక్యంగా పనిచేయాలని, బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఆయన గట్టిగా హితవు పలికారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నచ్చచెబుతూ, వచ్చే రోజుల్లో పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు ఈ భేటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఇంచార్జ్ సందీప్‌కు వివరించారు. పార్టీకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో తాను ఎక్కడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం వ్యవస్థలోని అవినీతి గురించి మాత్రమే తాను ప్రస్తావించానని, గతంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా అవినీతిపై ఇదే తరహాలో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరడం పార్టీకి వ్యతిరేకం కాదని, ప్రజల అవసరాల దృష్ట్యా మంచి ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలను మీడియాలో కొందరు వక్రీకరించారని, “బిల్లులు ఇవ్వకపోతే చచ్చిపోతా” అని తాను ఎక్కడా అనలేదని ఆయన ఇంచార్జ్ వద్ద స్పష్టత ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఒకవైపు హామీల అమలు, మరోవైపు నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్లులు, నిధుల విడుదలపై ఎమ్మెల్యేలపై స్థానికంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు తమ అసహనాన్ని బహిరంగ వేదికలపై వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికారంలో ఉన్నప్పుడు నేతల మధ్య సమన్వయ లోపం బయటపడితే అది ప్రభుత్వ పాలనపై ప్రభావం చూపుతుందని అధిష్టానం భావిస్తోంది.
అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడటం ద్వారా, అధిష్టానం ఒకవైపు వారి సమస్యలను వినడానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇస్తూనే, మరోవైపు లక్ష్మణరేఖ దాటకూడదనే హెచ్చరికను కూడా పంపింది. ఇంచార్జ్ బీఎం సందీప్ జోక్యంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిధుల విడుదల, పదవుల భర్తీ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే పార్టీ అంతర్గత ఐక్యత ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







