జెన్సన్ హువాంగ్ రీఎంట్రీతో ట్రంప్‌కు జాక్‌పాట్.. ఒక్కరోజులోనే రూ.139 కోట్ల లాభం!
ఒకప్పుడు రాజకీయాల్లో తనదైన శైలితో వార్తల్లో నిలిచిన డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లెక్కల్లోనూ హాట్ టాపిక్‌గా మారారు. దీనికి కారణం ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ మళ్లీ తెరపైకి రావడమే! జెన్సన్ తిరిగి సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారన్న వార్తతో ఎన్విడియా షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. కంపెనీ విలువ లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ఈ ర్యాలీతో జెన్సన్ సంపదకే కాదు.. ట్రంప్ పెట్టుబడుల విలువకూ భారీగా బూస్ట్ లభించింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జెన్సన్ రాకతో ట్రంప్‌కు నేరుగా నగదు అందలేదు. కానీ ఎన్విడియాలో ఆయనకు ఉన్న షేర్ల మార్కెట్ విలువ పెరగడంతో ఒక్కరోజులోనే దాదాపు 15 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ.139 కోట్ల మేర సంపద పెరిగి ఉండొచ్చని అంచనా. ఒక కంపెనీ సీఈవో తిరిగి రావడం అమెరికా అధ్యక్షుడి పెట్టుబడులకు ఇంతటి లాభాన్ని తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
3.70 లక్షల షేర్లు.. లాభం రూ.139 కోట్లు!
ట్రంప్‌కు ఎన్విడియాలో ఎంత వాటా ఉందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన ఆయన తాజా ఆర్థిక వివరాల ప్రకారం, సెప్టెంబర్ 30 నాటికి ఆయన వద్ద గరిష్ఠంగా 3.70 లక్షల ఎన్విడియా షేర్లు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఈ వివరాల్లో ఖచ్చితమైన షేర్ల సంఖ్య వెల్లడించలేదు. కొనుగోళ్లు, అమ్మకాలను నిర్దిష్ట మొత్తాలుగా కాకుండా వివిధ ధరల శ్రేణుల్లో చూపించారు.
ఫైనాన్షియల్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం, ట్రంప్ వద్ద గరిష్ఠంగా 3.70 లక్షల షేర్లు ఉన్నాయని భావిస్తే, తాజా ర్యాలీతో వాటి విలువ 15 మిలియన్ డాలర్లు పెరిగి ఉండొచ్చు. అదే కనిష్ఠ అంచనా ప్రకారం ఆయన వద్ద కేవలం 32 వేల షేర్లు మాత్రమే ఉంటే, లాభం 1.3 మిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చు. అంటే రూపాయల్లో సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.139 కోట్ల వరకు పెరుగుదల ఉండొచ్చన్నమాట.
ఇవి కూడా చదవండి
జెన్సన్ను వెనక్కి తీసుకురావడంలో ట్రంప్ పాత్ర!
ఈ కథలో మరో ఇంట్రస్టింగ్ విషయం ఉంది. జెన్సన్ హువాంగ్ను తిరిగి సీఈవోగా తీసుకురావాలని ట్రంప్ స్వయంగా ఎన్విడియా బోర్డుతో మాట్లాడినట్లు వెల్లడించారు. సోమవారం సీఈఎన్బీసీతో మాట్లాడుతూ.. బోర్డుతో మాట్లాడానని, జెన్సన్ను తిరిగి తీసుకొచ్చేందుకు తానే ఒప్పించానని, ఈ వ్యవహారంలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పుకున్నారు.
ఎన్విడియా బోర్డు సమావేశంలోకి ట్రంప్ ఫోన్ ద్వారా పాల్గొని జెన్సన్ పునర్నియామకానికి మద్దతు తెలిపినట్లు కూడా సెమాఫోర్ కథనం పేర్కొంది. చివరకు బోర్డు ఆయనను తిరిగి సీఈవోగా నియమించింది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలోనూ జెన్సన్ నాయకత్వం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవసరమని ప్రశంసించారు.
ట్రంప్‌కు లాభం.. అదే సమయంలో విమర్శలు!
ఇక్కడే అమెరికాలో రాజకీయ చర్చ మొదలైంది. ఒకవైపు ట్రంప్ జెన్సన్ను తిరిగి తీసుకురావడంలో తన పాత్రను గొప్పగా చెప్పుకుంటుంటే, మరోవైపు ఆయనకు ఎన్విడియా షేర్లలో పెట్టుబడులు ఉండటం విమర్శలకు కారణమవుతోంది. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం ఎన్విడియా చిప్‌ల ఎగుమతులు, చైనాకు సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో అధ్యక్షుడి పెట్టుబడులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అరిజోనా డెమోక్రటిక్ సెనేటర్ రూబెన్ గల్లెగో ఈ వ్యవహారంలో ప్రకటనకు ముందు ఏవైనా షేర్ల లావాదేవీలు జరిగాయా అన్నదానిపై విచారణ జరగాలని కోరారు. అయితే ట్రంప్ పెట్టుబడులను స్వతంత్రంగా మూడో పక్ష ఆర్థిక సంస్థలు నిర్వహిస్తున్నాయని వైట్‌హౌస్ గతంలో వెల్లడించింది. అంతేకాదు, ట్రంప్ ఆ షేర్లను అమ్మి లాభాన్ని నగదుగా పొందినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ప్రస్తుతం చెప్పుకుంటున్నది కేవలం షేర్ల విలువ పెరగడం వల్ల వచ్చిన కాగితపు లాభం మాత్రమే.
గత నష్టాలను పూడ్చుకున్నారా?
ఇంత భారీగా లాభం వచ్చినా ట్రంప్ పెట్టుబడులకు పూర్తిగా పండగ వచ్చినట్లు కాదు. జెన్సన్ చుట్టూ వివాదాలు మొదలైన తర్వాత ఎన్విడియా షేర్లు పడిపోయాయి. ఏఐ రంగంలో పెట్టుబడుల భవిష్యత్తుపై ఆందోళనలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ఫైనాన్షియల్ టైమ్స్ అంచనా ప్రకారం, ట్రంప్ వద్ద గరిష్ఠంగా 3.70 లక్షల షేర్లు ఉన్నాయని భావించినా, తాజా ర్యాలీకి ముందు గరిష్ఠ స్థాయి నుంచి వాటి విలువలో సుమారు 42 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చు. అంటే తాజా రూ.139 కోట్ల లాభం వచ్చినంత మాత్రాన గత నష్టాలన్నీ పూడిపోయినట్లు కాదు.
–సూర్య ప్రకాష్ జోశ్యుల







