AIతో మనిషి మెదడునే హ్యాక్ చేయొచ్చా?: ఎలాన్ మస్క్ హెచ్చరికతో కొత్త చర్చ!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పటికే మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసింది. పాటలు పాడుతోంది, సినిమాలు సృష్టిస్తోంది, మనుషుల్లా మాట్లాడుతోంది. కానీ ఇకపై AI ప్రభావం మనం చూసే వీడియోలు, వినే పాటలకే పరిమితం కాబోదా? ఏకంగా మనిషి మెదడులోని భావోద్వేగాలపై కూడా ఆధిపత్యం సంపాదించబోతోందా? టెక్ ప్రపంచంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఎలాన్ మస్క్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది.
“సూపర్ ఇంటెలిజెన్స్ మీ మెదడులోని లింబిక్ సిస్టమ్‌ను హ్యాక్ చేస్తుంది” అంటూ మస్క్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు మనిషి మెదడులోని ఈ లింబిక్ సిస్టమ్ అంటే ఏమిటి? AI దాన్ని ఎలా ప్రభావితం చేయగలదు? మస్క్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి?
AI మనిషి భావోద్వేగాలను కూడా నియంత్రించబోతోందా?
రీసెంట్ గా టెడ్ అనే ఎక్స్ (X) యూజర్ షేర్ చేసిన ఓ వీడియోపై ఎలాన్ మస్క్ స్పందించారు. AI ద్వారా రూపొందించిన క్లాడియా పాప్‌స్టార్ అనే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ పాడుతున్న పాటకు సంబంధించిన వీడియో అది. ఈ వీడియోను ప్రస్తావిస్తూ.. “సూపర్ ఇంటెలిజెన్స్ మీ లింబిక్ సిస్టమ్‌ను హ్యాక్ చేస్తుంది” అంటూ మస్క్ వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క వాక్యం వెనుక చాలా పెద్ద ఆలోచన ఉంది. భవిష్యత్తులో AI కేవలం సమాచారాన్ని అందించే టెక్నాలజీగా కాకుండా, మనుషుల ఆలోచనలు, ఇష్టాలు, భావోద్వేగాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవచ్చన్నది ఆయన వ్యాఖ్యలోని భావంగా కనిపిస్తోంది.
అంటే మనకు ఏ పాట నచ్చాలి? ఏ వీడియో చూడాలి? దేనికి నవ్వాలి? దేనికి బాధపడాలి? అనే విషయాలపై కూడా AI ప్రభావం చూపించే అవకాశం ఉందన్నమాట.
అసలు ఈ లింబిక్ సిస్టమ్ అంటే ఏమిటి?
మనిషి మెదడులో లింబిక్ సిస్టమ్ అనేది భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ప్రేరణ, ప్రవర్తన వంటి అంశాలతో సంబంధం ఉన్న మెదడు నిర్మాణాల సమూహం. ఇందులో అమిగ్డాలా (Amygdala), హిప్పోకాంపస్ (Hippocampus), హైపోథాలమస్ (Hypothalamus) వంటి భాగాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఉదాహరణకు.. మనకు ఇష్టమైన పాట వినగానే పాత జ్ఞాపకాలు గుర్తుకురావడం, భయపెట్టే వీడియో చూసినప్పుడు ఆందోళన కలగడం, ఒక వ్యక్తిపై అభిమానం పెరగడం.. ఇలాంటి అనుభవాల్లో మెదడులోని ఈ వ్యవస్థకు సంబంధం ఉంటుంది.
ఇప్పుడు AI మనం ఎలాంటి కంటెంట్ చూస్తున్నాం, దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం, ఏ విషయాలకు భావోద్వేగంగా స్పందిస్తున్నాం అనే అంశాలను విశ్లేషించగలుగుతోంది. అలాంటి సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందితే, మనుషుల భావోద్వేగాలను ప్రభావితం చేసే కంటెంట్‌ను మరింత సమర్థంగా రూపొందించే అవకాశం ఉంటుంది.
అయితే AI నేరుగా మనిషి మెదడును హ్యాక్ చేస్తోందని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు. మస్క్ వ్యాఖ్యను టెక్నాలజీ భవిష్యత్తుపై చేసిన హెచ్చరికగా అర్థం చేసుకోవాలి.
AI పాటలు, వీడియోలతోనే మొదలైన పోటీ!
ఇప్పటికే AI రూపొందిస్తున్న పాటలు, వీడియోలు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు వినోద ప్రపంచంలోకి వచ్చేశాయి. చూడటానికి నిజమైన మనుషుల్లా కనిపించే డిజిటల్ పాత్రలు, ప్రొఫెషనల్ సింగర్లను తలపించే AI గొంతులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అయితే ఈ మార్పును అందరూ స్వాగతించడం లేదు. ఈ ఏడాది మార్చిలో NPR ప్రచురించిన ఓ రిపోర్ట్ ప్రకారం, యువ ప్రేక్షకుల్లో AI రూపొందించిన సంగీతంపై వ్యతిరేకత కనిపించింది. అంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, మనుషులు సృష్టించిన కళకు ఉండే ప్రత్యేకతను ప్రేక్షకులు ఇంకా కోరుకుంటున్నారన్నమాట.
సినిమా రంగంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘డ్యూన్’ చిత్రాల దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ కూడా AI వినియోగంపై తన వ్యతిరేకతను వ్యక్తం చేసారు.
ఒకవైపు AI సృష్టించే కంటెంట్ పెరుగుతుంటే, మరోవైపు అసలైన మానవ సృజనాత్మకతకు ప్రాధాన్యం తగ్గిపోతుందా? అన్న ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.
మనిషి మెదడులోకి టెక్నాలజీని తీసుకెళ్లాలనుకుంటున్న మస్క్!
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను మరింత ఆసక్తికరంగా మార్చే మరో విషయం ఆయన స్థాపించిన న్యూరాలింక్ (Neuralink). ఇది మనిషి మెదడుకు కంప్యూటర్‌తో నేరుగా అనుసంధానం కల్పించే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీపై పనిచేస్తోంది.
ఈ టెక్నాలజీ ద్వారా మెదడు నుంచి వచ్చే సంకేతాలను కంప్యూటర్లు అర్థం చేసుకునేలా చేయడం, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రించడం వంటి లక్ష్యాలపై సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే మానవులపై క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది.
అంతేకాదు, బ్లైండ్‌సైట్ (Blindsight) అనే ఇంప్లాంట్ గురించి కూడా మస్క్ ప్రచారం చేస్తున్నారు. శాశ్వతంగా చూపు కోల్పోయిన వ్యక్తులకు తిరిగి చూపును అందించడమే దీని లక్ష్యం. అయితే ఈ టెక్నాలజీ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది.
గత ఏడాది న్యూరాలింక్ తాజా నిధుల సమీకరణ తర్వాత సుమారు 9 బిలియన్ డాలర్ల విలువను చేరుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
అసలు ప్రమాదం AIలో ఉందా? దాన్ని ఉపయోగించే మనుషుల్లో ఉందా?
AI మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకునే స్థాయికి చేరితే దాని వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా కంటెంట్ అందించడం, మానసిక ఆరోగ్య సహాయక వ్యవస్థలను అభివృద్ధి చేయడం వంటి అవకాశాలు ఉన్నాయి.
అదే సమయంలో వ్యక్తుల బలహీనతలను గుర్తించి వారిని ప్రభావితం చేయడం, తప్పుడు సమాచారాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టి వ్యాప్తి చేయడం, ప్రజల అభిప్రాయాలను పరోక్షంగా మార్చడం వంటి ప్రమాదాలూ ఉన్నాయి.
మస్క్ చెప్పినట్లుగా సూపర్ ఇంటెలిజెన్స్ నిజంగానే మనిషి లింబిక్ సిస్టమ్‌ను హ్యాక్ చేస్తుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ AI మనం ఏం ఆలోచిస్తున్నాం, దేనికి ఆకర్షితులవుతున్నాం, ఎలా స్పందిస్తున్నాం అనే విషయాలపై ప్రభావం చూపించే శక్తిని సంపాదిస్తోందన్న చర్చ మాత్రం మొదలైంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







