మూసీ పునరుజ్జీవన పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
పనుల్లో వేగం పెరగాలి
మున్సిపల్ పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం
నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలి
సరైన ప్రణాళికలతో పీఆర్టీఎస్ చేపట్టాలి
జనవరిలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు
హైదరాబాద్: క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయా ప్రాజెక్టులపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతిని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మూసీ పునరుజ్జీవం ప్రాజక్టు ఫేజ్-1 లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2027 లో ఫేజ్-1 పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.
మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. జనవరి 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు అధికారులు తెలిపారు. మిరాలం చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని అధికారులు వివరించగా, రేడియల్ రోడ్ల నిర్మాణంలో పనులను మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు.
గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల పురోగతిని ఆరా తీసిన ముఖ్యమంత్రి మార్చి 2027 నాటికి పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో PRTS (Persinal Rapid Transit System) ఫేజ్-1 కు సంబంధించి టెక్నో ఎకానమీ ఫీజిబిలిటీని అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి తెలిపారు. కూకట్పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయో డైవర్సిటీ వరకు అలైన్మెంట్ సాధ్యాసాధ్యాలను వివరించారు.
బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు అలైన్మెంట్ ప్రతిపాదనల గురించి అధికారులు వివరించారు. దీంతో పాటు నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో PRTS డిపోలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
డిపో పరిసరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఉండేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. రూట్స్, డిపోల నిర్మాణం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో IIIT జంక్షన్ వద్ద ఫుట్ బ్రిడ్జికి సంబంధించి పలు డిజైన్లను కమిషనర్ ముఖ్యమంత్రి చూపించారు. డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఫుట్‌బ్రిడ్జి సమీపంలో ప్రధానంగా మల్టీ లెవెల్కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధి పనులతో మెరుగైనా రవాణా సౌకర్యం కోసం సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న ఆదేశించారు.
క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పనుల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటు ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ వివరించారు. ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్,సీఎంసీ కమిషనర్ శ్రీజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎఫ్‌సిడిఏ కమిషనర్ శశాంక, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, MRDCL ఎండీ నర్సింహా రెడ్డి, HGCL ఎండీ ఉపేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







