తిరుమల భక్తులకు టీటీడీ ఉచిత బీమా.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం!
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన శ్రీవారి యాత్ర సురక్ష (srivari yatra suraksha) ఉచిత బీమా పథకం కింద బాధిత కుటుంబాలకు పరిహార చెక్కులను అందజేశారు. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో తితిదే సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra), అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి (Ch. Venkaiah Chowdary), ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామి (R. Doraiswamy) కలిసి మృతుల కుటుంబ సభ్యులకు బీమా సొమ్మును పంపిణీ చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, గత రెండు నెలల్లో తిరుమల యాత్రకు వచ్చి సహజంగా మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా పరిహార చెక్కులను అందజేశారు. గత రెండు నెలల కాలంలో తిరుమలలో మొత్తం 17 మంది భక్తులు మరణించగా, తొలి విడతగా ఏడుగురి కుటుంబాలకు పరిహారం అందించామని, మిగిలిన 10 కుటుంబాలకు కూడా త్వరలోనే బీమా సొమ్ము చెల్లిస్తామని ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ముందుగా దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తుల వివరాలు నేరుగా ఎల్ఐసీ డేటాబేస్లో నమోదవుతాయి. టికెట్లు లేకుండా సర్వదర్శనం కోసం నేరుగా క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులను తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతికత ద్వారా గుర్తించి బీమా పరిధిలోకి తీసుకొస్తున్నారు. భక్తులతో పాటు తిరుమలలో నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులకు ఈ ఉచిత బీమా సదుపాయం వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు.







