ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం!
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న ‘నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు–బాలలు 2026’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని మిజోరం, ఒడిశా పూర్వ గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు. విశాఖపట్నంలో పూర్వ గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబుతో పాటు విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గార్లను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మహాసభల విశేషాలను ఆయన వివరించారు.
బాలల కోసం మొట్టమొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేటి తరం బాలబాలికల్లో తెలుగు భాష, సాహిత్యం , సంస్కృతి పట్ల మక్కువను, ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 20వ తేదీ ఉదయం జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను , ప్రతిభావంతులైన బాలబాలికలను సత్కరించాలని పూర్వ గవర్నర్ను కోరారు. వారి స్ఫూర్తిదాయక సందేశం పిల్లలకు ఎంతో ప్రేరణనిస్తుందని డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆకాంక్షించారు.







