పల్నాడు ప్రాజెక్టు చంద్రబాబుకు గురుదక్షిణే..! – హరీశ్ రావు
కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి రాజకీయ, జల వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు తాగునీటి పథకం చుట్టూ తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఈ పథకానికి బీఆర్ఎస్ హయాంలోనే బీజం పడిందని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశంలో తెలంగాణ అధికారుల వైఖరిపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు హాజరైన ఈ కీలక భేటీలో పల్నాడు తాగునీటి పథకంపై తెలంగాణ అధికారులు కనీసం నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. సమావేశం ముగిసిన అనంతరం ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ, పల్నాడు పథకంపై అసలు చర్చే జరగలేదని, అదొక వివాదమే కాదని ప్రకటించడాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా, ఉన్నతాధికారులు మౌనంగా ఉండటం వెనుక ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి పరోక్షంగా సహకరిస్తున్నారని, అందుకే సమావేశంలో మాట్లాడవద్దని అధికారులకు ముందే స్పష్టమైన సూచనలు వెళ్లాయని హరీష్ రావు విమర్శించారు.
ఈ వివాదంలో కీలకమైన తేదీలు, ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ హరీష్ రావు ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 2025 జనవరి 24నే పల్నాడు పథకానికి టెండర్లు పిలిచినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ నిద్రపోయిందని మండిపడ్డారు. నవంబర్ 15, 16 తేదీల్లో మీడియాలో కథనాలు రావడం, నవంబర్ 18న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నిలదీయడంతోనే ప్రభుత్వం కదిలిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ 16-11-2026 తేదీతో ‘బ్యాక్ డేట్’ లేఖ రాశారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు 16-02-2022న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవో నంబర్ 56 ద్వారానే ఈ పథకానికి అనుమతులు వచ్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్ రావు తోసిపుచ్చారు. ఆ జీవో కేవలం స్థానిక కాలువలు, చెరువుల ద్వారా నీటి సరఫరాకు ఉద్దేశించిన ఆర్థిక మంజూరు మాత్రమేనని, అందులో నాగార్జున సాగర్ రిజర్వాయర్ ప్రస్తావనే లేదని స్పష్టం చేశారు. 04-08-2026న జారీ అయిన జీవో నంబర్ 453 ద్వారానే నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఇన్టేక్ సిస్టమ్ నుంచి నేరుగా 1.865 టీఎంసీల ముడి నీటిని తీసుకునేందుకు అనుమతులు ఇచ్చారని, ఇదే తెలంగాణకు, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన వివరించారు.
గతంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రయత్నం జరిగినప్పుడు కేసీఆర్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి పోరాటానికి సిద్ధమవడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని హరీష్ రావు గుర్తుచేశారు. గోదావరిపై ఏడు ప్రాజెక్టుల రద్దు, గోదావరి – బనకచర్ల అనుసంధానం విషయంలోనూ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాత జీవోలను చూపిస్తూ, ఎదురుదాడికి దిగడం విడ్డూరంగా ఉందని హరీష్ రావు విమర్శించారు.







