ముందు చూస్తే గొయ్యి.. వెనక చూస్తే నుయ్యి! చైనా దెబ్బకు ఇరుక్కుపోయిన అమెరికా!
చైనాను దెబ్బకొట్టాలని అమెరికా చూస్తోంది.. కానీ ఆ ప్రయత్నంలో తనకే కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ శక్తిగా మళ్లీ ఎదగాలని భావిస్తున్న అగ్రరాజ్యానికి ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. చైనా రోబోలను అనుమతిస్తే భద్రతాపరమైన ఆందోళనలు.. అడ్డుకుంటే సొంత ఫ్యాక్టరీలకే ఇబ్బందులు! ఒకవైపు చైనా టెక్నాలజీ దూకుడు.. మరోవైపు అమెరికా పారిశ్రామిక అవసరాలు. వెరసి అటు చూస్తే గొయ్యి.. ఇటు చూస్తే నుయ్యి అన్నట్లుగా మారింది అగ్రరాజ్యం పరిస్థితి. అసలు చైనా రోబోలు అమెరికాకు ఇంత పెద్ద తలనొప్పిగా ఎందుకు మారాయి?
8 వేల మందిని అర్ధరాత్రి నిద్రలేపిన చైనా.. అమెరికాకు అప్పుడే తెలిసింది!
చైనా తయారీ రంగం ఎంత వేగంగా పనిచేస్తుందో చెప్పడానికి 2007లో జరిగిన ఓ సంఘటన చాలు. అప్పట్లో యాపిల్ తొలి ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఫోన్‌కు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ స్క్రీన్ స్టీవ్ జాబ్స్‌కు నచ్చలేదు. దాని స్థానంలో గ్లాస్ స్క్రీన్ పెట్టాలని నిర్ణయించారు. కానీ ఆ గ్లాస్ అప్పుడే ఫ్యాక్టరీకి చేరింది.
దీంతో చైనాలోని ఓ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి హడావుడి మొదలైంది. ఫోర్మన్ ఏకంగా 8 వేల మంది కార్మికులను నిద్రలేపాడు. ఒక్కో కార్మికుడికి బిస్కెట్, టీ ఇచ్చి.. అరగంటలోనే 12 గంటల పని షిఫ్ట్‌కు సిద్ధం చేశారు.
అదే పనిని అమెరికాలో చేయాలంటే వేలాది మంది ఇంజినీర్లను సమీకరించడానికి తొమ్మిది నెలలు పడుతుందని యాపిల్ విశ్లేషకులు అంచనా వేయగా.. చైనాలో కేవలం 15 రోజుల్లోనే సాధ్యమైంది. ఈ విషయాన్ని యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఒకరు న్యూయార్క్ టైమ్స్‌కు వెల్లడించారు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం కార్మికుల బలంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన చైనా.. ఇప్పుడు రోబోటిక్స్ రంగంలోనూ అదే దూకుడు చూపిస్తోంది. దీంతో అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది.
చైనా రోబోలపై అమెరికా ఆంక్షలు.. అసలు కథ ఇదే!
తన దేశ తయారీ రంగాన్ని తిరిగి బలోపేతం చేయాలని అమెరికా భావిస్తోంది. చైనాకు తరలిపోయిన ఫ్యాక్టరీలను తిరిగి తీసుకురావాలని, దేశంలోనే ఉత్పత్తిని పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కానీ అమెరికాలో కార్మికుల వేతనాలు ఎక్కువ. చైనాతో ధర విషయంలో పోటీ పడాలంటే ఉత్పత్తి ఖర్చు తగ్గాలి. అందుకు ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ పెరగాలి. అంటే రోబోల వినియోగం తప్పనిసరి.
ఇదే సమయంలో చైనా రోబోటిక్స్ రంగంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ ఏడాది జులైలో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) ద్వారా విదేశాల్లో తయారైన అధునాతన రోబోట్లకు కొత్త అనుమతులపై ఆంక్షలు విధించింది. పెంటగాన్ అనుమతి ఉంటేనే మినహాయింపు లభించేలా నిబంధనలు తీసుకొచ్చింది.
మరోవైపు చైనా హ్యూమనాయిడ్ రోబో కంపెనీల పరిశోధకులు, ఇంజినీర్లకు అమెరికా వీసాలు నిరాకరించినట్లు నిక్కీ ఆసియా వెల్లడించింది. ఓ కంపెనీకి చెందిన 15 మంది సాంకేతిక నిపుణుల్లో ఒక్కరికీ వీసా రాకపోవడంతో ఆ సంస్థ ప్రదర్శన నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
అంటే చైనా రోబోలను మాత్రమే కాదు.. వాటిని తయారు చేస్తున్న నిపుణులకూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే ఇక్కడే అమెరికాకు అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే తన ఫ్యాక్టరీలు సమర్థంగా పనిచేయాలంటే రోబోలు కూడా అవసరమే!
ప్రపంచ రోబోట్లలో 59 శాతం చైనాలోనే!
చైనా రోబోటిక్స్ రంగంలో ఎంత ముందుందో గణాంకాలే చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ (IFR) ప్రకారం.. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక రోబోట్లలో చైనా వాటా ఏకంగా 59 శాతం. ఆ దేశంలో 3.54 లక్షల రోబోలను ఏర్పాటు చేశారు.
అదే సమయంలో అమెరికాలో ఏర్పాటు చేసిన రోబోట్లు కేవలం 38,400 మాత్రమే. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరుగుదల నమోదైనా.. చైనాతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది.
హ్యూమనాయిడ్ రోబోట్ల విషయంలోనూ చైనాదే జోరు. ఒమ్డియా గణాంకాల ప్రకారం.. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13,318 హ్యూమనాయిడ్ రోబోలు సరఫరా కాగా, చైనాకు చెందిన అగిబాట్ (AgiBot) ఒక్కటే 5,168 రోబోలను సరఫరా చేసింది. అమెరికాకు చెందిన టెస్లా, ఫిగర్ ఏఐ సంస్థల సరఫరా మాత్రం కొన్ని వందలకే పరిమితమైంది.
అంటే రోబోట్ల తయారీలో చైనా కేవలం పోటీదారుగా మాత్రమే లేదు.. ప్రపంచ మార్కెట్లో కీలక శక్తిగా ఎదుగుతోంది.
చైనాను వద్దంటే టెస్లాకే భారీ ఖర్చు!
అమెరికా చైనా రోబోట్లను అడ్డుకోవాలని చూస్తున్నప్పటికీ.. అక్కడి కంపెనీలకు చైనా సరఫరా వ్యవస్థ అవసరం ఎంత ఉందో మోర్గాన్ స్టాన్లీ అంచనాలు చెబుతున్నాయి.
టెస్లా తయారు చేస్తున్న ఆప్టిమస్ జెన్-2 హ్యూమనాయిడ్ రోబో తయారీలో చైనా సరఫరా వ్యవస్థను పూర్తిగా తొలగిస్తే.. విడిభాగాల ఖర్చు సుమారు 46 వేల డాలర్ల నుంచి 1.31 లక్షల డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది.
అంటే చైనా విడిభాగాలు లేకుండా అదే రోబోను తయారు చేయాలంటే టెస్లాకు భారీ అదనపు ఖర్చు తప్పదు. చైనాను అడ్డుకోవాలన్న ప్రయత్నం అమెరికా కంపెనీల ఉత్పత్తి వ్యయాన్నే పెంచే ప్రమాదం ఉందన్నమాట.
ఇదే ఇప్పుడు అమెరికా ముందున్న అసలు చిక్కు. చైనా రోబోలను అనుమతిస్తే భద్రతాపరమైన ఆందోళనలు.. నిషేధిస్తే తక్కువ ఖర్చుతో తయారీని కొనసాగించడం కష్టం. వెరసి అటు చూస్తే గొయ్యి.. ఇటు చూస్తే నుయ్యి!
చైనా వ్యూహం వెనుక మరో ప్లాన్!
చైనా ప్రభుత్వం రోబోటిక్స్ రంగాన్ని కేవలం ప్రదర్శనలకే పరిమితం చేయడం లేదు. వాస్తవిక పరిస్థితుల్లో రోబోలు పనిచేసేలా భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ఈ ఏడాది జూన్‌లో చైనాకు చెందిన రెండు ప్రభుత్వ సంస్థలు 10 ప్రావిన్సులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఒక్కో ప్రావిన్స్‌లో కనీసం 20 వాస్తవిక పని పరిస్థితులను గుర్తించి హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇవ్వాలని సూచించాయి.
చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా ఈ ఏడాది 6.8 బిలియన్ యువాన్లు (సుమారు 1.02 బిలియన్ డాలర్లు) కేటాయించింది. విద్యుత్ సబ్స్టేషన్ల తనిఖీలు, గ్రిడ్ నిర్వహణ కోసం హ్యూమనాయిడ్ రోబోలు, రెండు చేతుల రోబోలు, రోబో కుక్కలను ఉపయోగించేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది.
అయితే చైనా రోబోటిక్స్ రంగంలో ప్రభుత్వ సబ్సిడీలు, కొనుగోళ్లపై ఆధారపడటం, కొన్ని రోబోలు వాస్తవ పనుల కంటే ప్రదర్శనలకే పరిమితం కావడం వంటి విమర్శలూ ఉన్నాయి. అయినప్పటికీ వాస్తవిక పరిస్థితుల్లో వాటికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం భవిష్యత్తులో చైనాకు ఉపయోగపడవచ్చు.
ఇవి కూడా చదవండి
అమెరికా అసలు సమస్య ఎక్కడుంది?
అమెరికా తయారీ రంగం ఇతర దేశాలకు తరలిపోవడంతో కేవలం ఫ్యాక్టరీలనే కాదు.. వాటికి అవసరమైన నైపుణ్యాలను కూడా కోల్పోయిందని నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు.
హార్వర్డ్ ప్రొఫెసర్లు గ్యారీ పిసానో, విల్లీ షిహ్ 2009లోనే ఈ విషయాన్ని ప్రస్తావించారు. తయారీని ఇతర దేశాలకు తరలించడం వల్ల నైపుణ్యం కలిగిన కార్మికులు, ఇంజినీర్లు, విడిభాగాల సరఫరాదారులు, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసే సామర్థ్యం కూడా అక్కడికే వెళ్లిపోతుందని హెచ్చరించారు.
2015లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా అమెరికాలోని టూల్ అండ్ డై తయారీ నిపుణులందరినీ ఒకే గదిలో పట్టించవచ్చని, చైనాలో అలాంటి నిపుణులు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో ఉంటారని వ్యాఖ్యానించారు.
ఒక పరిశ్రమ బలంగా ఉండాలంటే యంత్రాలు ఉంటే సరిపోదు. వాటిని తయారు చేసే నిపుణులు, మరమ్మతులు చేసే సాంకేతిక సిబ్బంది, విడిభాగాలు అందించే సంస్థలు కూడా ఉండాలి. ఈ వ్యవస్థనే అమెరికా క్రమంగా కోల్పోయింది. ఇప్పుడు రోబోటిక్స్ రంగంలోనూ ఇదే సమస్య ఎదురవుతోంది.
భారత్‌కు కూడా ఇదొక హెచ్చరికే!
అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఈ పోరు భారత్‌కు కూడా కీలకమే. మన దేశం తయారీ రంగాన్ని విస్తరించాలని, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇతర పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది.
చైనా రోబోటిక్స్ రంగంలో మరింత ముందుకు వెళ్తే భారతీయ కంపెనీలకు తక్కువ ధరకు ఆటోమేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో చైనా కంపెనీలతో పోటీ పడటం భారతీయ తయారీ సంస్థలకు సవాలుగా మారవచ్చు.
అమెరికా, చైనా మధ్య సరఫరా వ్యవస్థలు విడిపోతే ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల కోసం ప్రపంచ కంపెనీలు ఇతర దేశాల వైపు చూడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో భారత్‌కు అవకాశాలు రావచ్చు. అయితే వాటిని అందిపుచ్చుకోవాలంటే మన దేశం కూడా రోబోటిక్స్, ఆటోమేషన్, అధునాతన తయారీ రంగాల్లో తన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.
చివరకు అమెరికా ఏం చేయబోతోంది?
చైనాను అడ్డుకోవడం అమెరికాకు ఒక వ్యూహాత్మక అవసరం కావచ్చు. కానీ ఆంక్షలు విధించడం ఒక్కటే పరిష్కారం కాదు. తన దేశంలోనే రోబోటిక్స్ పరిశోధన, తయారీ నైపుణ్యాలు, విడిభాగాల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి. అప్పుడే చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోగలదు.
లేకపోతే చైనా రోబోలను అడ్డుకున్నా అమెరికా ఫ్యాక్టరీలకు ఖర్చుల భారం తప్పదు. అనుమతించినా భద్రతాపరమైన ఆందోళనలు వెంటాడుతాయి. ఇదే ఇప్పుడు అగ్రరాజ్యానికి ఎదురైన అసలైన తలనొప్పి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







