రోజూ గంటపాటు థెరపీ.. ఎన్విడియా బాస్‌కు ఏమైంది? భార్యతో మాట్లాడటమే కష్టమైందట!
ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియాకు అధినేతగా ఉన్నారు జెన్సన్ హువాంగ్. వేల కోట్ల వ్యాపార నిర్ణయాలు తీసుకునే ఆయనకు ఉద్యోగుల ముందు మాట్లాడటం కష్టమైందంటే నమ్ముతారా? పోనీ ఉద్యోగులతో మాట్లాడటమేనా అంటే.. అంతకంటే తన భార్యతో మాట్లాడటమే మరింత కష్టంగా అనిపించిందట! అంతేకాదు, ప్రతిరోజూ గంటకు పైగా థెరపీ తీసుకుంటున్నానని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్పారు ఆయన? ఎన్విడియాలో అసలేం జరిగింది?
11 రోజుల విరామం.. మళ్లీ సీఈఓ కుర్చీలోకి!
దాదాపు 30 ఏళ్ల క్రితం ఎన్విడియాను స్థాపించిన జెన్సన్ హువాంగ్.. నవంబర్ 12న అనూహ్యంగా సీఈఓ పదవికి దూరమయ్యారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు బయటకు రావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు రావడం, అందులో ఒకరు కంపెనీలో పనిచేసే ఉద్యోగిని కావడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. మరో మహిళకు చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు అమెరికా అధికారులకు ఉన్నట్లు కూడా కథనాలు వచ్చాయి.
ఈ వ్యవహారం కంపెనీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో నవంబర్ 12న పదవికి దూరమైన హువాంగ్.. కేవలం 11 రోజుల తర్వాత మళ్లీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తిరిగి రావడంతో కంపెనీలో నెలకొన్న నాయకత్వ అనిశ్చితికి తెరపడింది. అయితే ఈసారి ఆయన ఉద్యోగుల ముందుకు వచ్చింది కంపెనీ విజయాల గురించి చెప్పడానికి కాదు.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి!
‘నేను కొన్ని భయంకరమైన తప్పులు చేశాను’.. ఉద్యోగుల ముందు క్షమాపణలు
మంగళవారం ఎన్విడియా ఉద్యోగులందరితో హువాంగ్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన చర్యల వల్ల తీవ్రమైన తప్పులు జరిగాయని అంగీకరించారు. ‘నేను కొన్ని భయంకరమైన తప్పులు చేశాను’ అని ఉద్యోగులతో చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం వెల్లడించింది.
ఈ పరిణామాల వల్ల తన భార్య, పిల్లలు కూడా బాధపడాల్సి వచ్చిందని, వారిని క్షమాపణ కోరినట్లు హువాంగ్ తెలిపారు. తిరిగి కంపెనీ బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఉద్యోగుల ముందు నిలబడి ఈ విషయాలన్నీ మాట్లాడటం తనకు ఎంతో కష్టంగా అనిపించిందట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగులతో మాట్లాడటం కంటే తన భార్యతో మాట్లాడటమే ఇంకా కష్టంగా అనిపించిందని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
రోజూ గంటకు పైగా థెరపీ.. హువాంగ్‌పై అంత ఒత్తిడి ఉందా?
ఈ సమావేశంలో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఆయన థెరపీ గురించి చేసిన వ్యాఖ్యే. తాను ప్రతిరోజూ గంటకు పైగా థెరపీ తీసుకుంటున్నానని ఉద్యోగులకు వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిణామాలు, కుటుంబంతో తలెత్తిన పరిస్థితులు తనపై ఎంతటి ప్రభావం చూపాయో ఆయన మాటల్లో కనిపించింది.
సాధారణంగా పెద్ద కంపెనీల సీఈఓలు ఉద్యోగులతో సమావేశమైనప్పుడు వ్యాపార లక్ష్యాలు, కొత్త ప్రాజెక్టులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతుంటారు. కానీ హువాంగ్ మాత్రం తన వ్యక్తిగత తప్పులు, కుటుంబ పరిస్థితులు, మానసిక ఒత్తిడి గురించి కూడా మాట్లాడారు. ఉద్యోగుల ముందు ఈ విషయాలను పంచుకోవడం తన జీవితంలో అత్యంత కష్టమైన సమావేశాల్లో ఒకటని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ జోక్యంతోనే మళ్లీ పదవి వచ్చిందా?
హువాంగ్ తిరిగి సీఈఓగా రావడం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందనే ప్రచారం కూడా పెద్ద చర్చకు దారితీసింది. హువాంగ్ తిరిగి రావాలని తానే స్వయంగా ఎన్విడియా బోర్డుతో మాట్లాడినట్లు ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. ఆయన పునర్నియామకం కోసం ట్రంప్‌తో పాటు ప్రభుత్వంలోని కొందరు కీలక అధికారులు ప్రయత్నించినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి.
అయితే ఉద్యోగులతో జరిగిన సమావేశంలో హువాంగ్ మాత్రం ఈ ప్రచారానికి భిన్నంగా స్పందించారు. తనను తిరిగి నియమించాలనే నిర్ణయం పూర్తిగా కంపెనీ బోర్డుదేనని స్పష్టం చేశారు. తాను టెక్ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిని కావడం వల్లే తిరిగి అవకాశం వచ్చిందన్న వాదనను కూడా తోసిపుచ్చారు.
కంపెనీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అంగీకరించినప్పటికీ, నిబంధనల ఉల్లంఘన జరిగిన ప్రతిసారీ ఉద్యోగిని తొలగించాల్సిన అవసరం లేదని వివరించారు. ఆయా పరిస్థితులను బట్టి యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్లు సమాచారం.
ఎన్విడియాలో హువాంగ్ తర్వాత ఎవరు? వారసుడే లేరట!
ఈ సమావేశంలో కంపెనీ అంతర్గత నిర్వహణ విధానం గురించి కూడా హువాంగ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తనకు నేరుగా రిపోర్ట్ చేసే అధికారులు కొన్ని డజన్ల మంది ఉన్నారని, కంపెనీలో అధికారికంగా ప్రకటించిన సీఈఓ వారసుడు ఎవరూ లేరని వెల్లడించారు.
ఎన్విడియా నిర్వహిస్తున్న విభిన్న వ్యాపార విభాగాలకు ఈ తరహా నిర్మాణమే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లందరికీ తనతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండటం వల్ల చర్చల్లో ప్రతి ఒక్కరికీ సమానంగా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంటుందని వివరించారు.
హువాంగ్ పదవి నుంచి తప్పుకున్న సమయంలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు బోర్డు కంపెనీ లోపల, బయట ఉన్న నాయకుల్లో తదుపరి సీఈఓ ఎవరనే అంశాన్ని పరిశీలించింది. చివరకు హువాంగ్నే తిరిగి నియమించడంతో ఆ అనిశ్చితికి తెరపడింది.
గంటపాటు మాట్లాడారు.. కానీ ఉద్యోగుల ప్రశ్నలకు నో ఛాన్స్!
సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో హువాంగ్ తన వ్యక్తిగత జీవితం, కంపెనీ నిబంధనల ఉల్లంఘన, తిరిగి బాధ్యతలు చేపట్టడం, ఎన్విడియా నిర్వహణ విధానం వంటి అంశాలపై మాట్లాడారు. అయితే ఇంతసేపు మాట్లాడినప్పటికీ ఉద్యోగుల నుంచి ప్రశ్నలు స్వీకరించలేదు. దీంతో సమావేశం పూర్తిగా ఆయన వివరణకే పరిమితమైంది.
ఒకవైపు ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత కీలకమైన కంపెనీకి తిరిగి నాయకత్వం వహిస్తున్న హువాంగ్.. మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిణామాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఈఓ కుర్చీ తిరిగి దక్కినా, కుటుంబంతో సంబంధాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లు మాత్రం అంత సులభంగా పరిష్కారమయ్యేవి కావని ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







