మళ్లీ మొదలైన ట్రంప్ టారిఫ్‌ల తుఫాన్: 16 దేశాలు టార్గెట్.. లిస్ట్‌లో భారత్ ఉందా?
ప్రపంచ దేశాలకు మరోసారి ట్రంప్ టారిఫ్‌ల టెన్షన్ మొదలైంది. అమెరికా మార్కెట్లో తమ వస్తువులు అమ్ముకోవాలంటే ఇకపై మరింత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చనే విధంగా విధానాల మార్పు జరుగుతోంది. చైనా, యూరప్ సహా 16 ఆర్థిక వ్యవస్థలపై కొత్త దిగుమతి సుంకాలు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు రావడంతో అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం మొదలైంది. ఈ క్రమంలో భారత్ కూడా ట్రంప్ టారిఫ్‌ల వలలో చిక్కుకోబోతోందా? ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్న భారత్‌కు ఇప్పుడు కొత్త సుంకాల రూపంలో మరో పరీక్ష ఎదురుకాబోతోందా?
ట్రంప్ మళ్లీ తన పాత అస్త్రాన్నే బయటకు తీశారు. అదే టారిఫ్‌లు! అమెరికా మార్కెట్లో విదేశీ కంపెనీలు తమ వస్తువులను అమ్ముకుంటూ లాభాలు సంపాదిస్తున్నాయని, కానీ వాటికి పోటీగా నిలవాల్సిన అమెరికా కంపెనీలు మాత్రం ఇబ్బందులు పడుతున్నాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కారణం విదేశీ ప్రభుత్వాలు తమ దేశంలోని పరిశ్రమలకు భారీగా సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడమేనని ఆరోపిస్తోంది. దీంతో తక్కువ ఖర్చుతో తయారైన వస్తువులు ప్రపంచ మార్కెట్లలోకి వచ్చి అమెరికా కంపెనీల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని వాదిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మరోసారి దిగుమతి సుంకాలను పెంచాలని చూస్తోంది. అంటే అమెరికాలోకి వస్తువులు అమ్మాలనుకునే దేశాలకు ఇకపై మరింత ఖర్చు తప్పకపోవచ్చు.
16 దేశాలపై అమెరికా గురి.. ఈసారి ఏం జరగబోతోంది?
ఈ కొత్త టారిఫ్‌ల వ్యవహారం వెనుక ఇప్పటికే కొన్ని నెలలుగా సాగుతున్న విచారణ ఉంది. చైనా, యూరోపియన్ యూనియన్‌తో పాటు మరో 14 ఆర్థిక వ్యవస్థలు తమ పరిశ్రమలకు ఎంత మేరకు ప్రభుత్వ సాయం అందిస్తున్నాయన్న అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. మార్చిలో ప్రారంభమైన ఈ విచారణకు సంబంధించిన ఫలితాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే ప్రకటన తేదీ మారే అవకాశమూ ఉందని సమాచారం.
అమెరికా వాదన ప్రకారం.. విదేశీ ప్రభుత్వాలు తమ తయారీ కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల ఆ కంపెనీలు అవసరానికి మించి వస్తువులను ఉత్పత్తి చేసి, తక్కువ ధరలకు ఇతర దేశాల మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. దీంతో అమెరికా తయారీ సంస్థలు పోటీలో వెనుకబడుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాలంటే విదేశీ వస్తువులపై సుంకాలు పెంచడం తప్ప మరో మార్గం లేదన్నది ట్రంప్ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
చైనాకు భారీ షాక్.. 20 శాతానికి చేరుతాయా సుంకాలు?
ఈ మొత్తం వ్యవహారంలో చైనాకే ఎక్కువ ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్లీ సుంకాలు పెంచితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారవచ్చు. ఇప్పటికే చైనా వస్తువులపై అదనంగా 7.5 శాతం పాయింట్ల సుంకం విధించే ప్రతిపాదనను అమెరికా పరిశీలించింది. అదే జరిగితే సాధారణ సుంకాల రేటు 12.5 శాతం నుంచి 20 శాతానికి చేరే అవకాశం ఉంటుంది.
చైనా ఒక్కటే కాదు.. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియాలకూ కొత్త సుంకాల సెగ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఉన్న సుమారు 10 నుంచి 12.5 శాతం సుంకాలను 15 శాతం వరకు పెంచే అంశం చర్చలో ఉంది. అయితే తుది రేట్లు ఇంకా ఖరారు కాలేదు.
అసలు టెన్షన్ భారత్ గురించే..
చైనా, యూరప్‌లపైనే ఎక్కువగా చర్చ జరుగుతున్నా.. తాజా పరిణామాలు భారత్‌కూ కొత్త సుంకాల ముప్పు ఉండొచ్చని సూచిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, భారత్ కూడా ఈ విచారణ పరిధిలో ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. భారత్, వియత్నాం వంటి దేశాలకు విధించే సుంకాలు అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల నిబంధనలపై ఆధారపడి ఉండొచ్చని సమాచారం.
భారత్‌తో అమెరికా ఇప్పటికే వాణిజ్య చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, ఆ చర్చల ఫలితాలు ఇక్కడ కీలకంగా మారనున్నాయి. అమెరికా మార్కెట్‌పై ఆధారపడే భారత ఎగుమతిదారులకు ఈ పరిణామాలు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి.
ట్రంప్ టారిఫ్‌లకు అమెరికాలోనే వ్యతిరేకత.. అయినా ఎందుకీ పట్టుదల?
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలోనే విమర్శలు పెరుగుతున్నాయి. విదేశీ వస్తువులపై పన్నులు పెంచితే అమెరికా కంపెనీలకు రక్షణ లభిస్తుందేమో కానీ, ఆ వస్తువులను కొనుగోలు చేసేది చివరికి అక్కడి ప్రజలే కదా! దిగుమతి ఖర్చులు పెరిగితే కంపెనీలు ఆ భారాన్ని వస్తువుల ధరల రూపంలో వినియోగదారులపైకి నెట్టే అవకాశం ఉంటుంది. ఫలితంగా సామాన్య అమెరికన్లకు నిత్యావసరాల నుంచి ఇతర వస్తువుల వరకు ధరల భారం పెరుగుతుంది.
ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేసిన వారిలో దాదాపు మూడింట రెండొంతుల మంది ట్రంప్ టారిఫ్‌ల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగిందని అభిప్రాయపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ సర్వే వెల్లడించింది. రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ సైతం టారిఫ్‌ల కారణంగా వస్తువుల ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలతో ఉన్న అసమతుల్యతను సరిచేయాల్సిందేనని వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ వాదిస్తున్నారు.
ఈ టారిఫ్‌ల తుఫాన్ ఎక్కడికి దారితీస్తుంది?
ఒకప్పుడు అమెరికా మార్కెట్లోకి తమ వస్తువులను ఎగుమతి చేయటం పెద్ద విషయంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అదే మార్కెట్లో వ్యాపారం చేయాలంటే రాజకీయ నిర్ణయాలు, వాణిజ్య ఒప్పందాలు, టారిఫ్‌ల లెక్కలు అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇక భారత్ విషయానికి వస్తే అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే, భారత ఎగుమతులపై కొత్త సుంకాల భారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాలు కొత్త నిర్ణయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? అన్నది తేలాల్సి ఉంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







