60 వేల మంది పిల్లలకు భారత సంతతి బిలియనీర్ భారీ సాయం.. ఎవరీయన?
అమెరికాలో ఓ భారత సంతతి బిలియనీర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాను పెరిగిన నగరంలోని 60 వేల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఏకంగా రూ.56 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకొచ్చారు. అదీ పిల్లల చేతికి నేరుగా డబ్బులు ఇవ్వడం కాదు.. ఒక్కొక్కరి పేరుతో ప్రత్యేక ఖాతాలో పెట్టుబడిగా జమ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి సుమారు రూ.9,281 అందేలా ఈ భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇంతకీ ఈ ఉదారత చూపిస్తున్న వ్యక్తి ఎవరు? అమెరికాలో అంతటి సంపదను ఎలా సంపాదించారు? పిల్లల కోసం ఆయన ఎంచుకున్న ఈ ప్రత్యేక పథకం ఏమిటి?
ఎవరీ నీల్ మెహతా?
భారత సంతతికి చెందిన నీల్ మెహతా అమెరికాలో ప్రముఖ బిలియనీర్, పెట్టుబడిదారుగా గుర్తింపు పొందారు. ఆయన గ్రీన్ఓక్స్ క్యాపిటల్ (Greenoaks Capital) అనే పెట్టుబడి సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్నర్. 2012లో ఈ సంస్థను ప్రారంభించారు. అంతకుముందు ప్రముఖ హెడ్జ్ ఫండ్ సంస్థ డీఈ షా (DE Shaw)లో పనిచేశారు. అక్కడ సంపాదించిన అనుభవంతో సొంతంగా పెట్టుబడి సంస్థను ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.
ఆయన సంస్థ పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఆంత్రోపిక్, డేటాబ్రిక్స్, స్ట్రైప్, విజ్, దక్షిణ కొరియాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం కూపాంగ్ వంటి ప్రముఖ సంస్థలున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, ఆన్లైన్ చెల్లింపులు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఎదుగుతున్న కంపెనీలను ముందుగానే గుర్తించి పెట్టుబడులు పెట్టడం గ్రీన్ఓక్స్ ప్రత్యేకత. 2021లో కూపాంగ్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన సమయంలో నీల్ మెహతా ఆ కంపెనీ బోర్డులోనూ సభ్యుడిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
సొంత నగరంపై ప్రత్యేక అభిమానం.. గతంలోనూ భారీ విరాళం
నీల్ మెహతా శాన్ఫ్రాన్సిస్కోలో పెరిగారు. అందుకే ఆ నగరంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన వ్యాపారాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తాను పెరిగిన నగర అభివృద్ధికి కూడా తన వంతు సాయం అందిస్తున్నారు. 2024లో శాన్ఫ్రాన్సిస్కోలోని చారిత్రక భవనాలు, పాత వ్యాపార ప్రాంతాలను పునరుద్ధరించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్లు (10 కోట్ల డాలర్లు) విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ముఖ్యంగా ఫిల్మోర్ స్ట్రీట్ ప్రాంతంలోని పాత భవనాలు, వ్యాపారాలకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలన్నది ఆయన లక్ష్యం.
ఇప్పుడు అదే నగరంలోని పిల్లల భవిష్యత్తు కోసం మరోసారి భారీ విరాళం ప్రకటించారు. తన భార్య జాష్తో కలిసి 60 లక్షల డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.55.75 కోట్లు అందించేందుకు ముందుకొచ్చారు. శాన్ఫ్రాన్సిస్కోలో పెరుగుతున్న పిల్లలు కూడా నగరం అందించే భవిష్యత్తు అవకాశాల్లో భాగస్వాములు కావాలన్నదే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు.
ఒక్కో చిన్నారికి రూ.9 వేలకుపైగా.. ఎలా అందిస్తారు?
నీల్ మెహతా దంపతులు ప్రకటించిన ఈ విరాళం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో అమలవుతున్న ‘ట్రంప్ అకౌంట్స్’ కార్యక్రమం ద్వారా పిల్లలకు చేరనుంది. ఈ పథకం ఉద్దేశం చిన్న వయసులోనే పిల్లల పేరుతో పెట్టుబడి ఖాతాలు ఏర్పాటు చేసి, వారు పెద్దయ్యే సమయానికి ఆర్థికంగా కొంత ప్రయోజనం కల్పించడం. ఈ విరాళం ద్వారా శాన్ఫ్రాన్సిస్కోలో నివసిస్తూ 2016 నుంచి 2024 మధ్య జన్మించిన అర్హులైన 60 వేల మంది పిల్లలకు ఒక్కొక్కరికి 100 డాలర్లు (సుమారు రూ.9,281) జమ చేయనున్నారు.
అయితే ఈ డబ్బును పిల్లలు వెంటనే తీసుకుని ఖర్చు చేయలేరు. తల్లిదండ్రులు ముందుగా అధికారిక TrumpAccounts.gov వెబ్సైట్ లేదా యాప్ ద్వారా పిల్లల ఖాతాలను క్లెయిమ్ చేసి యాక్టివేట్ చేయాలి. పిల్లల పేరు, పుట్టిన తేదీ, సోషల్ సెక్యూరిటీ నంబర్ వంటి వివరాలను ధ్రువీకరించిన తర్వాత ఖాతాలో విరాళం జమ అవుతుంది.
18 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడిగానే డబ్బు
ఈ ఖాతాల్లో జమయ్యే మొత్తం పిల్లలకు 18 ఏళ్లు వచ్చే క్యాలెండర్ సంవత్సరం జనవరి 1 వరకు పెట్టుబడిగా కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక చిన్నారికి 2040 సెప్టెంబర్లో 18 ఏళ్లు పూర్తవుతాయనుకుంటే, అదే ఏడాది జనవరి 1 నుంచి తదుపరి దశ నిబంధనలు వర్తిస్తాయి. ఆ తర్వాత డబ్బు ఉపసంహరణకు అమెరికాలోని సంప్రదాయ వ్యక్తిగత రిటైర్మెంట్ ఖాతాల తరహా నిబంధనలు వర్తించవచ్చు. అవసరాన్ని బట్టి పన్నులు, పెనాల్టీలు కూడా ఉండే అవకాశం ఉంది. పెట్టుబడుల విలువ మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఎంత మొత్తం వస్తుందనేది ముందుగానే చెప్పలేం.
ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖుల మద్దతు
ట్రంప్ అకౌంట్స్ కార్యక్రమానికి నీల్ మెహతా దంపతులే కాకుండా అమెరికాలోని పలువురు ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించారు. మైఖేల్ డెల్, సుసాన్ డెల్, ఎలాన్ మస్క్, రే డాలియో, బార్బరా డాలియో, గ్విన్ షాట్వెల్, ప్రముఖ గాయని నిక్కీ మినాజ్ వంటి పేర్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన విరాళాల చర్చలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్లాక్రాక్, ఎన్విడియా, జేపీ మోర్గాన్ చేజ్, డెల్టా ఎయిర్లైన్స్, వీసా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చే ఉద్దేశాన్ని వెల్లడించాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







