తనలాగే మాట్లాడే ఏఐ క్లోన్‌ను పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ!
సినిమాల్లోనే కాదు.. టెక్నాలజీ విషయంలోనూ ఎప్పుడూ తనదైన శైలిలో ఆలోచించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి ఏకంగా తనకో డిజిటల్ రూపాన్ని సృష్టించుకున్నారు. తనలాగే ఆలోచించే, తన అభిప్రాయాలకు అనుగుణంగా సమాధానాలు చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్లోన్‌ను పరిచయం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. “నేను చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటాను” అంటూ తన ఏఐ అవతార్ గురించి ప్రకటించారు.
నవంబర్ 24, 2026న రామ్ గోపాల్ వర్మ ఈ కొత్త ప్రయోగాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ‘Ask RGV’ పేరుతో రూపొందించిన ఈ వెబ్సైట్ ద్వారా ఎవరైనా తనను ఏ ప్రశ్నైనా అడగవచ్చని, తన ఆలోచనా విధానం, నమ్మకాలు, వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే సమాధానాలు పొందవచ్చని వెల్లడించారు. అంటే వర్మను నేరుగా కలవకుండానే.. ఆయనతో మాట్లాడుతున్న అనుభూతిని ఈ డిజిటల్ క్లోన్ కలిగించబోతోందన్నమాట!
అసలు ఈ ఏఐ వర్మ ఎలా పనిచేస్తుంది?
ఈ డిజిటల్ క్లోన్‌ను ఏఐ ఇంజినీర్ హరి గాడిపూడి రూపొందించారు. ‘Ask RGV’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూల్ ప్రధానంగా వర్మ చెప్పుకునే ‘రామూయిజం’ (Ramuism) అనే వ్యక్తిగత తత్వాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది.
వర్మ ఆలోచనలు, ఆయన నమ్మకాలు, ప్రపంచాన్ని చూసే విధానం.. వీటి ఆధారంగా ఈ ఏఐ క్లోన్ సమాధానాలు ఇస్తుంది. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో యూజర్లు కొద్దిసేపు మాత్రమే కొనసాగే సెషన్లలో మాట్లాడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి ఇది పూర్తి స్థాయి వెర్షన్ కాదు. కొత్త టెక్నాలజీ ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు ఇచ్చిన ప్రారంభ అనుభవం మాత్రమే.
అయితే రాబోయే వెర్షన్లలో మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్లు తీసుకురావాలని వర్మ బృందం భావిస్తోంది. తన స్నేహితులను గుర్తించడం, తన అభిరుచులకు అనుగుణంగా సినిమా కథలను విశ్లేషించడం, సరికొత్త కథలు రాయడం వంటి సామర్థ్యాలను ఇందులో చేర్చాలనుకుంటున్నారు. అంతేకాదు.. ఏకంగా ఏఐ సాయంతో పూర్తి నిడివి సినిమాలను కూడా రూపొందించేలా దీన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నా కంటే నా ఏఐ క్లోన్కే ఎక్కువ తెలుసు!
ఈ కొత్త ప్రయోగాన్ని పరిచయం చేసిన కొన్ని గంటలకే వర్మ మరో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. తన డిజిటల్ క్లోన్ గురించి మాట్లాడుతూ.. “నా నాలెడ్జ్ కంటే నా డిజిటల్ క్లోన్కే ఎక్కువ తెలుసున్నట్టుంది” అనే అర్థం వచ్చేలా సరదాగా వ్యాఖ్యానించారు.
ఇది చూస్తుంటే వర్మ తన డిజిటల్ అవతార్‌ను ఎంత ఆసక్తిగా గమనిస్తున్నారో అర్థమవుతోంది. సాధారణంగా ఏఐ టూల్స్‌ను ప్రశ్నలకు సమాధానాలు చెప్పే యంత్రాలుగా చూస్తుంటే.. వర్మ మాత్రం తన వ్యక్తిత్వాన్నే ఒక డిజిటల్ వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఏఐ గురించి వర్మకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన అభిప్రాయం
నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వర్మకు ఉన్న ఆసక్తి ఇప్పటిది కాదు. 2025లోనే ఏఐ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా విద్యావ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
పాతకాలపు జ్ఞాపకశక్తి ఆధారిత చదువులు ఇకపై పెద్దగా ఉపయోగపడవని, ఏఐకి అనుగుణంగా మారని యూనివర్సిటీలు, విద్యా విధానాలు విద్యార్థులను వెనక్కి నెట్టేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే ఏఐ టెక్నాలజీని తన వ్యక్తిత్వానికి డిజిటల్ రూపం ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు.
ఏఐ ప్రయోగాల మధ్య మరో సినిమా కూడా!
ఒకవైపు ఏఐ ప్రపంచంలో కొత్త ప్రయోగాలు చేస్తూనే మరోవైపు తన సినిమా ప్రాజెక్టులను కూడా కొనసాగిస్తున్నారు వర్మ. ఆయన రూపొందిస్తున్న క్రైమ్ డ్రామా ‘పోలీస్ కంపెనీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
హర్షవర్ధన్ రాణే, ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 4న థియేటర్లలో విడుదల కానున్నట్లు బాలీవుడ్ హంగామా వెల్లడించింది.
మొత్తానికి ఇప్పటివరకు సినిమాల్లో సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు తనకంటూ ఒక ఏఐ వెర్షన్‌ను సృష్టించుకుని మరో కొత్త చర్చకు తెరలేపారు. మనుషులు లేకపోయినా వారి ఆలోచనలు, మాటలు, వ్యక్తిత్వం డిజిటల్ రూపంలో కొనసాగగలదా? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ‘డిజిటల్ వర్మ’ భవిష్యత్తులో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







