విశ్వసుందరి జెన్నిఫర్ బారెటో..! ప్యూర్టోరికో భామకు కిరీటం..!
మిస్ యూనివర్స్ 2026గా జెన్నిఫర్ బారెటో ఎంపికయ్యారు. 75వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto) సొంతం చేసుకున్నారు. మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ (గత ఏడాది విజేత).. జెన్నిఫర్‌కు ఈ కిరీటాన్ని అలంకరించారు.
ప్యూర్టోరికోలోని శాన్జువాన్లో జరిగిన ఈ పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఇక భారత్ తరఫున పోటీపడిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో టాప్-30లో చోటు దక్కించుకున్నారు. అయితే, టాప్-12కు చేరకుండానే ఆమె ప్రయాణం ముగిసింది.
ప్రశ్నకు అదిరిపోయే సమాధానం..
ఫైనల్ రౌండ్లో ఐదుగురు పోటీదారులనూ ‘ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి ఏం కావాలి?’ అని ప్రశ్నించారు. దీనికి జెన్నిఫర్ (Miss Universe 2026 Winner) స్పందిస్తూ.. ప్రపంచానికి వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు సహానుభూతి (Empathetic) కలిగిన నాయకులు అవసరమని పేర్కొన్నారు. ఇతరులను విమర్శించడం కాకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తమ విలువలకు కట్టుబడి ఆదర్శంగా నిలవాలని చెప్పి న్యాయనిర్ణేతల మనసు గెలుచుకున్నారు.
ఇవి కూడా చదవండి
పోటీలకు 75 ఏళ్లు.. విశ్వసుందరికి ప్రత్యేక కిరీటం..!
మిస్ యూనివర్స్ పోటీలు 1952లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కిరీటాన్ని రూపొందించారు. ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో రూపొందించిన ఈ కిరీటంలో 3,150 వజ్రాలను ఉపయోగించారు.
ప్యూర్టోరికో నుంచి అందగత్తెలు..
జెన్నిఫర్ విజయంతో ప్యూర్టోరికోకు ఆరోసారి మిస్ యూనివర్స్ టైటిల్ దక్కింది. గతంలో ఆ దేశం నుంచి ఐదుగురు ఈ ఘనత సాధించారు. 1970, 1985, 1993, 2001, 2006, 2026 సంవత్సరాల్లో ఈ దేశ భామలు విశ్వసుందరి కిరీటాలను సొంతం చేసుకున్నారు. 2027లో జరగనున్న 76వ మిస్ యూనివర్స్ పోటీలకు వియత్నాం ఆతిథ్యం ఇవ్వనుంది.







