ఒక్క చుక్క రక్తంతో ప్రపంచాన్ని మార్చేస్తానంది.. చివరకు జైలుపాలైంది! రికార్డ్ క్రియేట్ చేస్తున్న డాక్యుమెంటరీ
సినిమా అంటేనే భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు గుర్తొస్తాయి. కానీ అలాంటివేవీ లేకుండా ఒక వ్యక్తి నిజ జీవిత కథతో రూపొందించిన డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదే ‘యూ కెన్ సీ ఎవ్రీథింగ్’ (You Can See Everything). ప్రముఖ నిర్మాణ సంస్థ A24 నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 102.4 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. భారత కరెన్సీలో సుమారు రూ.900 కోట్లకు పైగానే ఉంటుంది. కేవలం 7 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. అమెరికా, కెనడా మార్కెట్లలో ఇప్పటికే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్-మ్యూజిక్ డాక్యుమెంటరీగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
అసలు ఈ డాక్యుమెంటరీ ఇంత గొప్పగా ఎందుకు మారింది?
ఈ డాక్యుమెంటరీ సినిమా విజయానికి ప్రధాన కారణం దాని కథలోని అసాధారణమైన మలుపులు. ఒకప్పుడు ప్రపంచాన్ని మార్చేస్తానని చెప్పిన టెక్ వ్యాపారవేత్త.. చివరకు పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి రావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అయితే దర్శకులు ఈ కథను సాధారణ జీవిత చరిత్రలా తెరకెక్కించలేదు.
నాథన్ ఫీల్డర్, లాన్స్ ఒపెన్హైమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు మూడేళ్లపాటు రహస్యంగా చిత్రీకరించారు. విడుదలకు ముందు సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. టెల్యురైడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో సడన్‌గా ప్రీమియర్ చేయడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది.
మరోవైపు నాథన్ ఫీల్డర్‌కు ఉన్న ప్రత్యేకమైన దర్శకత్వ శైలి కూడా సినిమాకు కలిసొచ్చింది. నిజ జీవిత సంఘటనల్లో హాస్యం, ఇబ్బంది, అనూహ్యమైన పరిస్థితులను కలిపి చూపించే ఆయన శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా చూసినవారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో నోటి మాట ద్వారా ప్రచారం మరింత పెరిగింది. రాటెన్ టొమాటోస్‌లో విమర్శకుల నుంచి 97 శాతం స్కోర్ సాధించింది. ఆస్కార్ అవార్డుల రేసులోనూ ఈ సినిమా పేరు వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
అసలు ఈ డాక్యుమెంటరీలో ఏం చూపించారు?
ఈ సినిమా కథ మొదలయ్యేది ఎలిజబెత్ హోమ్స్ జైలుకు వెళ్లడానికి సరిగ్గా 34 రోజుల ముందు నుంచి. దాదాపు 2 గంటల 55 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబంతో గడిపే సమయాన్ని, భవిష్యత్తుపై ఆమెకున్న ఆలోచనలను కెమెరా ద్వారా చూపించారు.
ఆమె తన భాగస్వామి బిల్లీ ఎవాన్స్, పిల్లలతో కలిసి గడిపే క్షణాలు, ఇంట్లో జరిగే సాధారణ సంఘటనలు, తన గతం గురించి చెప్పుకునే విషయాలను చిత్రీకరించడానికి దర్శకులకు అవకాశం ఇచ్చింది. ప్రపంచం తన గురించి తెలుసుకున్నది ఒక కోణమేనని, తన జీవితంలోని మరో కోణాన్ని కూడా చూడాలని ఆమె భావించినట్లు సినిమా ముందుకు సాగుతుంది.
కానీ ఇక్కడే ప్రేక్షకులకు అసలు ఇంట్రస్ట్ మొదలవుతుంది. కెమెరా ముందు ఆమె చెబుతున్న మాటలు ఎంతవరకు నిజం? తన గతాన్ని నిజాయితీగా అంగీకరిస్తోందా? లేక ప్రపంచం ముందు మరో కొత్త ఇమేజ్ను నిర్మించుకుంటోందా? అనే సందేహాలు కలుగుతాయి.
జైలుకు వెళ్లిన తర్వాత కథ మరింత అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. ఆమెతో ప్రత్యక్షంగా చిత్రీకరణ చేయడానికి అవకాశం లేకపోవడంతో, దర్శకులు కొన్ని సంఘటనలను మళ్లీ తెరపై ఆవిష్కరించే ప్రయోగం చేశారు. ఇందులో హాలీవుడ్ నటి అమాండా సెయ్‌ఫ్రైడ్ కూడా కీలకంగా కనిపిస్తుంది. గతంలో ‘ది డ్రాప్‌అవుట్’ అనే సిరీస్‌లో ఎలిజబెత్ పాత్ర పోషించిన ఆమె, ఈ డాక్యుమెంటరీలోనూ ఆ పాత్రను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.
ఇలా నిజ జీవిత చిత్రీకరణ, తిరిగి రూపొందించిన సన్నివేశాలు, దర్శకుడి ప్రత్యేకమైన ప్రయోగాలు కలగలిపి సినిమా సాగుతుంది. ఒక వ్యక్తి జీవితాన్ని చూపించడమే కాకుండా.. కెమెరా ముందు కనిపించేదంతా నిజమేనా? డాక్యుమెంటరీలు వాస్తవాన్ని ఎంతవరకు ప్రతిబింబిస్తాయి? అనే ప్రశ్నలను కూడా ప్రేక్షకుల ముందుంచుతుంది.
ఎవరీ ఎలిజబెత్ హోమ్స్? ఒక్కప్పుడు బిలియనీర్.. ఇప్పుడు జైల్లో!
ఈ సినిమా వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎలిజబెత్ హోమ్స్. 1984లో జన్మించిన ఆమె అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే వైద్య రంగంలో విప్లవం తీసుకురావాలనే ఆలోచనతో ముందుకొచ్చింది.
సాధారణంగా రక్త పరీక్షల కోసం పెద్ద మొత్తంలో రక్తం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వేలిమొన నుంచి తీసిన ఒక్క చిన్న చుక్క రక్తంతోనే వందల రకాల పరీక్షలు చేయగలిగే టెక్నాలజీని అభివృద్ధి చేస్తానని ఆమె ప్రకటించింది. ఈ ఆలోచనతో 2003లో తన 19వ ఏటే ‘థెరానోస్’ (Theranos) అనే సంస్థను ప్రారంభించింది.
ఆమె ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆకర్షితులయ్యారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఆమె సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఒక దశలో థెరానోస్ విలువ 9 బిలియన్ డాలర్లకు చేరింది.
స్టీవ్ జాబ్స్‌లా నల్లటి దుస్తులు ధరించడం, గంభీరమైన స్వరంతో మాట్లాడటం.. ఇవన్నీ ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఫోర్బ్స్, ఫార్చ్యూన్ వంటి ప్రముఖ మ్యాగజైన్ల కవర్ పేజీలపై కూడా ఆమె కనిపించింది.దీంతో ఎలిజబెత్ హోమ్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న యువ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందింది.
కానీ ఆమె చెప్పిన టెక్నాలజీ వాస్తవ పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే విషయం క్రమంగా బయటపడింది. వేలిమొన నుంచి తీసిన కొద్దిపాటి రక్తంతో అన్ని రకాల పరీక్షలు కచ్చితంగా చేయడం సాధ్యం కాలేదు. సంస్థ తన టెక్నాలజీ సామర్థ్యాల గురించి పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి.
2015లో ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాలు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత జరిగిన విచారణలో పెట్టుబడిదారులను మోసం చేసినట్లు నిర్ధారణ కావడంతో 2022లో కోర్టు ఆమెకు 11 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించింది. 2023 ఏప్రిల్‌లో ఆమె జైలులో శిక్ష అనుభవించడం ప్రారంభించింది.
ఒక్క వ్యక్తి ఎదుగుదల.. పతనం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ!
ఒకప్పుడు ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణ చేస్తానని చెప్పిన యువతి.. బిలియనీర్‌గా ఎదిగి, చివరకు మోసం కేసులో జైలుకు వెళ్లడం ఎలిజబెత్ హోమ్స్ జీవితంలోని అసాధారణమైన మలుపు. ఇప్పుడు అదే కథను తెరకెక్కించిన డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్ డాలర్ల మార్కును దాటడం మరో సంచలనం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







