షాకింగ్: వాట్సాప్ గ్రూపుల్లో పాక్ గూఢచారులు.. మన మధ్యే శత్రు నీడలు!
అర్ధరాత్రి సమయం.. దేశ రక్షణకు సంబంధించిన కీలక అధికారులు ఉన్న ఓ ప్రైవేట్ వాట్సాప్ గ్రూపులో వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. ఎవరో ఒకరు ఓ డాక్యుమెంట్ షేర్ చేశారు. మరొకరు కీలక సమాచారాన్ని పోస్ట్ చేశారు. మిగతావాళ్లు తమలో తాము చర్చించుకుంటున్నారు. అంతా మామూలుగానే సాగిపోతోంది. కానీ ఆ గ్రూపులో ఓ నిశ్శబ్దమైన నీడ కూడా ఉంది. అది ఎప్పుడూ మాట్లాడదు.. ఎలాంటి ప్రశ్నలు అడగదు.. తన ఉనికిని గుర్తించనివ్వదు. అయినా ప్రతి మెసేజ్‌ను చదువుతోంది. ప్రతి ఫొటోను గమనిస్తోంది. ప్రతి డాక్యుమెంట్‌ను పరిశీలిస్తోంది. అది ఎవరో ఆ గ్రూపులో ఒక్కరికీ తెలియదు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఉన్నది పాకిస్థాన్ గూఢచర్య నెట్వర్క్ అని తెలిస్తే? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందా?
ఇది ఏదో ఓ స్పై సినిమా సన్నివేశం కాదు. భారత భద్రతా వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసిన వాస్తవ పరిణామం. రక్షణ, పారామిలిటరీ, భద్రతా విభాగాల అధికారులు ఉపయోగించే 13-14 ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల్లోకి పాకిస్థాన్‌కు చెందిన గూఢచారులు రహస్యంగా చొరబడినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ చొరబాటుదారులు గ్రూపుల్లో ఎలాంటి అలజడీ సృష్టించలేదు.
ఇవి కూడా చదవండి
నిశ్శబ్దంగా ఉంటూనే సమాచారాన్ని గమనించారు. ‘సోనియా’ అనే పేరుతో DRDO శాస్త్రవేత్తగా నటించిన అనుమానితురాలి వ్యవహారం బయటపడటంతో ఈ గూఢచర్యం వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌పై అనుమానాలు మరింత పెరిగాయి. అసలు ఈ డిజిటల్ నీడలు ఎవరు? ఎప్పటి నుంచి మన వ్యవస్థలో ఉన్నాయి? వాళ్ల చేతుల్లోకి ఇప్పటికే ఎలాంటి రహస్యాలు వెళ్లాయి? ఇప్పుడు భారత నిఘా సంస్థలు వెతుకుతున్న సమాధానాలు ఇవే.
కనిపించని శత్రువు.. వాట్సాప్ గ్రూపుల్లో రహస్య నిఘా!
ఈ వ్యవహారాన్ని సాధారణ సైబర్ దాడిగా అధికారులు చూడటం లేదు. కీలకమైన భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న పథకం ప్రకారం సాగిన గూఢచర్యంగా భావిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అనుమానితులు నకిలీ లేదా ఇతరుల ఆధీనంలోకి తీసుకున్న భారత మొబైల్ నంబర్లను ఉపయోగించి ఈ ప్రైవేట్ గ్రూపుల్లోకి ప్రవేశించినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఒకసారి గ్రూపులో సభ్యత్వం దక్కిన తర్వాత వాళ్లు అనుసరించిన పద్ధతి మరింత ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా కొత్తగా గ్రూపులో చేరిన వ్యక్తి పరిచయం చేసుకోవడం, ఏదో ఒక మెసేజ్ పెట్టడం చేస్తుంటాడు. కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎలాంటి చర్చల్లో పాల్గొనకుండా, అనుమానం రాకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. మిగతా సభ్యులు పంపించే సమాచారాన్ని గమనిస్తూ ఉండిపోయారు.
ఇలాంటి పద్ధతిలో అసలు వ్యక్తి ఎవరో గుర్తించడం కూడా కష్టమవుతుంది. ముఖ్యంగా గ్రూపులోని సభ్యులు ఒకరినొకరు వ్యక్తిగతంగా తెలుసుకోకపోతే అనుమానాస్పద ఖాతాలు ఎక్కువకాలం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రతి సభ్యుడి గుర్తింపును మరోసారి పరిశీలించాలని భద్రతా సంస్థలు ఆదేశించాయి.
‘సోనియా’ ఎంట్రీతో బయటపడిన అసలు గూఢచర్యం!
ఈ మొత్తం వ్యవహారంలో ‘సోనియా’ అనే పేరు కీలకంగా మారింది. రక్షణ శాఖకు సంబంధించిన పౌర ఉద్యోగులు ఉన్న ఓ వాట్సాప్ గ్రూపులోకి అనుమానిత పాక్ ఆపరేటివ్ ఈ పేరుతో ప్రవేశించినట్లు సమాచారం. తనను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) శాస్త్రవేత్తగా పరిచయం చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
అదే సమయంలో ఈ గ్రూపులోని కొందరి నుంచి డబ్బులు తీసుకుని రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఓ ఉద్యోగి డబ్బు కోసం రక్షణ సంబంధిత సమాచారాన్ని ఆ అనుమానిత వ్యక్తికి అందించినట్లు కూడా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఎంత సమాచారం బయటకు వెళ్లింది? దాని ప్రాధాన్యత ఏమిటి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఒక్క ‘సోనియా’ మాత్రమేనా? ఇంకా ఎన్ని మిస్టరీ ఖాతాలు ఉన్నాయి?
‘సోనియా’ వ్యవహారం బయటపడిన తర్వాత నిఘా సంస్థలు మరిన్ని వాట్సాప్ గ్రూపులపై దృష్టి పెట్టాయి. ఎందుకంటే ఒకే వ్యక్తి ఇలాంటి పద్ధతిలో చొరబడితే, ఇదే తరహాలో మరికొందరు కూడా వేర్వేరు గుర్తింపులతో గ్రూపుల్లోకి ప్రవేశించి ఉండవచ్చనే అనుమానం సహజంగానే కలుగుతుంది.
ఇప్పటికే 13-14 ప్రైవేట్ గ్రూపుల్లో పాకిస్థాన్‌కు చెందిన అనుమానితులు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని గ్రూపులను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు? వాటి వెనుక ఒకే నెట్వర్క్ ఉందా? లేక వేర్వేరు వ్యక్తులు పనిచేస్తున్నారా? అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.
అంతేకాదు, ఈ గ్రూపుల్లోకి వారు ఎప్పుడు ప్రవేశించారు? ఎంతకాలం పాటు సభ్యులుగా కొనసాగారు? ఏయే డాక్యుమెంట్లు, ఫొటోలు, సందేశాలను పరిశీలించారు? అన్న అంశాలు కూడా దర్యాప్తులో భాగంగా ఉన్నాయి.
CRPF, BSF, ITBP.. కీలక బలగాలకు అత్యవసర హెచ్చరికలు
ఈ పరిణామాలు బయటపడటంతో కేంద్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. CRPF, BSF, SSB, ITBP వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు రక్షణ శాఖకు సంబంధించిన విభాగాలకు హెచ్చరికలు జారీ చేశాయి.
ఇప్పటికే ఉపయోగిస్తున్న వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుల వివరాలను పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించాయి. గుర్తుతెలియని వ్యక్తులు, అనుమానాస్పద మొబైల్ నంబర్లు కనిపిస్తే వెంటనే తొలగించాలని సూచించాయి. అనుమానితులు ఉన్నట్లు భావిస్తున్న గ్రూపుల నుంచి సిబ్బంది బయటకు రావాలని, గ్రూప్ అడ్మిన్లు సభ్యుల గుర్తింపును నిర్ధారించుకోవాలని స్పష్టం చేశాయి.
వాట్సాప్ ఒక్కటే కాదు.. సిబ్బంది ఉపయోగిస్తున్న ఇతర సోషల్ మీడియా వేదికలను కూడా పరిశీలించాలని ఆదేశించడం ఈ వ్యవహారం తీవ్రతను తెలియజేస్తోంది. ముఖ్యంగా అధికారిక, రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని అన్ని విభాగాలకు స్పష్టమైన సూచనలు వెళ్లాయి.
వాట్సాప్ వెబ్పైనా హోంశాఖ దృష్టి!
ఈ గూఢచర్య వ్యవహారంలో మరో అంశం వాట్సాప్ వెబ్ వినియోగం. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ను తెరిచి సందేశాలు పంపుకోవడం, డాక్యుమెంట్లు షేర్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు సున్నితమైన సమాచారాన్ని ఈ విధంగా మార్పిడి చేయడంపై కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఎందుకంటే అధికారిక సమాచారాన్ని వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలు, అనధికారిక గ్రూపుల ద్వారా పంపించడం వల్ల దాని భద్రతపై నియంత్రణ తగ్గే ప్రమాదం ఉంది. ఒకసారి సమాచారం బయటకు వెళ్తే దాన్ని ఎవరు చూశారు? ఎక్కడికి పంపించారు? అన్నది గుర్తించడం కూడా కష్టమవుతుంది.
అందుకే ప్రస్తుతం ఉన్న సైబర్ భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
14 గ్రూపులా? 50కి పైగానా? అసలు నెట్వర్క్ ఎంత పెద్దది?
ఈ వ్యవహారంలో మరో షాకింగ్ ఇస్తున్న మరో విషయం..ఇలాంటి వాట్సాప్ గ్రూపుల సంఖ్య. కొన్ని రిపోర్ట్ లు 13-14 గ్రూపుల్లో పాక్ గూఢచారులు ప్రవేశించినట్లు పేర్కొంటుండగా, Nation Press కథనం మాత్రం ఈ సంఖ్య 50కి పైగా ఉండవచ్చని వెల్లడించింది.
NSG, CRPF, కమాండోలు, DRDO వంటి కీలక విభాగాలకు సంబంధించిన 50కి పైగా గ్రూపుల్లో చొరబాటు జరిగి ఉండవచ్చని ఆ కథనం పేర్కొంది. అయితే ఈ పెద్ద సంఖ్యను అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. కాబట్టి ప్రస్తుతం 50కి పైగా గ్రూపులు పూర్తిగా రాజీపడ్డాయని నిర్ధారించలేం.
అయినప్పటికీ, అసలు చొరబాటు ఎంతవరకు జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు విస్తృత స్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో మరిన్ని అనుమానాస్పద ఖాతాలు బయటపడతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అసలు భయం ఇప్పుడు మొదలైంది!
ఒక గూఢచారి దేశంలోకి ప్రవేశించాడంటే అతడు సరిహద్దులు దాటి వచ్చాడనే అర్థం మాత్రమే కాదు. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఒక మొబైల్ నంబర్, ఒక నకిలీ గుర్తింపు, ఒక వాట్సాప్ గ్రూప్ కూడా గూఢచర్యానికి మార్గంగా మారవచ్చు. ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన వ్యక్తుల మధ్య జరిగే సమాచార మార్పిడిని లక్ష్యంగా చేసుకుంటే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పుడు భారత నిఘా సంస్థల ముందున్నది కేవలం అనుమానాస్పద నంబర్లను తొలగించే పని మాత్రమే కాదు. ఈ నెట్వర్క్ వెనుక ఎవరున్నారు? ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించడానికి ఎంతకాలంగా ప్రయత్నిస్తున్నారు? ఇప్పటికే ఏమైనా కీలక వివరాలు శత్రు దేశానికి చేరాయా? అన్నది తేల్చాల్సి ఉంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







