అహోబిలం ఘటనపై అఖిలప్రియ ఫైర్..!
పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు మరియు తన వాహనంపై జరిగిన రాళ్ల దాడిపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గొడవలు జరుగుతాయని తాను ముందు నుంచే హెచ్చరిస్తూ పోలీసులను అలెర్ట్ చేస్తున్నా, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అహోబిలం సమస్యాత్మక గ్రామమని తెలిసినా, గొడవలు చేసే వ్యక్తులను ముందస్తుగా అరెస్ట్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
గురువారం అహోబిలంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో తన కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి జరగడంపై అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అహోబిలంలో గొడవలు జరిగే ఛాన్స్ ఉందని వారం పది రోజులుగా జిల్లా ఎస్పీ మొదలుకొని డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారుల వరకు చెబుతూనే ఉన్నానని తెలిపారు. సమస్యాత్మక వ్యక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఉండి ఉంటే, ఇవాళ ఇంత పెద్ద ప్రమాదం, విధ్వంసం జరిగేది కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ ఘటన అకస్మాత్తుగా జరిగింది కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే కొందరు రాళ్లు, కట్టెలు, కారంపొడితో దాడులకు తెగబడ్డారని అఖిలప్రియ ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల వద్ద పనిచేసిన కొందరు పోలీసు అధికారులనే ఇక్కడ ఎన్నికల విధుల్లో నియమించారని, వారి పరోక్ష సహకారంతోనే ఈ దాడులు జరిగాయని విమర్శించారు. తాను ఒక మహిళా ఎమ్మెల్యేనని, తానే స్వయంగా ఎలా గొడవలు చేస్తానని ఆమె ప్రశ్నించారు. పోలీసులు ఉండి కూడా ఒక మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని అఖిలప్రియ అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడిలో తన వాహనం అద్దాలు ధ్వంసమవ్వడంతో పాటు, కారు డ్రైవర్ మరియు పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.







