మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ (MTMC) ఎన్నికల పోలింగ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. మంగళగిరి(Mangalagiri) పరిధిలోని 62వ వార్డు పోలింగ్ కేంద్రంలో కొందరు వ్యక్తులు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోవడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, 62వ వార్డులోని పోలింగ్ బూత్‌లోకి వచ్చిన కొందరు వైసీపీ శ్రేణులు, ఇతరుల ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు.
అక్కడే అప్రమత్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు వారి కదలికలను అనుమానించి, ఓటరు జాబితాతో సరిపోల్చి చూడగా అసలు విషయం బయటపడింది. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని టీడీపీ ఏజెంట్లు అక్కడికక్కడే అడ్డుకుని పట్టుకున్నారు. అయితే, తాము పట్టుకునే సమయానికే వారు అప్పటికే కొన్ని దొంగ ఓట్లు వేసినట్లు టీడీపీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో పోలింగ్ కేంద్రం వద్దకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలింగ్ ప్రక్రియకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడిన వ్యక్తులను టీడీపీ ఏజెంట్లు పోలీసులకు అప్పగించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.







