హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్ డీల్ ఎందుకు చెడిపోయింది..?
ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువుకు ముందు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ (MI) నుంచి పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టులోకి ట్రేడ్ అవ్వడం క్రికెట్ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. పంజాబ్ జట్టు తమ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబైకి ఇచ్చి, హార్దిక్ పాండ్యాను దక్కించుకుంది. అయితే, పంజాబ్ కింగ్స్ కంటే ముందే హార్దిక్ పాండ్యా దాదాపు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులోకి వెళ్లాల్సి ఉందని, కానీ ముంబై ఇండియన్స్ పెట్టిన ఒక భారీ కండిషన్ వల్ల ఆ డీల్ రద్దయిందని తాజాగా ఓ ఆసక్తికర నివేదిక బయటపెట్టింది.
నివేదికల ప్రకారం, హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో తీవ్రంగా చర్చలు జరిపింది. ఈ డీల్ దాదాపు ఖరారయ్యే దశకు చేరుకున్న సమయంలో, ముంబై ఇండియన్స్ యాజమాన్యం రాజస్థాన్ ముందు ఒక కఠినమైన ప్రతిపాదన పెట్టింది. హార్దిక్ పాండ్యాను వదులుకోవాలంటే, ప్రతిగా తమకు రాజస్థాన్ జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ మరియు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్లను ఇవ్వాలని ముంబై డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి
తమ జట్టుకు వెన్నెముకలాంటి యశస్వి జైస్వాల్, జోఫ్రా ఆర్చర్ ఇద్దరినీ ఒకేసారి వదులుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం ఇష్టపడలేదు. ముంబై డిమాండ్ మరీ ఎక్కువగా ఉందని భావించిన రాజస్థాన్ యాజమాన్యం, వెంటనే ఆ చర్చలను నిలిపివేసి డీల్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత రంగంలోకి దిగిన పంజాబ్ కింగ్స్, అర్ష్‌దీప్ సింగ్‌ను ట్రేడ్ చేసి హార్దిక్ పాండ్యాను తమ సొంతం చేసుకుంది. హార్దిక్ పాండ్యా డీల్ మిస్ అయినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ మరో కీలక ట్రేడ్ ద్వారా తమ జట్టును బలోపేతం చేసుకుంది.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్‌ను (రూ. 2.4 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు ఇచ్చి, ప్రతిగా లక్నో నుంచి భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (రూ. 8 కోట్లు), స్పిన్నర్ మణిమారన్ సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు)లను రాజస్థాన్ దక్కించుకుంది. దీనివల్ల రాబోయే సీజన్లో జోఫ్రా ఆర్చర్, మహ్మద్ షమీ కలిసి రాజస్థాన్ బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయనున్నారు.






