ఐపీఎల్ 2027 వేలం జాబితా విడుదల.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో ఇద్దరే ఇద్దరు భారత ఆటగాళ్లు..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఈ వేలం కోసం మొత్తం 1,220 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, ఇందులో అత్యధిక బేస్ ప్రైస్ (కనీస ధర) రూ. 2 కోట్ల విభాగంలో 30 మంది స్టార్ ప్లేయర్లు నిలిచారు. అయితే, ఈ రూ. 2 కోట్ల అత్యధిక బేస్ ప్రైస్ జాబితాలో కేవలం ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం. భారత పేసర్లు అవేశ్ ఖాన్ మరియు దీపక్ చాహర్ మాత్రమే తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నారు.
మరోవైపు, 2025 మెగా వేలానికి దూరంగా ఉండి, బీసీసీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది నిషేధం ఎదుర్కొన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఈసారి రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి విడుదలైన ప్రాథమిక జాబితాలో మొత్తం 14 మంది క్యాప్డ్ భారత ఆటగాళ్లు ఉన్నారు. అవేశ్ ఖాన్, దీపక్ చాహర్‌లతో పాటు ఆకాశ్ దీప్, జయదేవ్ ఉనద్కత్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కుల్దీప్ సేన్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సారాంశ్ జైన్, శివమ్ మావి, తుషార్ దేశ్‌పాండే, ఉమేశ్ యాదవ్ మరియు ఉమ్రాన్ మాలిక్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
ఇక విదేశీ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్, మతీషా పతిరానా, వనిందు హసరంగ, ఫజల్హక్ ఫారూఖీ వంటి హేమాహేమీలు రూ. 2 కోట్ల జాబితాలో ఉన్నారు. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఈసారి ‘అన్క్యాప్డ్’ కేటగిరీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. కనీసం ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లను అన్క్యాప్డ్గా పరిగణించే నిబంధన కింద, 2021 నవంబర్‌లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన ఇషాంత్ ఈ జాబితాలోకి వచ్చాడు. కాగా, ఈ 1,220 మంది ఆటగాళ్ల ప్రాథమిక జాబితా నుంచి ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్ల పేర్లను డిసెంబర్ 1 నాటికి సమర్పించనుండగా, ఆ తర్వాత తుది వేలం జాబితాను బీసీసీఐ ఖరారు చేయనుంది.






