యూరియా ఉత్పత్తికి కేంద్రం కీలక అడుగులు..!
దేశంలో యూరియా ఉత్పత్తిని భారీగా పెంచి, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రూపొందించిన ‘జాతీయ యూరియా పెట్టుబడి విధానం-2026’ (NIPU-2026) కింద సుమారు రూ. 54 వేల కోట్ల భారీ పెట్టుబడితో 6 బ్రౌన్‌ఫీల్డ్ గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పత్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నూతన విధానం కింద ప్రభుత్వ, ప్రైవేట్ మరియు సహకార రంగాల నుంచి మొత్తం 18 ప్రతిపాదనలు రాగా, వాటిలో అత్యంత కీలకమైన ఆరు ప్రాజెక్టులను కేంద్రం ఎంపిక చేసి ముందుకు తీసుకెళ్తోంది.
ప్రస్తుతం ఉన్న పాత ఎరువుల ప్లాంట్ల ఆధునీకరణ మరియు సామర్థ్య విస్తరణ కోసం ఒక్కో ప్రాజెక్టుపై సుమారు రూ. 9 వేల కోట్ల చొప్పున మొత్తం రూ. 54 వేల కోట్ల పెట్టుబడి రానుందని ఎరువుల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. దేశంలో ఏటా సుమారు 400 లక్షల టన్నుల యూరియా వినియోగం జరుగుతుండగా, ప్రస్తుతం దేశీయ ఉత్పత్తి సామర్థ్యం 269.42 లక్షల టన్నులుగా ఉంది. మిగిలిన అవసరాల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఆరు కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే దేశీయంగా యూరియా ఉత్పత్తి గణనీయంగా పెరిగి, విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు యూరియా రంగంలో భారత్ పూర్తిస్థాయి స్వయం సమృద్ధిని సాధించనుంది.
ఇవి కూడా చదవండి
పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నూతన పాలసీలో 12 నుంచి 16 శాతం వరకు రిటర్న్ ఆన్ ఈక్విటీతో పాటు విదేశీ మారకద్రవ్య రిస్క్‌లను తగ్గించే వెసులుబాటును కల్పించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు ఎంత పెరిగినా, దేశీయ రైతులకు ఎలాంటి కొరత లేకుండా నామమాత్రపు ధరలకే సకాలంలో యూరియాను అందించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక అడుగు వేసింది. ఈ ప్రాజెక్టుల విస్తరణతో వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభించడంతో పాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.







