ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? ఎస్ఈసీ కీలక ఉత్తర్వులు జారీ..!
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు వేసే ‘చెరగని సిరా’ గుర్తు విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఓటరుకు ఎడమ చేతి ‘చిటికెన వేలు’ (Little Finger) పైనే చెరగని సిరా గుర్తు వేయాలని ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా,
దొంగ ఓట్లు పడకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఓటర్లకు సాధారణ నిబంధనల ప్రకారం ఎడమ చేతి చూపుడు వేలుపై చెరగని సిరా గుర్తు వేశారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాల్సి రావడంతో, అక్కడి ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలుపై కూడా సిరా గుర్తు వేయాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
స్వల్ప వ్యవధిలోనే వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో, పాత సిరా గుర్తులు ఇంకా చెరిగిపోకుండా అలాగే ఉన్నాయి. ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లోనూ పాత వేళ్లపైనే సిరా వేస్తే, అసలైన ఓటర్లను గుర్తించడంలో పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి స్పష్టతనిస్తూ, ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలుపై సిరా గుర్తు వేయాలని ఎస్ఈసీ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది. ఒకవేళ ఎవరికైనా ఎడమ చేతి చిటికెన వేలు లేకపోతే, నిబంధనల ప్రకారం తదుపరి వేలిపై సిరా వేసేలా పోలింగ్ అధికారులకు తగిన సూచనలు జారీ చేసింది.







