కూటమిలో ఇప్పుడే కుర్చీల పంచాయితీ.. 2029లో సీట్ల కోసం మిత్రుల మధ్య సమరం తప్పదా..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అధికార కూటమి ఐక్యతపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. తెలుగుదేశం (TDP), జనసేన (Jana Sena), భారతీయ జనతా పార్టీ (BJP) కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం మూడు పార్టీల మధ్య ఆశించిన స్థాయిలో సమన్వయం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బయటపడిన పరిణామాలు కూటమిలోని అంతర్గత పరిస్థితులను చర్చకు తీసుకొస్తున్నాయి. పైస్థాయిలో నేతలు ఐక్యత గురించి మాట్లాడుతున్నా, కిందిస్థాయిలో మాత్రం సీట్ల కేటాయింపు, రాజకీయ ప్రాధాన్యం వంటి అంశాలపై అసంతృప్తి పెరుగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు బలం చేకూరుస్తున్నాయి. విశాఖపట్నం (Visakhapatnam) బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju) కూటమి ధర్మాన్ని పాటిస్తూ కొన్ని విషయాల్లో సర్దుకుపోతున్నామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమిలో సీట్ల పంపకాలపై ఇప్పటి నుంచే ఆలోచనలు మొదలయ్యాయని సూచిస్తున్నాయి. జనసేన నాయకులు కూడా కొన్ని ప్రాంతాల్లో తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం లభించడం లేదంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. 2029లో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మూడు పార్టీలు మరోసారి కలిసి పోటీ చేయడం అవసరంగా మారింది. అయితే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోతే అధినాయకత్వాలు తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు అమలవుతాయన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా స్థానికంగా ఒక పార్టీకి చెందిన నాయకులు మరో పార్టీ అభ్యర్థులకు సహకరించని పరిస్థితులు ఏర్పడితే ఎన్నికల సమయంలో కూటమికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు జనసేన, బీజేపీ తమ రాజకీయ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిపి 31 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యాయి. అయితే ఈసారి తమ పార్టీలకు పెరిగిన ప్రజాదరణ, కొత్తగా చేరుతున్న నాయకులు, స్థానికంగా పెరుగుతున్న రాజకీయ బలం ఆధారంగా ఎక్కువ సీట్లు కోరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనలో కూడా తమ బలానికి తగిన ప్రాతినిధ్యం ఉండాలనే అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ నాయకులు సైతం తమ పార్టీకి తక్కువ స్థానాలు కేటాయిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రకటించినట్లుగా 94 శాతం విజయ రేటు నమోదు కావడం కూటమికి సానుకూల అంశం. అయితే స్థానిక ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయడం అంత సులభం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. అప్పటికి మూడు పార్టీలూ తమ రాజకీయ బలాన్ని పెంచుకోవాలని, ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావించే అవకాశం ఉంది. దీంతో సీట్ల పంపకాలే ప్రధాన సమస్యగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశం కూటమి పార్టీలకు కీలకంగా మారింది. పార్లమెంట్లో ప్రతిపాదిత బిల్లు ఆమోదం పొంది, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 263కు చేరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అలా జరిగితే మూడు పార్టీల మధ్య ఎక్కువ స్థానాలను పంచుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రతి పార్టీ తమ బలానికి అనుగుణంగా సీట్లు పొందేందుకు కొంత వెసులుబాటు ఉంటుంది. అయితే నియోజకవర్గాల పెంపు జరగకుండా 175 స్థానాలతోనే ఎన్నికలు జరిగితే సీట్ల సర్దుబాటు మరింత కష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ప్రస్తుతం కనిపిస్తున్న ఐక్యత 2029 వరకు కొనసాగుతుందా? లేక సీట్ల పంపకాల దగ్గరే కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.







