బహిష్కరణ బాధితులకు గ్రీన్ కార్డ్ ఛాన్స్..!
అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ బహిష్కరణకు సంబంధించి తుది ఉత్తర్వులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వలసదారులకు ఊరట కల్పించేలా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీలు కొత్త బిల్లును ప్రతిపాదించారు.’ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్’ (Protect Our Neighbors Act) పేరుతో నవంబర్ 19న అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
పదేళ్లుగా అమెరికాలో నిరంతరంగా నివసిస్తున్న, నిర్దిష్ట నేరాలకు పాల్పడని కొందరు వలసదారులపై ఉన్న పాత బహిష్కరణ ఉత్తర్వులు గడువు ముగిసేలా చేయడం ఈ ప్రతిపాదనలో కీలక అంశం. అంతేకాదు, అర్హతలు ఉన్నవారికి గ్రీన్‌కార్డు పొందే మార్గాన్ని కూడా ప్రతిపాదించారు. అయితే ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చిన చట్టం కాదు. బిల్లు ఆమోదం పొంది, చట్టంగా మారితేనే ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.
అసలు ఈ బిల్లు ఉద్దేశ్యమేంటి..?
అమెరికాలో వలసదారులపై చర్యలు కామన్ గా మారాయి.అయితే ఒకసారి ఇమ్మిగ్రేషన్ కోర్టు దేశ బహిష్కరణకు తుది ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా కొంతమంది వలసదారులు అనేక సంవత్సరాల పాటు అమెరికాలోనే ఉంటున్నారు.
దీనికి పలు కారణాలుంటాయి.కొన్ని సందర్భాల్లో స్వదేశానికి పంపేందుకు అవసరమైన ప్రయాణ పత్రాలు అందుబాటులో ఉండవు.మరికొన్ని సందర్భాల్లో స్వదేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు.కొందరికి కోర్టు ప్రక్రియలు, ఇతర న్యాయపరమైన కారణాలతో బహిష్కరణ వాయిదా పడుతుంది.మరికొందరు ICE అధికారుల పర్యవేక్షణలో ఉంటూ క్రమం తప్పకుండా హాజరవుతుంటారు.
ఇలా పదేళ్లు, ఇరవై ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ, పన్నులు చెల్లిస్తూ, కుటుంబాలను పెంచుకుంటున్నవారికి ఎప్పుడైనా అరెస్టు చేసి దేశం నుంచి పంపించవచ్చనే అనిశ్చితి కొనసాగుతోంది.
ఈ పరిస్థితిని మార్చాలన్న ఉద్దేశంతోనే డెమోక్రాట్లు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.
బిల్లులో ఉన్న ప్రధాన ప్రతిపాదనలు
ఈ బిల్లులో మూడు ముఖ్యమైన అంశాలను గమనించాలి.మొదటిది – బహిష్కరణ ఉత్తర్వులకు పదేళ్ల గడువు.ప్రస్తుతం తుది బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయితే అవి పదేళ్ల తర్వాత వాటంతట అవే రద్దు కావు. కానీ కొత్త బిల్లు ప్రకారం నిర్దిష్ట అర్హతలు కలిగిన వ్యక్తుల తుది ఉత్తర్వులు పదేళ్ల తర్వాత గడువు ముగిసేలా ప్రతిపాదించారు.
అంటే పాత బహిష్కరణ ఉత్తర్వుల ఆధారంగా ఎప్పటికీ వెంటాడే పరిస్థితికి ముగింపు పలకాలన్నది లక్ష్యం.
గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం..
బహిష్కరణ ఉత్తర్వుల గడువు ముగిసి, అవి పునరుద్ధరించబడని వ్యక్తులు తమకు అర్హత ఉన్న చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం పొందవచ్చు.
శాశ్వత నివాస హోదా…
కొన్ని అదనపు షరతులు నెరవేర్చినవారికి అమెరికా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (Lawful Permanent Resident Status) మంజూరు చేసే అవకాశాన్ని కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇది గ్రీన్‌కార్డుతో సమానం.
ఇక్కడే ఈ బిల్లులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఉంది.ఒక వ్యక్తికి అమెరికా ఇమ్మిగ్రేషన్ కోర్టు తుది బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసిందనుకుందాం. ఆ ఉత్తర్వులు జారీ అయిన పదేళ్ల తర్వాత అవి గడువు ముగిసేలా బిల్లు ప్రతిపాదిస్తోంది.
అయితే ప్రభుత్వం వాటిని మళ్లీ పునరుద్ధరించమని కోరే అవకాశం కూడా ఉంటుంది. కానీ అందుకు కొన్ని షరతులున్నాయి.బహిష్కరణ అమలులో జాప్యానికి గణనీయమైన కారణం ఉందని ప్రభుత్వం నిరూపించాలి.ఆ జాప్యం కేవలం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం లేదా నిధుల కొరత వల్ల జరిగిందని చెప్పడం సరిపోదు.
ఇవి కూడా చదవండి
కొత్త ఆధారాల నేపథ్యంలో ఉత్తర్వుల పునరుద్ధరణ ప్రజా ప్రయోజనాలకు అవసరమని నిరూపించాలి.ఈ విషయాలను స్పష్టమైన, బలమైన ఆధారాలతో ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ముందు నిరూపించాల్సి ఉంటుంది.
అంటే పాత బహిష్కరణ ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడైనా యథేచ్ఛగా తిరిగి అమలు చేయకుండా నియంత్రణలు తీసుకురావాలన్నది ప్రతిపాదనలోని ఉద్దేశం.
ఎవరెవరికి గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉంటుంది?
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమెరికాలో పదేళ్లు నివసించిన ప్రతి ఒక్కరికీ గ్రీన్‌కార్డు ఇవ్వాలని ఈ బిల్లు చెప్పడం లేదు.ప్రతిపాదనలోని వేర్వేరు మార్గాలకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి.బహిష్కరణ ఉత్తర్వుల గడువు ముగిసిన తర్వాత చట్టబద్ధ హోదా కోసం దరఖాస్తు చేసుకునే మార్గం ఉంది. ఇందుకు గానూ..అమెరికాలో కనీసం పదేళ్ల నిరంతర నివాసం ఉండాలి.నిర్దిష్ట నేరాలకు సంబంధించి అనర్హత ఉండకూడదు. ముఖ్యంగా ఏడాది కంటే ఎక్కువ శిక్ష విధించగల నేరానికి దోషిగా తేలి ఉండకూడదనే నిబంధన ఉంది.బహిష్కరణ ఉత్తర్వు గడువు ముగిసి, అది పునరుద్ధరించబడకూడదు.
శాశ్వత నివాస హోదా కోసం ప్రత్యేక మార్గం:
బహిష్కరణ ఉత్తర్వు జారీ అయి పదేళ్లు గడిచి ఉండాలి.ఆ కాలంలో వ్యక్తి అమెరికా నుంచి బహిష్కరించబడి ఉండకూడదు.ప్రభుత్వ పర్యవేక్షణలో లేదా షరతులతో కూడిన విడుదలపై ఉన్నప్పుడు తప్పించుకుని వెళ్లి ఉండకూడదు.నేరాలు, భద్రత తదితర ఇమ్మిగ్రేషన్ అనర్హతలకు సంబంధించిన నిబంధనలను అధిగమించాలి.నిర్దేశించిన అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.చివరి ఫెడరల్ ఆదాయపు పన్ను రిటర్న్‌కు ధ్రువీకరించిన ప్రతిని సమర్పించాలి.ఈ ప్రత్యేక మార్గంలో ఫీజు గరిష్ఠంగా 1,200 డాలర్ల వరకు ఉండవచ్చని బిల్లు ప్రతిపాదిస్తోంది. అయితే శాశ్వత నివాస హోదా మంజూరు చేయడం అధికారుల విచక్షణపై కూడా ఆధారపడి ఉంటుంది.







