టెక్సాస్ స్కూల్ లో ఇస్లాం పాఠంపై వివాదం.. పొలిటికల్ ఫైట్, సోషల్ మీడియా రచ్చ!!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇస్లాం మతం గురించి బోధించడంపై పెద్ద వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. హైస్కూల్లో ప్రపంచ భౌగోళిక అంశాల్లో భాగంగా ఇస్లాం మతం గురించి ఇచ్చిన పాఠంపై సంప్రదాయవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠం పేరుతో విద్యార్థుల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నారంటూ పాఠశాల అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఇందులో తప్పేముందని కొందరు ప్రశ్నిస్తుంటే, పిల్లలకు ఇలాంటి విషయాలు బోధించడం ఏంటంటూ మరికొందరు మండిపడుతున్నారు. చివరకు ఈ వ్యవహారం కాస్తా రాజకీయ గొడవగా మారిపోయింది.
అసలు క్లాస్‌రూమ్‌లో ఏం జరిగింది?
ఫోర్ట్ వర్త్ నగరానికి ఉత్తరాన ఉన్న నార్త్‌వెస్ట్ హైస్కూల్లో గత వారం ప్రపంచ భౌగోళిక అంశాలకు సంబంధించి విద్యార్థులకు ఓ అసైన్మెంట్ ఇచ్చారు. అందులో ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ గురించి, ఆ మతంలోని ఐదు ముఖ్యమైన సూత్రాల గురించి ప్రశ్నలు అడిగారు. అంతేకాదు, అల్లా అంటే ఏమిటి? ఖురాన్ అంటే ఏమిటి? రంజాన్ అంటే ఏమిటి? అనే పదాలకు అర్థాలు రాయాలని కూడా సూచించారు.
సాధారణంగా ప్రపంచంలోని వివిధ దేశాలు, వాటి సంస్కృతులు, మతాల గురించి భౌగోళిక పాఠాల్లో తెలుసుకోవడం జరుగుతుంటుంది. కానీ ఈసారి ఇస్లాం మతం గురించి ఇచ్చిన పాఠం కొందరికి నచ్చలేదు. ఓ వ్యక్తి తాను విద్యార్థి తల్లిదండ్రినంటూ ఈ ప్రశ్నాపత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టి, “ఈ ఎజెండాకు వెంటనే అడ్డుకట్ట వేయాలి” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలోకి వచ్చాక మరింత ముదిరిన వివాదం
ఆ పోస్టును ‘లిబ్స్ ఆఫ్ టిక్‌టాక్’ అనే మితవాద గ్రూప్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. ఏకంగా రెండు లక్షల మందికి పైగా ఈ పోస్టును చూశారు. దీంతో స్కూల్లో జరిగిన పాఠం కాస్తా అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.
టెక్సాస్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సభ్యుడు, బాప్టిస్ట్ పాస్టర్ బ్రాండన్ హాల్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. పిల్లలకు ఇస్లాం మత సిద్ధాంతాలు, కథలు బోధించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి విషయాలు నేర్పిస్తున్నారేమోనని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండకూడదని ఎక్స్‌లో పోస్టు చేశారు.
అంతటితో ఆగకుండా, ఈ పాఠం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో విచారించాలని కోరుతూ పాఠశాల జిల్లా సూపరింటెండెంట్‌కు లేఖ కూడా రాశారు. ఇలాంటి అంశాల బదులు మరింత నిష్పాక్షికమైన పాఠ్యప్రణాళిక ఉండాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
క్రైస్తవ బోధనలకు ప్రాధాన్యత.. ఇప్పుడు ఇస్లాం పాఠంపై అభ్యంతరాలా?
ఈ వివాదం వెనుక టెక్సాస్ విద్యావ్యవస్థలో జరుగుతున్న రాజకీయ మార్పులు కూడా ఉన్నాయనే చర్చ మొదలైంది. నిజానికి అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో క్రైస్తవ విలువలు, బైబిల్ బోధనలకు ప్రాధాన్యత కల్పించేలా గతంలో కొన్ని పాఠ్యప్రణాళిక మార్పులు తీసుకొచ్చారు. వాటికి బ్రాండన్ హాల్ కూడా మద్దతు ఇచ్చారు.
ఈ ఏడాది ప్రతిపాదించిన పాఠ్యప్రణాళిక మార్పుల్లో క్రైస్తవ బైబిల్ బోధనలను మరింతగా చేర్చడంతో పాటు, క్రైస్తవ భూభాగాల ఆక్రమణకు దారితీసిన జిహాద్ బోధనల గురించి కూడా ప్రస్తావించారు.
అయితే నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించడంతో పరిస్థితులు మారుతున్నాయి. క్రైస్తవ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పాత విధానాలపై సవాళ్లు ఎదురవుతున్నాయి. కొన్ని విధానాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
డెమోక్రాట్లపై హాల్ ఆగ్రహం!
ఈ పరిణామాల మధ్య బ్రాండన్ హాల్ సోమవారం మరోసారి ఫేస్బుక్లో స్పందించారు. రిపబ్లికన్ బోర్డు సభ్యులు తమ వైఖరిపై గట్టిగా నిలబడాలని, డెమోక్రాట్ల విధానాలను ప్రతి అడుగులోనూ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డెమోక్రాట్ల ఎజెండాను రాడికల్ ఎజెండాగా అభివర్ణిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







