పట్టభద్రుల ఓటుకు ‘గ్రేటర్’ నిరాసక్తత
తెలంగాణలో విద్యావంతుల గొంతుకగా భావించే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చిలో హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్, నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. అయితే, చట్టసభల్లో తమ సమస్యలపై ప్రశ్నించే ప్రతినిధులను ఎన్నుకునే విషయంలో పట్టభద్రులు తీవ్ర అనాసక్తి కనబరుస్తున్నారనే చేదు నిజం ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
గత మూడు నెలలుగా ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినప్పటికీ, గ్రాడ్యుయేట్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. రెండు నియోజకవర్గాల పరిధిలో కొత్తగా దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల మంది అర్హులైన పట్టభద్రులు ఉంటారని అంచనా వేశారు. గత ఎన్నికల్లో ఉన్న 10.37 లక్షల ఓట్లకు వీరంతా తోడైతే, మొత్తం ఓటర్ల సంఖ్య 18 లక్షల నుంచి 20 లక్షల వరకు చేరాల్సి ఉంది. కానీ, ముసాయిదా జాబితా ప్రకారం రెండు స్థానాల్లో కలిపి కేవలం 11.89 లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. అంటే, గతంతో పోలిస్తే కేవలం 1.52 లక్షల ఓట్లు మాత్రమే పెరిగాయి. పాత ఓటర్ల జాబితాను ఆటోమేటిక్గా కొనసాగించకపోవడం, ప్రతిసారీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనపై అవగాహన లోపించడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో అత్యధికంగా విద్యావంతులు, ఐటీ నిపుణులు, ప్రైవేటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసించే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నిర్లక్ష్యం మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గంలో 2021 ఎన్నికల నాటికి 5,31,268 ఓట్లు ఉండగా, తాజా జాబితాలో కేవలం 36,837 ఓట్లు మాత్రమే అదనంగా పెరిగి మొత్తం సంఖ్య 5,68,105కు చేరింది. ఇందులో సుమారు 70 శాతం ఓట్లు గ్రేటర్ పరిధిలోనివే అయినప్పటికీ, ఇక్కడ అర్హులైన 12 లక్షల మందిలో కేవలం 30 నుంచి 35 శాతం లోపు మాత్రమే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ఈ పరిస్థితికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా నమోదు చేసుకోవాలనే నిబంధన చాలామందికి తెలియకపోవడం, దరఖాస్తు ప్రక్రియపై సరైన స్పష్టత లేకపోవడం వల్ల సామాన్య గ్రాడ్యుయేట్లు వెనుకడుగు వేశారు. దీనికి తోడు ఇతర ఎన్నికల పనుల ఒత్తిడి కారణంగా ఎన్నికల యంత్రాంగం కూడా ఈ నమోదు ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉరుకుల పరుగుల కార్పొరేట్ జీవితంలో పడిపోయిన ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించలేకపోతున్నారు. ‘మనకెందుకులే’ అనే ఉదాసీన వైఖరి విద్యావంతుల్లో బలంగా నాటుకుపోయింది.ణ ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని పైకి చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు విషయంలో ఆశించిన స్థాయిలో చొరవ చూపలేదని గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
డిసెంబర్ 10 వరకు ఓటరు నమోదుకు ఇంకా అవకాశం ఉన్నప్పటికీ, మిగిలిన కొద్ది రోజుల్లో పెను మార్పులు జరిగే సూచనలు తక్కువగా ఉన్నాయి. పరిమిత సంఖ్యలో నమోదైన ఈ ఓటర్లు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడతారు, విద్యావంతుల ఈ మౌనం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ మలుపు తిప్పుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







