శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యలపై న్యూజిలాండ్ కెప్టెన్ కౌంటర్..!
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్ల మధ్య బంతి నాణ్యతపై ఆసక్తికర చర్చ మొదలైంది. వెల్లింగ్టన్లో జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం, బంతుల నాణ్యత పడిపోతోందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూక్స్ (Dukes), కూకబుర్రా (Kookaburra) బంతులు కేవలం 25 నుంచి 30 ఓవర్లకే మెత్తబడిపోతున్నాయని, దీనివల్ల బౌలర్లకు ఇబ్బంది కలుగుతోందని గిల్ పేర్కొన్నారు. అయితే, శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యలపై న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ భిన్నంగా స్పందించారు.
రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన టామ్ లాథమ్, బంతి పాడవడానికి పిచ్ స్వభావమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. పిచ్ కొంచెం ఫ్లాట్‌గా ఉన్నా లేదా గరుకుగా ఉన్నా బంతి త్వరగా దెబ్బతింటుందని, అది డ్యూక్స్ బంతి అయినా, కూకబుర్రా బంతి అయినా ఒకేలా ఉంటుందని వివరించారు. బంతిని ఎక్కువ సేపు మంచి స్థితిలో ఉంచుకోవడానికి ఆటగాళ్లు ప్రయత్నించాలి తప్ప, పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవడం ముఖ్యమని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ పిచ్ పచ్చికతో కూడుకుని ఉండటంతో పాటు, ఇక్కడ ఇటీవల ఎక్కువ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదని లాథమ్ గుర్తు చేశారు. అందువల్ల రెండో టెస్టులో బంతి ఎక్కువ సేపు కొత్తగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. బంతి నాణ్యత అనేది ఒక్కో సిరీస్‌కు, ఒక్కో ఏడాదికి మారుతూ ఉంటుందని, కొన్నిసార్లు బంతులు చాలా బాగుంటాయని, మరికొన్నిసార్లు త్వరగా మెత్తబడతాయని అన్నారు.
అంతర్జాతీయ క్రికెటర్లుగా మన చేతిలో ఉన్న బంతి ఎలా ఉన్నా సరే, దానితోనే ఆడి విజయం సాధించే మార్గాలను వెతుక్కోవాలని టామ్ లాథమ్ స్పష్టం చేశారు. బంతి బాగున్నా, బాగోలేకపోయినా ఆ పరిస్థితులకు అలవాటు పడి ఆడటమే ముఖ్యమని, సాకులు వెతకకూడదని పరోక్షంగా గిల్‌కు చురకలు అంటించారు. శుక్రవారం నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.






