హెలిప్యాడ్ నుంచి భారీ భవనాల వరకు.. జగన్ 21 ఎకరాల ప్యాలెస్‌పై దేశవ్యాప్తంగా చర్చ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు వైఎస్ కుటుంబానికి (YS Family) సంబంధించిన ఆస్తుల వ్యవహారం చర్చకు వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy), ఆయన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) మధ్య కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వివాదానికి కేంద్రంగా బెంగళూరులోని యలహంక ప్రాంతంలో ఉన్న భారీ నివాస సముదాయం మారింది. సుమారు 21 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్‌కు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో దాని నిర్మాణం, విలాసవంతమైన సదుపాయాలు, ఆస్తి హక్కులపై ఆసక్తికర చర్చ మొదలైంది.
బెంగళూరు (Bengaluru)లోని యలహంక ప్రాంతంలో ఉన్న ఈ నివాస సముదాయం విస్తీర్ణం పరంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. విశాలమైన భవనాలు, పచ్చని ప్రాంగణం, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) కుటుంబానికి చెందిన ఈ ఆస్తి గతంలో పెద్దగా వార్తల్లోకి రాకపోయినా, ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదంతో జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. తాజాగా బయటకు వచ్చిన డ్రోన్ దృశ్యాలు ఈ భారీ ప్రాంగణంపై ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
ఈ ఆస్తిపై జగన్, షర్మిల మధ్య హక్కుల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. తన తండ్రి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు వాటా ఉందని షర్మిల వాదిస్తున్నారు. గతంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఆస్తుల పంపకాల సమయంలో యలహంక నివాసాన్ని తనకు, తన పిల్లలకు కేటాయించారని ఆమె చెబుతున్నారు. అయితే ఈ ఆస్తి వినియోగం, నిర్వహణ విషయంలో జగన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నివాస ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వ్యక్తుల రాకపోకలు భద్రత, వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది కలిగిస్తాయన్నది ఆయన అభ్యంతరంగా ప్రచారంలో ఉంది.
ఇవి కూడా చదవండి
ఇటీవల షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి (YS Anjili Reddy) వివాహం ఈ వివాదానికి మరో కారణమైంది. నవంబర్ 25న జరగాల్సిన వివాహ వేడుకను యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని షర్మిల కుటుంబం భావించింది. అయితే అక్కడ కార్యక్రమం నిర్వహించడంపై అభ్యంతరాలు రావడంతో చివరకు వివాహ వేదికను మార్చాల్సి వచ్చింది. కుటుంబ వేడుక విషయంలో కూడా విభేదాలు బయటపడటంతో ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీసింది.
ఇదిలా ఉంటే ఈ ఆస్తికి సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు కూడా ఆసక్తికరంగా మారాయి. నవంబర్ 22న బెంగళూరులోని దేవనహళ్లి కోర్టు ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Silicon Builders Pvt Ltd) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, వివాదాస్పద ఆస్తి స్వాధీనం, వినియోగానికి ఆటంకం కలిగించవద్దని షర్మిల, ఆమె కుటుంబ సభ్యులను ఆదేశించింది. ఆ తర్వాత యలహంకకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం కూడా వార్తల్లో నిలిచింది.
మొత్తంగా ఒక కుటుంబానికి చెందిన ఆస్తి వ్యవహారం ఇప్పుడు రాజకీయ, న్యాయపరమైన చర్చలకు కారణమైంది. 21 ఎకరాల విస్తీర్ణం, విలాసవంతమైన నిర్మాణాల కంటే ఈ ఆస్తిపై అసలు హక్కులు ఎవరికి చెందుతాయన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాలకు న్యాయస్థానాల నిర్ణయాలు ఎలాంటి ముగింపు ఇస్తాయో చూడాలి.







