ఫేస్బుక్ నుంచి PUBG వరకు.. భారత సైన్యం 87 యాప్‌లపై నిషేధం?
మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే ఫోన్ చేతిలోకి తీసుకుని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అంటూ సోషల్ మీడియాలో మునిగిపోతుంటాం. ఖాళీ సమయం దొరికితే గేమ్స్ ఆడటం, ఆన్లైన్ షాపింగ్ చేయడం కూడా అలవాటే. కానీ భారత సైన్యంలోని సిబ్బంది మాత్రం ఇకపై ఇలాంటి కొన్ని యాప్‌లకు దూరంగా ఉండాల్సిందే!
ఎందుకంటే భారత సైన్యం ఏకంగా 87 మొబైల్ యాప్‌లను నిషేధిత జాబితాలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో ఫేస్బుక్, స్నాప్‌చాట్, టిక్‌టాక్‌తో పాటు PUBG వంటి పాపులర్ యాప్‌లు కూడా ఉన్నాయి.
నవంబర్ 24, 2026న జారీ చేసినట్లు చెబుతున్న ఈ భద్రతా సూచనలో సైనికులు, అధికారులు తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌లను ఉపయోగించకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అసలు ఈ యాప్‌లను ఎందుకు నిషేధించారు?
ఇప్పుడు మనం ఉపయోగించే చాలా యాప్‌లు మన ఫోన్లోని కాంటాక్ట్స్, లొకేషన్, ఫొటోలు, ఇతర వ్యక్తిగత వివరాలకు యాక్సెస్ కోరుతుంటాయి. సాధారణ వినియోగదారులకు ఇవి పెద్దగా పట్టించుకోని విషయాల్లా అనిపించవచ్చు. కానీ సైనికుల విషయంలో మాత్రం చిన్న సమాచారం కూడా చాలా కీలకంగా మారుతుంది.
ఒకవేళ వారి వ్యక్తిగత వివరాలు, ఎక్కడ ఉన్నారు అనే లొకేషన్ సమాచారం లేదా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్తే అది దేశ భద్రతకే సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటి అనవసరమైన డేటా లీకేజీలు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడాలని సైన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
మనం రోజూ చూసే యాప్‌లు కూడా ఈ జాబితాలోనే!
ఈ 87 యాప్‌ల జాబితాను చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ఇందులో మనకు బాగా పరిచయమైన సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు ఉన్నాయి. ఫేస్బుక్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ మాత్రమే కాదు.. WeChat, Hike, ShareChat వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇందులో చోటు సంపాదించుకున్నాయి. ఇక డేటింగ్ యాప్‌ల విషయానికి వస్తే Tinder, Bumble, Hinge వంటి వాటిని కూడా ఉపయోగించకూడదని సూచించినట్లు సమాచారం.
ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్లకు తెలిసిన Shein, AliExpress వంటి యాప్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. గేమ్స్ ఆడేవాళ్లకు పరిచయమైన PUBG, Clash of Kings, Mobile Legends వంటి గేమింగ్ యాప్‌లపైనా ఆంక్షలు విధించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, ఫోన్లో కాల్ చేసేవారి వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగించే Truecaller, డాక్యుమెంట్లు స్కాన్ చేయడానికి ఉపయోగించే CamScanner, UC Browser, Reddit వంటి యాప్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
వాట్సాప్ గ్రూపుల విషయంలోనూ అప్రమత్తత!
కేవలం మొబైల్ యాప్‌ల వినియోగమే కాదు.. వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ది ట్రిబ్యూన్ కథనం ప్రకారం, పాకిస్థాన్‌కు చెందినవారిగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు భారత సాయుధ దళాలు, పారామిలటరీ బలగాలు, పౌర రక్షణ సిబ్బందికి సంబంధించిన 13 అనధికారిక వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి.
ఇవి కూడా చదవండి
దీంతో ఆ గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారు, వారి గుర్తింపులు సరైనవేనా అనే విషయాలను పరిశీలించాలని అధికారులు సూచించినట్లు సమాచారం. గుర్తింపు తెలియని వ్యక్తులను గ్రూపుల నుంచి తొలగించాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, ఆఫీస్ కంప్యూటర్లు లేదా ఇతరులు ఉపయోగించే కంప్యూటర్లలో WhatsApp Web ద్వారా సున్నితమైన సమాచారాన్ని నిర్వహించవద్దని, పని పూర్తయ్యాక వాట్సాప్ సెషన్ల నుంచి లాగ్ అవుట్ కావాలని సైబర్ భద్రతా సంస్థలు హెచ్చరించారు.
ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ఆంక్షలు!
నిజానికి భారత సైన్యం డిజిటల్ భద్రత విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2020 జూలైలోనే సైనికులు 89 మొబైల్ యాప్‌లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత 2025 మార్చిలో ‘బాత్‌చీత్’ అనే అంతర్గత ప్రచురణలోనూ 89 యాప్‌ల జాబితాను మరోసారి ప్రస్తావించింది.
అదే సమయంలో సైనికుల అధికారిక సమాచార మార్పిడి కోసం 2024లో SAMBHAV అనే ప్రత్యేకమైన సురక్షిత మొబైల్ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ఇక 2025 డిసెంబర్లో సోషల్ మీడియా వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను సవరించినట్లు నివేదికలు వెల్లడించాయి. Instagram వంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో పోస్టులు చూడటానికి అనుమతించినప్పటికీ, పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, ఇతరులతో మెసేజ్‌లు పంపడం వంటి వాటిపై ఆంక్షలు కొనసాగించినట్లు సమాచారం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







