గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు … రూ.1,100 కోట్లతో
గోదావరి పుష్కరాల (Godavari Pushkarala) నిర్వహణ ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించిందని, అవసరమైతే అదనపు నిధులు ఇచ్చేందుకు కూడా వెనుకాడబోమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. భద్రాచలం లో పర్యటించిన ఆయన, స్థానికంగా సాగుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం(Bhadrachalam) వరకు గోదావరి తీరం వెంబడి చేపడుతున్న పనులు, ఆలయాల పునరుద్ధరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రంగనాయకుల గుట్ట సమీపంలో రూ.5.45 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన మంచినీటి రిజర్వాయర్, పైప్లైన్లు, పంపింగ్ వ్యవస్థ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు భక్తుల సౌకర్యార్థం స్నానఘట్టాల వద్ద మరుగుదొడ్ల నిర్మాణం, కొత్త మార్కెట్ ఏరియాలో రూ. కోటి వ్యయంతో నిర్మించనున్న గిరిజన బహుళార్థసాధక మార్కెట్ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి (Sitaramachandra Swamy) వారిని దర్శించుకున్న మంత్రి, ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. రామాలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.300 కోట్లు కేటాయించిందని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 19న తెప్పోత్సవం, 20న ముక్కోటి ఏకాదశి వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







