వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ఎదురుదెబ్బ
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (Lella Appireddy )కి గుంటూరు కోర్టులో నిరాశ ఎదురైంది. ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను గుంటూరు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టు కొట్టివేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రస్తుత పరిస్థితుల్లో నిందితుడికి బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. ఈ కేసులో నమోదైన అభియోగాల తీవ్రత ఎక్కువగా ఉందని, పైగా దర్యాప్తు ప్రస్తుతం అత్యంత కీలక దశలో కొనసాగుతోందని కోర్టు పేర్కొంది. ఈ దశలో నిందితుడికి బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలగడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెం (Guntur District Vengalayapalem)లో పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సుల (Ballot boxes)ను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తుండగా ఎన్నికల అధికారులను అడ్డుకున్నారని నల్లపాడు పోలీసులు అప్పిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేయగా, కోర్టు రిమాండ్ విధించింది. తాజాగా కోర్టు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో లేళ్ల అప్పిరెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)లోనే రిమాండ్ ఖైదీగా కొనసాగనున్నారు.







