సంక్రాంతి తర్వాత కరువుపై యుద్ధం!
వాతావరణ మార్పుల ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే ఎల్‌నినో, తీవ్ర కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం విపత్తు వచ్చినప్పుడు స్పందించే విధానానికి స్వస్తి పలుకుతూ, ముందస్తు సన్నద్ధత దిశగా రూ.10 వేల కోట్ల భారీ వ్యయంతో 5 నెలల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే ఈ బృహత్తర కార్యక్రమం క్షేత్రస్థాయిలో పట్టాలెక్కనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న ఈ ప్రణాళికను నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా అమలు చేయనున్నాయి. ఐదు నెలల పాటు సాగే ఈ యజ్ఞంలో ప్రతి నెలా సుమారు రూ.2 వేల కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. కేవలం ఉపరితల జలాలే కాకుండా, వర్షపు నీటిని ఒడిసిపట్టే నిర్మాణాల ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచడం, గ్రామీణ నీటి వనరులను సంరక్షించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.
రాబోయే వర్షాకాలం నాటికి రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలను కాపాడుకోవడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు. దీనిని అధిగమించేందుకు నీటి లభ్యతకు అనుగుణంగా వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. ఎక్కువ నీటిని వినియోగించే వరి సాగుకు బదులుగా, తక్కువ నీటితో పండే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏడాదికి సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కాబట్టి ఆహార భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వం చేపట్టనున్న ఈ వినూత్న జల సంరక్షణ, కరువు నివారణ నమూనాను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026’లో భాగంగా నిర్వహించే ‘క్లైమేట్ కాన్క్లేవ్’లో ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో, వాతావరణ మార్పులకు ఆచరణాత్మక, శాస్త్రీయ పరిష్కారాలను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చూపాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కాన్క్లేవ్ కేవలం నీటి భద్రతకే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని ‘నెట్ జీరో’ లక్ష్యాల దిశగా నడిపించే రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించనుంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పరిశ్రమల్లో శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం, వ్యర్థాల రీసైక్లింగ్ వంటి అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా, రాష్ట్రంలోని డేటా సెంటర్లు తమ విద్యుత్ అవసరాల్లో కనీసం 51 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సమకూర్చుకోవాలనే నిబంధనను ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. గ్రీన్ క్రెడిట్లు, ఎకో టూరిజం, సర్క్యులర్ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఇన్వెస్టర్ల వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
పర్యావరణ శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులతో పాటు సుమారు 125 మంది సర్పంచులు, గ్రామీణ ప్రతినిధులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు. ఇక్రిశాట్ వంటి సంస్థల సాంకేతిక సహకారంతో, క్షేత్రస్థాయి అనుభవాలను మేళవించి తెలంగాణను వాతావరణ మార్పులను తట్టుకునే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.







