నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం షాక్.. పాక్ వెబ్ సిరీస్‌పై భారత్‌లో బ్యాన్ ?!
పాకిస్థానీ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ నటించిన వెబ్ సిరీస్ ఇప్పుడు భారత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న విడుదలకు సిద్ధమైన ఈ సిరీస్‌కు భారత్‌లో మాత్రం బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారతీయ సినీ సంఘాలు ఈ సిరీస్‌ను నిషేధించాలని ప్రధాని మోదీని కోరగా, తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా నెట్‌ఫ్లిక్స్‌కు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో అసలు ఈ సిరీస్ భారత్‌లో విడుదలవుతుందా? పాకిస్థానీ నటులపై వ్యతిరేకతకు కారణమేంటి? నెట్‌ఫ్లిక్స్‌ను అడ్డుకునే అధికారం కేంద్రానికి ఉందా? అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
అసలు వివాదం ఏంటి?
నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన తొలి పాకిస్థానీ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘జో బచాయే హై సంగ్ సమేట్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo). అంతర్జాతీయంగా ‘ఆల్ ది లవ్ అవర్ హార్ట్స్ క్యారీ’ పేరుతో విడుదల కానుంది. ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్, సనం సయీద్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఫర్హత్ ఇష్తియాక్ రాసిన ఉర్దూ నవల ఆధారంగా మొమినా దురైద్ ఈ సిరీస్‌ను నిర్మించారు.
డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానుంది. అయితే భారత్‌లోనూ ప్రసారం చేయాలనే అంశంపై వివాదం మొదలైంది.
నిషేధం విధించాలంటూ సినీ సంఘాల డిమాండ్
ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఈ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయకూడదని డిమాండ్ చేసింది. నవంబర్ 24న సంఘం అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు లేఖ రాశారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థానీ నటులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పాకిస్థానీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాటలను భారత్‌లో శాశ్వతంగా నిషేధించేలా కఠినమైన చట్టం తీసుకురావాలని కోరారు.
మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపింది. సిరీస్‌ను భారత్‌లో ప్రసారం చేస్తే నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టుల షూటింగ్‌లను అడ్డుకునే అవకాశం ఉందని సంఘం అధ్యక్షుడు బి.ఎన్. తివారీ హెచ్చరించారు.
పాకిస్థాన్ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ఘాటు స్పందన
భారతీయ సినీ సంఘాల డిమాండ్లపై పాకిస్థాన్ ప్రణాళికా మంత్రి అహ్సన్ ఇక్బాల్ నవంబర్ 25న సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు.
#GrowUpIndia అనే హ్యాష్‌ట్యాగ్‌తో భారతీయ సంఘాల వైఖరిని విమర్శించారు.
“క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయ ముప్పుగా, ఒక టీవీ డ్రామాను జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యగా చూడటానికి ఇంత అభద్రతాభావం ఎందుకు? భారత్, కొంచెం పరిణతి చెందండి” అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా,
“క్రీడాకారులను ఆడనివ్వండి.. నీళ్లు ప్రవహించనివ్వండి.. కళాకారులను వారి కళను సృష్టించనివ్వండి.. ఏం చూడాలనేది ప్రేక్షకులే నిర్ణయించుకోనివ్వండి” అని పేర్కొన్నారు.
ఫవాద్, మహీరా ఖాన్ వ్యాఖ్యలే వివాదానికి కారణమా?
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సైనిక చర్యపై పాకిస్థానీ నటులు సోషల్ మీడియాలో స్పందించారు.
ఫవాద్ ఖాన్ భారత సైనిక చర్యను ‘సిగ్గుచేటైన దాడి’గా అభివర్ణిస్తూ, ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని పేర్కొన్నారు. మహీరా ఖాన్ భారత చర్యను ‘పిరికిపంద చర్య’గా విమర్శించారు. హానియా అమీర్, సజల్ అలీ కూడా భారత సైనిక చర్యపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్థానీ కళాకారులకు భారత్‌లో అవకాశాలు ఇవ్వకూడదని సినీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గతంలోనూ ఫవాద్ ఖాన్ సినిమాకు ఎదురుదెబ్బ
ఫవాద్ ఖాన్ నటించిన ‘ఆబీర్ గులాల్’ సినిమా కూడా 2025లో భారత్‌లో విడుదల కావాల్సి ఉండగా, పహల్గామ్ దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విడుదల కాలేదు. వాణీ కపూర్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 12, 2025న అంతర్జాతీయంగా విడుదలైనప్పటికీ భారతీయ థియేటర్లలో ప్రదర్శించలేదు.
నెట్‌ఫ్లిక్స్‌ను అడ్డుకునే అధికారం కేంద్రానికి ఉందా?
ఈ వివాదంలో కీలకమైనది కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చట్టపరమైన అధికారం. 2025 మే 8న పహల్గామ్ దాడి తర్వాత కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్థాన్‌లో రూపొందిన కంటెంట్‌ను నిలిపివేయాలని ఓటీటీ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు వంటి కంటెంట్ ఉన్నాయి.
అంతేకాకుండా, ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం దేశ భద్రత, సార్వభౌమత్వం, ప్రజా శాంతి వంటి నిర్దిష్ట కారణాలతో ఆన్లైన్ కంటెంట్‌ను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించవచ్చు. చట్టబద్ధమైన బ్లాకింగ్ ఆదేశాలను పాటించని సంస్థలకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
అయితే 2025 మే 8న జారీ చేసిన మార్గదర్శకం ఈ ఒక్క వెబ్ సిరీస్‌పై ప్రత్యేకంగా ఇచ్చిన నిషేధ ఉత్తర్వు కాదు. ఈ రెండింటి మధ్య చట్టపరమైన వ్యత్యాసం ఉంది. అలాగే ఓటీటీ సిరీస్‌లకు థియేటర్ సినిమాల మాదిరిగా ముందస్తు CBFC సర్టిఫికెట్ తప్పనిసరి కాదు.
తాజాగా నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం సూచన!
నవంబర్ 26న PTI వెల్లడించిన సమాచారం ప్రకారం, పాకిస్థాన్‌లో రూపొందిన కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయకూడదని 2025లో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌ను కోరింది. జూన్ నెలలో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం.
భారత్‌లో విడుదలకు బ్రేక్ పడుతుందా?
ఒకవైపు సినీ సంఘాల తీవ్ర వ్యతిరేకత, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సూచనలు.. ఈ రెండింటి మధ్య నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన పాకిస్థానీ సిరీస్ భారత్‌లో మాత్రం అందుబాటులోకి రాకపోవచ్చనే చర్చ మొదలైంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







