తిరుమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు భారీ ప్రణాళిక..!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని, హిందూ ధర్మ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం తిరుమల(Tirumala) పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన ప్రకటనలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం వెల్లడించారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు 5 వేల దేవాలయాల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపడుతున్న ఈ ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, ప్రతి గ్రామంలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు, తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కూడా ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
తిరుమల పవిత్రతను, ప్రకృతి అందాలను కాపాడటంపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శేషాచల అడవుల్లో కాలుష్యాన్ని పూర్తిగా నివారించేందుకు, భవిష్యత్తులో తిరుమల కొండపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను (EV) మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే భక్తుల రవాణా కోసం పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని, దశలవారీగా అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని చెప్పారు. మరోవైపు, పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కళ్యాణి డ్యామ్, బాలాజీ రిజర్వాయర్లతో పాటు సోమశిల నుంచి నీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, భవిష్యత్తులో తిరుమలలో ఎన్నడూ నీటి కొరత రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఆయన వివరించారు.







