అరిజోనాలో శంకర నేత్రాలయ (SNUSA) ఫీనిక్స్ చాప్టర్ ఘన సేవా కార్యక్రమం.. 1.10 లక్షల డాలర్ల నిధుల సేకరణ!
అమెరికాలోని అరిజోనా రాష్ట్రం చాండ్లర్ నగరంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ(Sankara Nethralaya USA – SNUSA) ఫీనిక్స్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక నిధుల సేకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భారత్‌లో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించడం, వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించడం లక్ష్యంగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 600 మంది హాజరు కాగా, 15 అకాడమీలు , బృందాలకు చెందిన 201 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమం ద్వారా 1,10,000 డాలర్లకు పైగా నిధులు సమకూరాయి. అమెరికా జాతీయ గీతం , జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభం కాగా, ఎస్ఎన్యూఎస్ఏ కార్యదర్శి వంశీ కృష్ణ ఎరువరం అతిథులు, దాతలు, కమ్యూనిటీ నాయకులు, సంస్థల ప్రతినిధులకు స్వాగతం పలికారు.
ఈ వేడుకకు విచ్చేసిన చాండ్లర్ నూతన మేయర్‌గా ఎన్నికైన మాట్ ఓర్లాండో (Matt Orlando), భారత్‌లో శంకర నేత్రాలయ చేస్తున్న మానవతా సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నేత్ర వైద్య సేవలు అందుబాటులోకి తేవడం ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమానికి మద్దతుగా ముందుకు వచ్చిన దాతలను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫీనిక్స్, అరిజోనా తమిళ్ సంగం, ఐఏసీఆర్ఎఫ్ ఏక్తా మందిర్, అరిజోనా తెలుగు అసోసియేషన్, కేరళ హిందూస్ ఆఫ్ అరిజోనా, ఐటీసర్వ్ అలయన్స్, కన్నడ సంగం ఆఫ్ అరిజోనా, తెలంగాణ తెలుగు అసోసియేషన్, ఫీనిక్స్ మెట్రో మహారాష్ట్ర మండల్, మహాగణపతి టెంపుల్ ఆఫ్ అరిజోనా, అరిజోనా తెలంగాణ అసోసియేషన్, ఆసియా టుడే , నమస్తే ఫీనిక్స్ ప్రతినిధులతో పాటు మహాగణపతి టెంపుల్ అర్చకులు కూడా పాల్గొన్నారు.
భక్తి గణేశ గీతం , పుష్పాంజలితో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భరతనాట్యం, మోహినియాట్టం, బాలీవుడ్, గర్బా, ధోల్ తాషా, లేజిమ్, బతుకమ్మ , మార్షల్ ఆర్ట్స్ వంటి భారతీయ సంప్రదాయ కళారూపాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పది భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ జరిగిన ఈ ప్రదర్శనలు ప్రాంతీయ, భాషా సరిహద్దులకు అతీతంగా భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని, శంకర నేత్రాలయ సేవా దృక్పథాన్ని చాటిచెప్పాయి. సత్వ విహార స్పేస్ ఫర్ డాన్స్, నాట్యామృత అండ్ సంగీతామృత ఆర్ట్స్, డీడీఎఫ్ కిడ్స్ అండ్ అడల్ట్స్, హ్యాపీ ఫీట్ డాన్సింగ్, కేడీసీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, లెట్స్ డాన్స్ ఏజెడ్, లక్కీ మాస్ట్రోస్, శ్రీ నాట్య కళాలయ, గానం అకాడమీ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఎంకే డాన్స్ అకాడమీ కిడ్స్ అండ్ అడల్ట్స్, లాస్యా ఎట్ ఏఎస్యూ, వీ2డాన్స్, వైబ్ డాన్స్ స్టూడియో, ఫీనిక్స్ మెట్రో మహారాష్ట్ర మండల్ , రుద్రమ్ స్కూల్ ఆఫ్ డాన్స్ బృందాలు పాల్గొన్నాయి. కళాకారులు, గురువులు, విద్యార్థులు , తల్లిదండ్రుల భాగస్వామ్యంతో వివిధ తరాల ప్రజలు ఒకే మానవతా లక్ష్యం కోసం ఏకమయ్యారు.
సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ద్వారా ’65 డాలర్లు ఏమి చేయగలవు?’ అనే కీలక ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచారు. ఆర్థిక స్థోమత లేని వారికి కేవలం 65 డాలర్ల విరాళంతో కంటి శుక్లం (కాటరాక్ట్) శస్త్రచికిత్స చేయించవచ్చని, రోజువారీ మొత్తాన్ని ఒకరి కంటి చూపును పునరుద్ధరించే అవకాశంతో అనుసంధానించడం ద్వారా దాతృత్వాన్ని మరింత సులభతరం చేశామని నిర్వాహకులు తెలిపారు. శంకర నేత్రాలయ చరిత్ర, సేవలు , మానవతా కార్యక్రమాలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ క్విజ్ సెషన్ ప్రేక్షకులకు సంస్థ పనితీరుపై మరింత అవగాహన కల్పించింది.
ఎంఈఎస్‌యూ కార్యక్రమం ద్వారా భారత్‌లోని ఏడు గ్రామాలను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావడం ఈ వేడుకలో ప్రధాన విశేషంగా నిలిచింది. తామియా , తిరు తంగరతినం, పూర్ణిమ, బాలాజీ వల్లభాపురపు, సుధా బాలాజీ , మిత్రులు, ప్రసాద్ రెడ్డి, నివేదిత మల్లు, టక్సన్ నివాసితులు హరిప్రియ , శ్రీవత్సన్ సత్యమూర్తి, అలాగే ఇళయరాజా రాజా 50 ఫీనిక్స్ కాన్సర్ట్ టీమ్‌తో కలిసి విజయ్ రాజ్ గ్రామాల దత్తతకు అంగీకరించారు. తామియా, తంగరతినంలతో పాటు విజయ్ రాజ్ తమ దత్తత నిర్ణయాన్ని పునరుద్ధరించుకోగా, విజయ్ రాజ్ స్వయంగా భారత్‌లోని తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని సందర్శించారు. భారత్‌లోని తమ స్వగ్రామాల్లో కంటి పరీక్ష శిబిరాలు, శస్త్రచికిత్సలను స్పాన్సర్ చేసే ప్రక్రియపై పలువురు హాజరైన వారు ఆసక్తి చూపారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫీనిక్స్ యూత్ కమిటీ కీలక పాత్ర పోషించింది. 13 ఏళ్ల వయస్సు కలిగిన వాలంటీర్లతో సహా యువ బృందం సమన్వయం, నిర్వహణలో చురుగ్గా పాల్గొంది. వైశాల్ శ్రీనివాస్, జోషిత సాయి రెడ్డి, సమీక్ రెడ్డి, అనూహ్య సీలం, నితిక సతీష్, రితిక బాలాజీ, వంశిక గొట్టం, అదితి వల్లభాపురపు, అభినవ్ శ్రీవత్సన్, జైనా ఇరాజ్ మొహమ్మద్, వారిష్ ధూళిపల్ల , అర్ణవ్ తుమ్మ వంటి యువ వాలంటీర్లు సమాజ సేవలో బాధ్యతాయుతంగా పాలుపంచుకున్నారు.
ఏడాది పొడవునా ఫీనిక్స్ చాప్టర్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, సమాచార కేంద్రాలు, దాతల సంప్రదింపులు , నిధుల సేకరణ ప్రయత్నాలకు ఈ వార్షిక వేడుక పరాకాష్టగా నిలిచింది. వంశీ కృష్ణ ఎరువరం (కార్యదర్శి, ఎస్ఎన్యూఎస్ఏ), ఆది మోర్రెడ్డి (బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్), శ్రీని గుప్తా (చాప్టర్ వైస్ ప్రెసిడెంట్) , రేఖా రెడ్డి (ఉమెన్స్ చైర్) నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. డాక్టర్ రూపేష్ రెడ్డి, మాధవి రెడ్డి, శ్రీజిత్ శ్రీనివాసన్, అనిల్ భరద్వాజ్, శ్యామ్ బైరా, ధమోధరన్ రామలింగం, సుధా బాలాజీ, నాగరాజన్ దైవశిగమణి, చెన్నయ్య మద్దూరి, సతీష్ పంచాక్షరం, అంజి రెడ్డి సీలం, లక్ష్మి బొగ్గరపు, విజయ్ రాజ్, శ్రీధర్ చెందితి, బాలాజీ వల్లభాపురపు, డాక్టర్ నందిని సచ్చిదానంద్, మను నాయర్, ఆర్తీ అయ్యర్, అరుణ్‌కుమార్ సెల్వరాజన్, కర్పగం గుణశేఖరన్, శిల్పా ధూళిపల్ల , చిత్ర ప్రియ తమ సేవలను అందించారు.
శ్రీవత్సన్, హరిప్రియ, రామకృష్ణ, ఉదయ్, జయంతి, గౌరీ శ్రీనివాస్ , ఐశ్వర్య వివిధ కార్యకలాపాల్లో సహకరించగా; రూపా, సురేష్, సహన ఫోటోగ్రఫీ బాధ్యతలు, క్రాంతి, సుమి అలంకరణ బాధ్యతలు నిర్వహించారు. తెరవెనుక ప్రణాళిక, ఆతిథ్యం, లాజిస్టిక్స్ , స్టేజ్ మేనేజ్మెంట్లో మరెందరో వాలంటీర్లు శ్రమించారు. ఎస్ఎన్యూఎస్ఏ అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి నేతృత్వంలోని బృందంతో పాటు శ్యామ్ అప్పలి, మూర్తి రేకపల్లి, రత్నకుమార్ కవుటూరు అందించిన అండదండలకు కార్యదర్శి వంశీ కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఎనిమిదేళ్లలో ఎస్ఎన్యూఎస్ఏను 7 నుండి 30 చాప్టర్లకు, పలు శాటిలైట్ చాప్టర్లకు విస్తరించడంలో బాలారెడ్డి ఇందుర్తి దూరదృష్టిని కొనియాడుతూ, శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు దివంగత డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ , ఎస్ఎన్యూఎస్ఏ ఫౌండర్ ఎస్.వి. ఆచార్య సేవలను స్మరించుకున్నారు. ఆర్థిక పరిస్థితులు ఎవరి కంటి చూపును నిర్ణయించకూడదనే ఏకైక లక్ష్యంతో అందరూ ఒక్కటయ్యారు.
కార్యక్రమ ఫోటో గ్యాలరీ కోసం (https://sankaranethralayausa.org/snusa-phoenix-annual-events-2026/index.html) ను, మరిన్ని వివరాల కోసం www.sankaranethralayausa.org వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ (855) 463 8472 ను సంప్రదించవచ్చు.
విరాళాలను శంకర నేత్రాలయ యూఎస్ఏ (Tax ID: 52-1611548) పేరిట 7238 Muncaster Mill Rd, No. 522, Derwood, MD 20855 చిరునామాకు పంపవచ్చు.







