ఏడు లక్షల మంది అతిధులు…కోట్ల ఖర్చుతో పెళ్లి.. తీరా తినడానికి ప్లేట్లు లేవు!
రూ.3 కోట్ల కారు.. లక్షలాది స్వీట్లు.. 150 రకాల వంటకాలు.. పెళ్లి కోసం ఏకంగా ఐదు హెలిప్యాడ్లు! ఇంతటి వైభవం చూస్తే కళ్లు చెదరాల్సిందే. కానీ ఇదే పెళ్లికి వచ్చిన అతిథులకు చివరకు తినడానికి ప్లేట్లు కూడా దొరకలేదు. కొందరు అట్టముక్కలపై భోజనం చేస్తే, మరికొందరు రసగుల్లాల కోసం తోసుకున్నారు. అసలు పెళ్లి వేడుకలో ఏం జరిగింది? ఆర్భాటానికి ఏమాత్రం తగ్గకుండా ఏర్పాట్లు చేసినా, చివరకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లిలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆహ్వానం అందరికీ.. వచ్చినవాళ్లను చూసి అదుపు తప్పిన పరిస్థితి!
ఒక పెళ్లికి ఎంతమందిని పిలవొచ్చు? వెయ్యి మందా.. ఐదు వేల మందా.. మహా అయితే పదివేల మందా? కానీ బీహార్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం ఈ లెక్కలన్నింటినీ పక్కనపెట్టేశారు. తన కుమార్తె పెళ్లికి బీహార్ వాళ్లే కాదు, దేశంలో ఎక్కడివాళ్లయినా రావచ్చని, చివరకు పాకిస్థాన్ నుంచి వచ్చినా స్వాగతమేనని బహిరంగంగా ప్రకటించారు. ఇంకేముంది.. ఆహ్వానం నిజంగానే అందరికీ చేరినట్టుంది. నవంబర్ 25న జరిగిన పెళ్లికి జనం పోటెత్తారు. నాలుగు లక్షల మందికి పైగా భోజనం పెట్టేలా ఏర్పాట్లు చేసినప్పటికీ, వచ్చిన జనసందోహాన్ని నిర్వహించడం నిర్వాహకులకు పెద్ద సవాలుగా మారింది.
ఈ పెళ్లి బీహార్‌లోని పాట్నా జిల్లా నద్వాన్ గ్రామంలో జరిగింది. మోకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన కుమార్తె శివాంగి సింగ్ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెళ్లికి ముందే మీడియా సమావేశం పెట్టి అందరినీ ఆహ్వానించిన ఆయన, తమను ప్రేమించే ప్రతి ఒక్కరూ రావచ్చని చెప్పారు. ప్రజలే తమకు దేవుళ్లతో సమానమని, ఎక్కడి నుంచి వచ్చినా వారి రాక తమకు బహుమతేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు, “ఇదేమైనా సినిమా హాలా? లోపలికి రావడానికి టికెట్ పెట్టడానికి!” అన్నట్లుగా మాట్లాడారు. అయితే ఆయన ఇచ్చిన ఈ బహిరంగ ఆహ్వానం పెళ్లికి ఊహించని స్థాయిలో జనాన్ని తీసుకొచ్చింది. బీహార్‌తో పాటు జార్ఖండ్ నుంచి కూడా భారీగా ప్రజలు తరలివచ్చారు. చివరకు గ్రామానికి వెళ్లే రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.
ఇంతకీ ఎవరీ అనంత్ సింగ్?
ఈ పెళ్లి గురించి ఇంతగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు అనంత్ సింగ్ ఎవరో కూడా తెలుసుకోవాలి. ఆయన బీహార్‌లోని మోకామా నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకుడు. స్థానికంగా ‘ఛోటే సర్కార్’, ‘దాదా’ అనే పేర్లతో ప్రసిద్ధి. ఈ ప్రాంత రాజకీయాలపై ఆయనకు గణనీయమైన ప్రభావం ఉంది. జనతాదళ్ (యునైటెడ్), స్వతంత్ర అభ్యర్థి, రాష్ట్రీయ జనతాదళ్ వంటి రాజకీయ వేదికలపై ఆయన ప్రయాణం కొనసాగింది. మధ్యలో జేడీయూ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరణకు కూడా గురయ్యారు.
అయితే ఆయన పేరు రాజకీయాలతోపాటు వివాదాలతోనూ ముడిపడి ఉంది. హత్య, కిడ్నాప్, బెదిరింపులు, దోపిడీ వంటి ఆరోపణలతో పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. 2022లో ఆయుధాల చట్టం కింద దోషిగా తేలి పదేళ్ల జైలు శిక్ష పడగా, 2024లో పాట్నా హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. బీహార్‌లో బలమైన రాజకీయ నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు, ఈ పెళ్లి వేడుకపై కూడా ప్రత్యేక ఆసక్తిని పెంచింది.
వరుడికి రూ.3 కోట్ల కారు.. బంగారు కానుకలు కూడా!
ఇక పెళ్లిలో వరుడికి ఇచ్చిన కానుకల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం రిషికేశ్ కుమార్ అలియాస్ అంకిత్‌తో జరిగింది. వరుడు రంజయ్ కుమార్ సింగ్ కుమారుడు. ఆయన సీఆర్పీఎఫ్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు.
పెళ్లికి ముందే జరిగిన తిలక్ వేడుకలో వరుడికి సుమారు రూ.3 కోట్ల విలువైన తెల్లటి ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. దాంతోపాటు 100 గ్రాముల బంగారు గొలుసు, 80 గ్రాముల బంగారు బ్రేస్‌లెట్‌తో పాటు మరికొన్ని విలువైన కానుకలు కూడా అందించారు.
పెళ్లి జరగకముందే ఈ లగ్జరీ కారు గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇక పెళ్లి వేడుకల్లో గుర్రపు పందేలు నిర్వహించి, విజేతకు కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని బహుమతిగా ప్రకటించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో స్థానంలో నిలిచినవారికి బైక్, మూడో స్థానంలో ఉన్నవారికి స్కూటర్ ఇవ్వాలని నిర్ణయించారు.
గుర్రపు పందేలకు 52 గుర్రాలు.. థార్ కోసం పోటీ!
పెళ్లిలో కేవలం విందు, వినోదాలే కాదు.. గుర్రపు పందేలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి 50కి పైగా గుర్రాలు వచ్చాయి. మొత్తం 52 గుర్రాలు బరిలోకి దిగినట్లు సమాచారం. లాల్ బాద్షా, ఖగారియా ఎక్స్‌ప్రెస్, బాబర్, రాకెట్, సికందర్ వంటి గుర్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. వాటి కోసం ప్రత్యేకంగా తాత్కాలిక లాయాలు ఏర్పాటు చేసి, ఆహారం, నీరు, సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 12 బిగాల విస్తీర్ణంలో రేసింగ్ మైదానాన్ని కూడా సిద్ధం చేశారు.
నవంబర్ 25న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య పోటీలు జరగాల్సి ఉండగా, థార్ ఎస్యూవీ బహుమతి కావడంతో గుర్రాల యజమానులు, రైడర్లు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. అయితే ఈ పోటీలు చివరకు అనుకున్నట్లు జరగలేదు. గుర్రాలను చూడటానికి వచ్చిన ప్రేక్షకుల సంఖ్య లక్ష దాటడంతో మైదానంలో గందరగోళం మొదలైంది.
కొందరు చెట్లు ఎక్కితే, మరికొందరు హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఎక్కి పోటీలను చూడటానికి ప్రయత్నించారు. ఇంకొందరు ఏకంగా రేసింగ్ మైదానంలోకి వచ్చేశారు. దీంతో పోటీలను సురక్షితంగా కొనసాగించడం కష్టమై నిర్వాహకులు ప్రాథమిక రౌండ్లు, సెమీ ఫైనల్ తర్వాత పోటీలను నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి
పూలతో అలంకరించిన రాజభవనం.. హెలికాప్టర్లలో ప్రముఖులు!
ఇక పెళ్లి మండపం గురించి చెప్పాలంటే, అది సాధారణంగా కనిపించే పెళ్లి వేదికలా లేదట. జైపూర్ రాజభవనాల నిర్మాణ శైలిని పోలినట్లు భారీ మండపాన్ని తీర్చిదిద్దారు. జైమాల కార్యక్రమం కోసం నిర్మించిన వేదిక 100 అడుగుల వెడల్పు, 35 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తుతో ఉంది. దీన్ని అలంకరించడానికి ఉత్తరప్రదేశ్‌లోని మౌ నుంచి ప్రత్యేక కళాకారులను రప్పించగా, లైటింగ్ కోసం పశ్చిమ బెంగాల్ నుంచి పరికరాలు తెప్పించారు. మొత్తం వేడుకల ప్రాంగణం పది బిగాలకుపైగా విస్తరించింది. వివాహ కార్యక్రమాలు, భోజనాలు, అతిథుల కోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
అలంకరణలో పూలకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు. న్యూజిలాండ్ నుంచి ట్యూలిప్ పూలు తెప్పించగా, దుబాయ్, చైనా నుంచి కూడా పూలను తీసుకొచ్చారు. బెంగళూరు, వారణాసి, కోల్‌కతా వంటి భారతీయ నగరాల నుంచి పూలు వచ్చాయి. గులాబీ రంగు థీమ్‌తో అలంకరించిన మండపం గోపురాలు, స్తంభాలతో రాజభవనాన్ని తలపించింది.
ప్రముఖుల రాక కోసం ఐదు హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ హెలికాప్టర్లో వచ్చారు. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలవడంతో హెలిప్యాడ్లను సిద్ధం చేయడానికి అదనపు పనులు కూడా చేయాల్సి వచ్చింది. సంప్రదాయ కార్యక్రమాల కోసం రెండు ఏనుగులను కూడా తీసుకొచ్చారు. వరుడి కుటుంబాన్ని ఆహ్వానించే సమధి మిలన్ వేడుకలో అనంత్ సింగ్ ఒక ఏనుగుపై రావాలని భావించినట్లు సమాచారం.
151 వాహనాలతో వరుడి ఊరేగింపు.. గంగ హారతి కూడా!
వరుడి ఊరేగింపు కూడా ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరుడు నివసించే బీహార్‌లోని బిహ్తా గ్రామం నుంచి నద్వాన్ వరకు ఏకంగా 151 వాహనాలతో బారాత్ బయలుదేరింది. డప్పులు, సంగీతం, నృత్యాలతో సాగిన ఈ ఊరేగింపు చివరకు నవంబర్ 25 రాత్రి సుమారు 10 గంటలకు పెళ్లి వేదికకు చేరుకుంది. పెళ్లి వేడుకల్లో గంగ హారతి నిర్వహించడంతో పాటు అతిథుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, ఈ వేడుకను చూడటానికి వచ్చిన ఆసక్తికరమైన సందర్శకులతో గ్రామమంతా ఓ భారీ ఉత్సవ ప్రాంగణంలా మారిపోయింది.
ఇక వేడుకల్లో మరో విచిత్రమైన దృశ్యం నగదు నోట్ల వర్షం. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో నేలపై చెల్లాచెదురుగా పడిన కరెన్సీ నోట్లను ప్రజలు ఏరుకుంటూ కనిపించారు. ఒక వీడియోలో అయితే చీపుర్లతో నోట్లను ఊడ్చుకుంటున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఇన్ని హంగులు, ఆర్భాటాల మధ్య ఈ ఘటన కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
150 రకాల వంటకాలు.. 80 లక్షల స్వీట్లు సిద్ధం!
ఇక పెళ్లి భోజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నాలుగు లక్షల మందికి పైగా అతిథులు వస్తారని భావించి వంటకాలను భారీ స్థాయిలో సిద్ధం చేశారు. బీహార్ సంప్రదాయ వంటకం లిట్టీ చోఖా నుంచి పన్నీర్, దాల్ మఖనీ, పూరీ, నాన్, తందూరీ రోటీ వరకు అన్నీ ఉన్నాయి. అంతేకాదు దోశ, ఇడ్లీ, పిజ్జా, పాస్తా, బర్గర్లు, చాట్, గోల్గప్పా, ఆలూ టిక్కీ, కాశ్మీరీ పులావ్ వంటి వంటకాలతో 150కి పైగా రకాల మెనూ సిద్ధమైంది.
స్వీట్ల విషయంలోనూ ఏమాత్రం తగ్గలేదు. సుమారు 30 లక్షల రసగుల్లాలు, 50 లక్షల గులాబ్ జామూన్లు తయారు చేసినట్లు సమాచారం. వీటితో పాటు రాజ్‌భోగ్, కాలా జామూన్, మాల్పువా, జిలేబీ, గాజర్ హల్వా, మఖానా ఖీర్ వంటి రకరకాల స్వీట్లు కూడా ఉన్నాయి. ఈ భారీ విందు కోసం సుమారు 500 మంది హల్వాయిలు, 300 వంట పొయ్యిలు, 30 భోజన కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఇంతటి ఏర్పాట్లు చూస్తే అక్కడికి వెళ్లినవాళ్లకు భోజనానికి ఏ లోటూ ఉండదని అనిపిస్తుంది కదా! కానీ విచిత్రంగా, ఇన్ని వంటకాలు సిద్ధంగా ఉన్నప్పటికీ చివరకు అతిథులకు ప్లేట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ గందరగోళానికి కారణం ఏమిటంటే, అంచనాలకు మించి జనం రావడం, భోజన కౌంటర్ల దగ్గర సరైన జన నియంత్రణ లేకపోవడమేనని తెలుస్తోంది.
భోజనం కోసం యుద్ధమే.. ప్లేట్ల కోసం తోపులాటలు!
పెళ్లి విందు ప్రారంభమైన తర్వాత అసలు సమస్య మొదలైంది. భోజన కౌంటర్ల దగ్గరకు ఒక్కసారిగా భారీ సంఖ్యలో జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. అతిథులకు అందించాల్సిన డిస్పోజబుల్ ప్లేట్ల కోసం ఒకరినొకరు తోసుకుంటూ, ఎగబడుతూ కనిపించారు. కొందరు ప్లేట్లు అందుకోవడానికి ఇతరులపైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల జనాన్ని అదుపు చేయడానికి లాఠీలు ఉపయోగించినట్లు కూడా వీడియోల్లో కనిపించింది.
ప్లేట్లు దొరకని వాళ్లు ఏం చేయాలి? చేతిలో ఏది దొరికితే దాన్నే పళ్లెంగా మార్చుకున్నారు. ఒక అతిథి కార్డ్‌బోర్డు ముక్కపై పూరీలు, కూర పెట్టుకుని తింటూ కనిపించాడు. మరికొందరు వార్తాపత్రికలు, అట్టపెట్టెలను ఉపయోగించారు. ఇంకొందరు తాగునీటి గ్లాసుల్లోనే ఆహారం తీసుకున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో పెళ్లి నిర్వహిస్తుంటే, వచ్చిన అతిథులు అట్టముక్కలపై భోజనం చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
మరోవైపు కొందరు అతిథులు పెద్ద పాత్రల్లో ఉన్న మటర్ పన్నీర్ కూర నుంచి నేరుగా పన్నీర్ ముక్కలను తీసుకుంటూ కనిపించారు. మరో వీడియోలో ఒక వ్యక్తి కూర ఉన్న భారీ పాత్రలో పడిపోయినట్లు ప్రచారమైంది. స్వీట్ల కౌంటర్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రసగుల్లాల కోసం జనం ఎగబడటంతో కొందరికి ఒక్కటి కూడా దొరకలేదట.
ఐదు కిలోమీటర్ల దూరంలోనే తొక్కిసలాటను తలపించిన పరిస్థితి!
భోజన కౌంటర్ల దగ్గరే కాదు, గ్రామానికి వెళ్లే రహదారులపైనా ఇదే గందరగోళం కనిపించింది. ట్రాఫిక్‌లో సామాన్య ప్రజలతో పాటు ప్రముఖుల వాహనాలు కూడా చిక్కుకున్నాయి. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ కాన్వాయ్ గంటల తరబడి అక్కడే ఉండిపోయింది. దానాపూర్ ఎమ్మెల్యే రామ్ కృపాల్ యాదవ్ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొంతమంది పెళ్లికి వెళ్లే మార్గంలోనే వెనక్కి తిరిగిపోగా, మరికొందరు తమ వాహనాలను రోడ్లపైనే వదిలేసి పొలాల గుండా నడుచుకుంటూ వెళ్లారు.
ఇక వరుడి రాక కూడా ఈ ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైంది. లగ్జరీ కారులో వస్తున్న వరుడు గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోవడంతో వధువు సోదరులు వెళ్లి ఆయనను బయటకు తీసుకొచ్చారు. చివరకు అనంత్ సింగ్‌కు చెందిన పాతకాలపు ఓపెన్ జీపులో వరుడిని పెళ్లి వేదికకు తీసుకెళ్లారు. .
ఇంత గందరగోళంలో పెళ్లి మండపంలోకి పాము కూడా!
ఈ వేడుకలో మరో అనూహ్య ఘటన కూడా జరిగింది. పెళ్లి మండపంలోకి ఓ పాము ప్రవేశించింది. అక్కడి కార్పెట్‌పై పాము పాకుతున్న దృశ్యం వీడియోలో కనిపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్నవారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే జనసందోహం, ట్రాఫిక్, భోజన కౌంటర్ల గందరగోళంతో వార్తల్లో నిలిచిన పెళ్లికి ఈ పాము ఘటన కూడా మరో అంశంగా మారింది.
ఇంతటి ఆర్భాటం దేనికి? చివరకు చర్చంతా అతిథుల అవస్థలపైనే!
ఇప్పుడు ఈ పెళ్లి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే. ఒకవైపు కోట్ల రూపాయల ఖర్చుతో లగ్జరీ కార్లు, విదేశీ పూలు, హెలిప్యాడ్లు, ఏనుగులు, గుర్రపు పందేలు, 150 రకాల వంటకాలు.. మరోవైపు అదే పెళ్లికి వచ్చిన అతిథులు భోజనం కోసం ప్లేట్లు దొరకక అట్టముక్కలు వెతుక్కోవడం! ఈ రెండు దృశ్యాలు ఒకే వేడుకలో కనిపించడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







