ప్రధానిని చిక్కుల్లో పడేసిన ఐదు సెకన్ల వీడియో! రీల్ తో పెద్ద రచ్చ!!
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. ఓ చిన్న రీల్ చేయడం, దానికి ట్రెండింగ్ ఆడియో యాడ్ చేయడం, కాస్త ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం.. అంతే! చూస్తుండగానే లక్షల వ్యూస్, వేల కామెంట్లు వచ్చేస్తాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు సామాన్యుల దగ్గరే ఆగిపోలేదు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియా మోజులో పడిపోయారు. యువతతో కనెక్ట్ అవ్వాలంటే ఇన్ఫ్లుయెన్సర్లతో కొలాబ్ అవ్వాలి, పాడ్‌కాస్ట్‌లకు వెళ్లాలి, రీల్స్‌లో కనిపించాలి.. ఇదే కొత్త డిజిటల్ ఫార్ములా అన్నట్టుగా మారిపోయింది.
అయితే ఈ సోషల్ మీడియా గేమ్‌లో ఓ చిన్న మిస్టేక్ జరిగినా సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. సరదాగా చేసిన పోస్ట్ కాస్తా వివాదంగా మారొచ్చు. ఒకప్పుడు వైరల్ కావాలని పెట్టిన వీడియోనే తర్వాత డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అయినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. కేవలం ఐదు సెకన్ల వీడియో ఆయనను ఏకంగా రాజకీయ వివాదంలోకి లాగేసింది. ఓ చికెన్ నగ్గెట్స్ పాటతో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్ వరకు చేరింది. అసలు ఆ వీడియోలో ఏముంది? ఒక చిన్న మీమ్ పాటకు ఇంత హంగామా ఎందుకు?
ప్రధాని ఇంటికి ఇన్ఫ్లుయెన్సర్లకు ఇన్విటేషన్.. బయటకు వచ్చాక అసలు ట్విస్ట్!
యువతకు చేరువ కావాలంటే వాళ్లు ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోకి వెళ్లాల్సిందేనని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ భావించారు. అందుకే టిక్‌టాక్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న క్రియేటర్లను తన అధికారిక నివాసమైన డౌనింగ్ స్ట్రీట్‌కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి టిక్‌టాక్‌లో దాదాపు 36 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మాక్స్ బలెగ్డే కూడా హాజరయ్యారు.
అంతా సాఫీగానే సాగిపోయింది. కానీ కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన చిన్న సంఘటనే ఇప్పుడు ఇంత పెద్ద రచ్చకు కారణమైంది. డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రసిద్ధ నల్లటి తలుపు ముందు నిలబడి మాక్స్ ఓ వైరల్ మీమ్ పాటకు లిప్‌సింక్ చేస్తూ వీడియో తీశారు. అందులో “బొంబోక్లాట్ పుస్సీవ్యాగన్ చికెన్ నగ్గెట్స్” అనే పదాలు వినిపిస్తాయి. చివర్లో ఓ సెల్యూట్ కూడా ఇచ్చారు.
జస్ట్ ఐదు సెకన్ల వీడియోనే కదా అనుకుంటే పొరపాటే! ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు రాజకీయ నాయకుల దృష్టిలో కూడా పడింది. మాక్స్ చెప్పిన వివరాల ప్రకారం, ఈ వీడియోను మూడు వారాల క్రితమే పోస్ట్ చేశారు. మొదట్లో ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. కానీ రాజకీయ వ్యాఖ్యాతలు దానిపై దృష్టి పెట్టిన తర్వాతే అసలు వివాదం మొదలైంది. డౌనింగ్ స్ట్రీట్లోపల కెమెరాలకు అనుమతి లేకపోవడంతో బయటకు వస్తున్న చివరి క్షణంలోనే వీడియో తీసినట్లు ఆయన చెప్పారు.
రీల్ కాస్తా పొలిటికల్ రచ్చగా మారింది!
వీడియోలో వినిపించిన పదాలు అభ్యంతరకరమైనవని విమర్శలు రావడంతో కన్జర్వేటివ్ పార్టీ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. యువతను ఆకట్టుకోవాలనే పేరుతో ప్రధాని కార్యాలయాన్ని ఇలాంటి మీమ్‌లకు వేదికగా మార్చడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీ నీల్ ఓబ్రియన్ ఈ కంటెంట్‌ను విమర్శిస్తూ, యువత కోసం తయారుచేస్తున్న నాసిరకం కంటెంట్‌గా అభివర్ణించారు. మరో ఎంపీ బెన్ ఒబీస్-జెక్టీ అయితే ప్రభుత్వం ఓ సర్కస్‌లా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
ఈ వివాదం మహిళల గౌరవానికి సంబంధించిన అంశంగా కూడా మారడంతో పరిస్థితి మరింత సీరియస్ అయింది. మహిళలు, బాలికలపై హింసను అరికట్టే బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి సత్వీర్ కౌర్‌ను మీడియా ఇదే విషయంపై ప్రశ్నించింది. ఆ పాటలోని పదాలను తాను ఉపయోగించనని, అలాంటి భాష ఎక్కడా వినిపించకూడదని ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రధాని వివిధ రకాల మీడియా వ్యక్తులతో మాట్లాడటాన్ని మాత్రం సమర్థించారు.
ఇక ప్రధాని కార్యాలయం కూడా డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది. మాక్స్ పోస్ట్ చేసిన వీడియో స్పష్టంగా ఆమోదయోగ్యం కాదని, దాన్ని తొలగించడం సరైన నిర్ణయమని అధికార ప్రతినిధి తెలిపారు. అయితే వీడియోను డిలీట్ చేయమని ప్రధాని కార్యాలయమే కోరిందా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. అంటే వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసినా, ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడే వ్యూహాన్ని మాత్రం వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నమాట.
పార్లమెంట్లో ప్రధానికి ఫుల్ ఫైర్!
సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదం నవంబర్ 25న బ్రిటన్ పార్లమెంట్‌కు చేరింది. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు కెమీ బాడెనోక్ ప్రధాని బర్న్‌హామ్‌ను నేరుగా ప్రశ్నించారు. ఆ వీడియోలో ఉపయోగించిన పదాలు చాలా అభ్యంతరకరమైనవని, వాటిని పార్లమెంట్లో తిరిగి ఉచ్చరించడానికి కూడా తాను ఇష్టపడటం లేదని అన్నారు.
అంతేకాదు, ఆ పదాలకు మహిళల శరీర భాగాలను అవమానించే అర్థం ఉందని, తెల్లజాతి మహిళలను చౌకైన మాంసంతో పోల్చేలా ఉన్నాయని ఆరోపించారు. దేశ ప్రధానమంత్రి అధికారిక నివాసం ముందు ఇలాంటి వీడియో రావడం ఆయన పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించడమేనని, అందుకు బర్న్‌హామ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కానీ ప్రధాని మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. యువత సమాచారం కోసం ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడటంలో తప్పేముందని ప్రశ్నించారు. అభ్యంతరకరమైన వీడియోను తొలగించారని, దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరైనదేనని చెప్పారు. అదే సమయంలో టిక్‌టాక్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను బాడెనోక్ తక్కువ చేసి చూస్తున్నారని ఎదురుదాడి చేశారు.
చికెన్ నగ్గెట్స్ పాటలో నిజంగానే అంత మ్యాటర్ ఉందా?
ఇదే ఇప్పుడు ఈ మొత్తం వివాదంలో అసలు హైలైట్! ‘చికెన్ నగ్గెట్స్’ అనే పదానికి నిజంగా అవమానకరమైన అర్థం ఉందా? లేక అది కేవలం ఫన్నీగా వినిపించే మీమ్ పదమా? ఈ విషయంలోనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఎల్బీసీ కథనం ప్రకారం, కొందరు ఈ పదాన్ని తెల్లజాతి ప్రజలను, ముఖ్యంగా మహిళలను అవమానించే పదంగా అర్థం చేసుకుంటున్నారు. ఓ స్థానిక కౌన్సిలర్ కూడా తెల్లజాతి అమ్మాయిలను చౌకైన మాంసంతో పోల్చే పదంగా దీన్ని అభివర్ణించారు. బీబీసీ రేడియో 4 వ్యాఖ్యాత జస్టిన్ వెబ్ కూడా ఇదే అర్థాన్ని ప్రస్తావించారు.
కానీ ది గార్డియన్ కథనం మాత్రం ఈ వాదనకు బలమైన ఆధారాలు పెద్దగా లేవని చెబుతోంది. 2010లో ఇంటర్నెట్లో కనిపించిన ఒక ప్రస్తావన మినహా, ఈ పదాన్ని విస్తృతంగా అలాంటి అర్థంలో ఉపయోగించినట్లు ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది.
మరి ఈ మీమ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? యూట్యూబ్‌లో ఓ చిన్న వయసు క్రియేటర్ చేసిన వీడియో నుంచే దీని ట్రెండ్ మొదలైనట్లు తెలుస్తోంది. ప్రోటీన్ లక్ష్యాల గురించి వచ్చిన మరో మీమ్‌ను అనుకరిస్తూ ఏకంగా 52 చికెన్ నగ్గెట్స్‌ను పేర్చిన వీడియోతో దీనికి సంబంధం ఉందని కథనం వివరిస్తోంది.
అంటే ఒకరికి ఇది జస్ట్ ఫన్ కంటెంట్.. మరొకరికి మాత్రం అభ్యంతరకరమైన పదాల సమాహారం. ఒకే పదానికి ఇన్ని రకాల అర్థాలు రావడంతోనే ఈ వివాదం మరింత ముదిరింది.
ఇవి కూడా చదవండి
‘బొంబోక్లాట్’ అంటే ఏంటి? భాషా నిపుణుల క్లారిటీ ఇదే!
పాటలోని మరో పదం ‘బొంబోక్లాట్’ కూడా చర్చకు వచ్చింది. ఓపెన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జస్పాల్ సింగ్ ప్రకారం, ఇది జమైకా భాషా సంస్కృతిలో వినిపించే అసభ్య పదం. జమైకా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి సమాజాల్లో, బ్రిటన్‌లోని పట్టణ ప్రాంతాల యాసలో కూడా ఉపయోగిస్తుంటారు. సందర్భాన్ని బట్టి తీవ్రంగా తిట్టే పదంగా మారుతుందని ఆయన వివరించారు.
ఇక గోల్డ్స్మిత్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ స్కాట్ వార్క్ ఈ తరహా మీమ్లను ‘బ్రెయిన్ రాట్’ ట్రెండ్‌లో భాగంగా అభివర్ణించారు. అంటే పెద్దగా అర్థం లేకపోయినా, విచిత్రమైన పదాలను ఒకదాని తర్వాత ఒకటి కలిపి కొన్ని సెకన్లలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే కంటెంట్ అన్నమాట.
కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన టోనీ థోర్న్ కూడా ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒక అర్థాన్ని తొందరపడి ఖరారు చేయకూడదని సూచించారు. మరోవైపు, సరైన ఆధారాలు చూపకుండా ఆ పాటకు అభ్యంతరకరమైన అర్థాన్ని ఆపాదించడంపై రచయిత మిక్ రైట్ బీబీసీ వ్యాఖ్యాతను విమర్శించారు.
వీడియో చేసిన మాక్స్ కూడా వెనక్కి తగ్గలేదు!
ఇంత రచ్చ జరుగుతుండటంతో వీడియో చేసిన మాక్స్ కూడా తన వెర్షన్ వినిపించారు. తన కంటెంట్ అంతా సరదాగా, నవ్వించాలనే ఉద్దేశంతోనే ఉంటుందని చెప్పారు. తన వీడియో వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
అయితే కొందరు కుడిపక్ష రాజకీయ వ్యాఖ్యాతలు తన వీడియోకు కావాలనే అభ్యంతరకరమైన అర్థాలు కల్పించి, తనను అడ్డం పెట్టుకుని ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మాక్స్ అసలు పేరు మాక్స్ ట్రోబ్. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో విడుదల చేసి కెమీ బాడెనోక్ ప్రాధాన్యతలు, విధానాలపై విమర్శలు చేశారు.
ఇన్ఫ్లుయెన్సర్లతో కొలాబ్.. ప్రభుత్వానికి ఎంతవరకు ప్లస్?
ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది. రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం ఎంతవరకు సరైనది? యువతను చేరుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం అవసరమే అయినా, అధికారిక కార్యక్రమాల్లో ఒక హుందాతనం ఉండాలా? అనే చర్చ మొదలైంది.
ది టైమ్స్, ది ఇండిపెండెంట్ వంటి పత్రికలు ప్రధాని ఇన్ఫ్లుయెన్సర్లతో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశాయి. యువతతో కలిసిపోవాలని ప్రయత్నించే తండ్రిలా ఈ వ్యవహారం కనిపిస్తోందని ది ఇండిపెండెంట్ వ్యాఖ్యానించింది. ది స్పెక్టేటర్ అయితే ఈ చిన్న వీడియోపై రోజుల తరబడి వివాదం కొనసాగడాన్ని ప్రశ్నించింది.
అయితే మరోవైపు ది ట్యాబ్ మాత్రం విమర్శలు మరీ ఎక్కువయ్యాయని అభిప్రాయపడింది. యువతలో చాలామంది బీబీసీ వార్తలు చూడటం లేదా సంప్రదాయ వార్తాపత్రికలు చదవడం లేదని గుర్తుచేసింది. ది కొలాబ్ రిపోర్ట్ కూడా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రధాని మాట్లాడటాన్ని సమర్థించింది. సంప్రదాయ మీడియాకే ప్రధానమంత్రి సమయంపై పూర్తి ఆధిపత్యం ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
సోషల్ మీడియా ప్రచారం కోసం కోట్ల ఖర్చు!
ఈ వివాదంలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రభుత్వ ఖర్చు. బీబీసీ వెల్లడించిన సమాచారం ప్రకారం, 2024లో ఏర్పాటు చేసిన లేబర్ ప్రభుత్వ ‘న్యూ మీడియా యూనిట్’ కోసం ఈ ఏడాది 25 మిలియన్ పౌండ్లు ఖర్చు చేయనున్నారు. గత ఏడాది ఈ ఖర్చు 13.2 మిలియన్ పౌండ్లుగా ఉంది.
అంటే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, వాటి కోసం పెడుతున్న బడ్జెట్ రెండూ పెరుగుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశాలు, డిజిటల్ ప్రచారాలు, ఆన్లైన్ కంటెంట్.. ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యూహంలో భాగమవుతున్నాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే..
యూత్ తో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రధాని కార్యాలయం ఇన్ఫ్లుయెన్సర్లకు తలుపులు తెరిచింది. కానీ అదే డౌనింగ్ స్ట్రీట్ ముందు తీసిన ఐదు సెకన్ల వీడియో ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఎంత ఈజీనో, ఆ వైరల్ కంటెంట్ వల్ల వచ్చే ట్రోల్స్, విమర్శలు, పొలిటికల్ రచ్చను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఒక చిన్న రీల్‌తో మొదలైన ఈ ఎపిసోడ్ ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో పెద్ద డిబేట్‌గా మారింది. మొత్తానికి సోషల్ మీడియా గేమ్‌లో వ్యూస్ మాత్రమే కాదు.. వాటితో వచ్చే వివాదాలనూ లెక్కలోకి తీసుకోవాల్సిందే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







