అబద్ధాలు, అసత్యాలకు ప్యాంటు చొక్కా వేస్తే జగన్..!
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) చేస్తున్న విమర్శలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు, అసత్యాలకు ప్యాంటు, చొక్కా వేస్తే అచ్చం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలాగే ఉంటుందని ఆయన ఘాటుగా విమర్శించారు. వైసీపీ అనుకూల అవినీతి పత్రికలో రోజుకో రకంగా టన్నుల కొద్దీ అసత్యాలను అచ్చు గుద్దుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ పాలనలోనే ఆగిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఎలా ఆపుతుందని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) 2020లోనే స్టే విధించిందని, ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్ మోహన్ రెడ్డి కాదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టినందుకు ఎన్జీటీ భారీ జరిమానా విధించినప్పుడు కూడా అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి
ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్న జగన్, రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఆయనను ఎందుకు ఒప్పించలేకపోయారని నిమ్మల ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి ఏ ముఖ్యమంత్రీ చేయని ఘోర ద్రోహాన్ని జగన్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి రంగానికి అసలైన న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలేనని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. రాయలసీమలో ఉన్న 80 శాతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నిర్మించింది కేవలం ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకుని, వాస్తవాలను గ్రహించాలని వైసీపీ నేతలకు మంత్రి హితవు పలికారు.







