శ్రీవారికి 121 కిలోల బంగారం సమర్పించిన చెన్నై వ్యాపారవేత్త.. ఎవరీ వర్ధమాన్ జైన్ ఎవరు? ఆ ఆభరణాల ప్రత్యేకత ఏంటో తెలుసా?
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు ఎన్నో రకాల కానుకలు సమర్పిస్తుంటారు. తమకు తోచినంతలో బంగారం, వెండి, నగదు ఇలా ఎన్నో రూపాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. కానీ చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త మాత్రం ఏకంగా 121 కిలోల బంగారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ బంగారం విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.207.6 కోట్లు! ఇంత భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను సమర్పించిన ఆ వ్యాపారవేత్త పేరు వర్ధమాన్ జైన్. నవంబర్ 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ఈ ఆభరణాలను టీటీడీకి అందజేశారు. ఇంతకీ ఈ వర్ధమాన్ జైన్ ఎవరు? ఆయన దగ్గర ఇంత సంపద ఎలా వచ్చింది? శ్రీవారికి సమర్పించిన ఆభరణాల్లో ఏమేం ఉన్నాయి?
అసలు ఎవరీ వర్ధమాన్ జైన్?
వర్ధమాన్ జైన్ అంటే ఏదో సాధారణ వ్యాపారవేత్త అనుకుంటే పొరపాటే. హెల్త్‌కేర్ టెక్నాలజీ, బీపీఓ రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పారిశ్రామికవేత్త ఆయన. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న యాక్సెస్ హెల్త్‌కేర్ (Access Healthcare) సంస్థను స్థాపించిన వారిలో ప్రధాన వ్యక్తి. ప్రస్తుతం ఆ సంస్థకు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య రంగానికి అవసరమైన టెక్నాలజీ ఆధారిత సేవలను ఈ సంస్థ అందిస్తుంది.
ఆయన ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. చెన్నైలోని ప్రముఖ లోయోలా కాలేజీలో స్టాటిస్టిక్స్ చదివిన వర్ధమాన్, ఆ తర్వాత అమెరికాకు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టి డెల్ సర్వీసెస్‌లో బీపీఓ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. మెడికల్ కోడింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి టెక్నాలజీ రంగాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. అంతేకాదు, ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ కోడింగ్‌కు సంబంధించి కొన్ని పేటెంట్లు కూడా ఆయన పేరు మీద ఉన్నాయి.
కంపెనీని అమ్మి వచ్చిన డబ్బుతోనే శ్రీవారికి కానుక!
వర్ధమాన్ జైన్ సంపద గురించి చెప్పుకోవాలంటే 2025లో జరిగిన ఓ భారీ వ్యాపార ఒప్పందం గురించి తెలుసుకోవాలి. తన సంస్థలోని 70 శాతం వాటాను అమెరికాకు చెందిన న్యూ మౌంటైన్ క్యాపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించారు. ఈ ఒప్పందం విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.16 వేల కోట్లకు పైమాటే!
ఈ ఒప్పందం తర్వాతే శ్రీవారికి రూ.200 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను సమర్పించాలని నిర్ణయించుకున్నారట. కంపెనీ వాటా విక్రయం ద్వారా వచ్చిన డబ్బులో నుంచే ఈ బంగారు ఆభరణాలను తయారు చేయించినట్లు వర్ధమాన్ జైన్ తెలిపారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించి తన భక్తిని చాటుకున్నారు.
ఆ 121 కిలోల బంగారంతో ఏమేం తయారు చేయించారో తెలుసా?
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ 121 కిలోల బంగారాన్ని ఒకే ఆభరణంగా తయారు చేయించలేదు. స్వామివారి కోసం ప్రత్యేకంగా సంప్రదాయ ఆలయ ఆభరణాలను తయారు చేయించారు. మొత్తం 33 రకాల డిజైన్లలో 46 ఆభరణాలు ఈ కానుకలో ఉన్నాయి. వీటిలో వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం, అందమైన హారాలు, కేయూరాలు, కంకణాలు, కాలి పట్టీలు, నడుము పట్టీతో పాటు స్వామివారి పాదాలకు అలంకరించే బంగారు కవచాలు కూడా ఉన్నాయి.
అంతేకాదు, స్వామివారి చేతుల్లో ఉండే శంఖం, చక్రాలకు ప్రత్యేకంగా కవచాలు తయారు చేయించారు. నాగుపాము ఆకారంలో ఉండే నాగాభరణ వడ్డాణం కూడా ఈ ఆభరణాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీటిలో కేవలం బంగారం మాత్రమే కాదు.. నీలమణులు, పసుపు రంగు నీలమణులు, కెంపులు, పచ్చలు, వజ్రాలు వంటి విలువైన రత్నాలను కూడా పొదిగారు. మొత్తం ఆభరణాల్లో 238.2 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు సమాచారం. ఈ నగలను స్వామివారికి ప్రతిరోజూ జరిగే నిత్య కైంకర్యాలతో పాటు ప్రత్యేక పర్వదినాల్లోనూ అలంకరించనున్నారు.
ఇంకో విశేషం ఏమిటంటే.. మొత్తం 121 కిలోల బంగారంలో 106 కిలోలను శ్రీవారి ఆభరణాల తయారీకి ఉపయోగించారు. మిగిలిన 15 కిలోల బంగారంతో తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి బంగారు చీరను తయారు చేయించనున్నారు.
121 కిలోల బంగారమే ఎందుకు?
అసలు వర్ధమాన్ జైన్ 121 కిలోల బంగారాన్నే ఎందుకు ఎంచుకున్నారనే సందేహం చాలామందికి రావచ్చు. దీనిపై ఆయన చెప్పిన విషయం మరింత ఆసక్తికరంగా ఉంది. తాను కావాలని 121 కిలోల బంగారాన్ని ఎంపిక చేసుకోలేదని, అది యాదృచ్ఛికంగా జరిగిందని ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత ఒక విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారట. స్వామివారు ప్రతిరోజూ ధరించే ఆభరణాల బరువు కూడా 121 కిలోలేనని తెలిసిందట. దీంతో ఈ సంఖ్యకు మరింత ప్రత్యేకత ఏర్పడింది.
నవంబర్ 26న తిరుమలలోని రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి సమక్షంలో ఈ ఆభరణాలను ప్రదర్శించారు. అనంతరం వర్ధమాన్ జైన్ తన భార్య రాధికా వర్ధమాన్ జైన్, సోదరుడు అనురాగ్ జైన్‌తో కలిసి ఆభరణాలను తలపై పెట్టుకుని ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు.
ఇవి కూడా చదవండి
తిరుమలకు ఇది మొదటి విరాళం కాదు!
వర్ధమాన్ జైన్‌కు తిరుమల శ్రీవారిపై భక్తి ఈ ఒక్క విరాళంతో మొదలైనది కాదు. 2019 నుంచే టీటీడీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆయన ఆర్థిక సహాయం అందిస్తున్నారు. గతంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) అభివృద్ధి కోసం ఏకంగా రూ.7 కోట్లు ఇచ్చారు. టీటీడీ గోశాలలో పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని తయారు చేసే మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 కోట్లు అందించారు. అలాగే భక్తులు హుండీలో సమర్పించే నాణేలను లెక్కించేందుకు, వేరు చేసేందుకు ఉపయోగపడే కాయిన్ సార్టింగ్ మెషీన్ కోసం మరో రూ.1 కోటి విరాళంగా ఇచ్చారు. 2026 మే నెలలో ఆలయ రవాణా అవసరాల కోసం ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందించారు.
ఆలయాలకే కాదు.. పేదలకు సాయం చేయడంలోనూ ముందుంటారు!
వర్ధమాన్ జైన్ సేవా కార్యక్రమాలు కేవలం తిరుమలకే పరిమితం కాలేదు. విద్య, వైద్యం, పేద పిల్లల సంక్షేమం వంటి రంగాల్లోనూ ఆయన తన వంతు సహాయం అందిస్తున్నారు. కాంచీ కామకోటి చిల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్‌కు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన చిన్నారులకు వైద్య సేవలు అందించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు.
అలాగే సరితా జైన్ ఫౌండేషన్ ద్వారా విద్యా సేవ, వైద్య సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు చదువుకునేందుకు సహాయం చేయడంతో పాటు, అవసరమైన వారికి వైద్యపరమైన సాయం అందిస్తున్నారు. ఇక ‘ఆవిష్కార్’ అనే కార్యక్రమం ద్వారా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించే ప్రయత్నం చేస్తున్నారు.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే..
వ్యాపార రంగంలో వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న వర్ధమాన్ జైన్, తన సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా శ్రీవారికి 121 కిలోల బంగారాన్ని సమర్పించడం, అందులోనూ స్వామివారి నిత్య అలంకరణకు ఉపయోగపడేలా ప్రత్యేక ఆభరణాలను తయారు చేయించడం ఈ విరాళానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు అందరి నోటా ఒకటే పేరు.. వర్ధమాన్ జైన్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







