తన సంతకంలో కళాత్మక ప్రతిభను కనుగొన్న ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి తెలిసిన వాళ్లకు ఒక విషయం బాగా తెలుసు. తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! తన తెలివితేటల దగ్గరి నుంచి గోల్ఫ్ ఆట వరకు, తనకున్న ప్రత్యేకతల గురించి అవకాశం దొరికినప్పుడల్లా చెప్పుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్త విషయం చేరింది. అదేంటో తెలుసా? ఆయన సంతకం! అవును.. తన సంతకం కూడా ఓ కళాఖండమేనంటూ ట్రంప్ మురిసిపోయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ చిన్న ప్రశంస.. ట్రంప్‌కు భలే ఆనందం!
థాంక్స్ గివింగ్ సెలవుల కోసం ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ఉంటున్న ట్రంప్.. అక్కడ మీడియా ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లోరిడాలో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరు కౌంటీల ప్రజలకు విపత్తు సహాయ నిధులు అందించే ప్రకటనపై సంతకం చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అక్టోబర్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని చెబుతూ.. ఈ సహాయ కార్యక్రమం తన మనసుకు దగ్గరైన విషయమని పేర్కొన్నారు.
ఇక తనదైన స్టైల్లో చేతిలో నల్లటి షార్పీ పెన్ను పట్టుకుని ఆ ప్రకటనపై సంతకం చేశారు. అంతే.. అక్కడే అసలు సరదా మొదలైంది. వెనుక ఉన్న ఓ మహిళా అధికారి ట్రంప్ సంతకాన్ని చూసి ‘చాలా బాగుంది’ అంటూ చిన్న ప్రశంస చేశారు. ఇంకేముంది.. ట్రంప్ ముఖంలో ఆనందం కనిపించింది. ప్రజలకు తన సంతకం చాలా ఇష్టమని, అది ఎంతో కళాత్మకంగా ఉంటుందని కూడా అంటుంటారని చెప్పుకున్నారు. అంటే ఓ చిన్న పొగడ్త దొరికితే చాలు.. తన గొప్పతనాన్ని మరోసారి గుర్తుచేసుకోవడానికి ట్రంప్ అస్సలు వెనకాడరన్నమాట!
సంతకం చూసి నెటిజన్లకు మాత్రం మరో ఆలోచన!
ట్రంప్ సంతకం అంటే మామూలుగా ఉండదు. ఎత్తుపల్లాలతో, వంకరటింకర గీతలతో ఓ ప్రత్యేకమైన ఆకారంలో ఉంటుంది. ఆయన దాన్ని కళాత్మకమని చెప్పుకుంటుంటే, సోషల్ మీడియాలో చూసిన వాళ్లు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు మొదలుపెట్టారు. ఒకరు ఆ సంతకాన్ని గుండెపోటు వచ్చినప్పుడు హార్ట్ మానిటర్‌పై కనిపించే గీతలతో పోల్చేశారు. మరొకరు అమెరికా ఆర్థిక అనిశ్చితిని సూచించే గ్రాఫ్‌లా ఉందంటూ సెటైర్ వేశారు. ఇంకొకరు అయితే ఎంత చిన్న విషయమైనా తనను తాను పొగుడుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉంటారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
తన గొప్పతనం చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందే!
నిజానికి తన ప్రతిభ గురించి ట్రంప్ గొప్పగా చెప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు. తనకు చాలా ఎక్కువ ఐక్యూ ఉందని, గోల్ఫ్‌లో తనకు తిరుగులేదని, నిర్మాణం, డిజైన్ రంగాల్లోనూ తనకు మంచి నైపుణ్యం ఉందని తరచూ చెబుతుంటారు. తన మేధస్సును పరీక్షించే పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించానని, డిమెన్షియా పరీక్షలో పర్ఫెక్ట్ స్కోర్ వచ్చిందని కూడా పలుమార్లు ప్రస్తావించారు.
ఇక మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విషయంలోనూ ట్రంప్ ఇదే అంశాన్ని రాజకీయ విమర్శలకు వాడుకున్నారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంతకాల కోసం ఆటోపెన్ ఉపయోగించడాన్ని పదేపదే తప్పుబట్టారు. చివరకు వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన అధ్యక్షుల వాక్ ఆఫ్ ఫేమ్‌లో బైడెన్ ఆటోపెన్ సంతకం చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.
మొత్తానికి, తన తెలివితేటలు, ఆటలు, డిజైన్ల గురించి చెప్పుకున్న ట్రంప్.. ఇప్పుడు తన సంతకంలోని కళాత్మకతను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. ఓ అధికారి ఇచ్చిన చిన్న కాంప్లిమెంట్‌తో మొదలైన ఈ వ్యవహారం.. చివరకు సోషల్ మీడియాలో నవ్వులు పూయించే అంశంగా మారిపోయింది. ఈ ఘటనపై వైట్‌హౌస్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







