అసంతృప్తులపై రేవంత్-సందీప్ కీలక మంతనాలు!
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత సమస్యలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ మధ్య కీలక మంతనాలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంపై కొందరు నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ప్రజాభవన్లో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కూడా పాల్గొన్నారు.
ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర నాయకత్వం తీరుపై వారు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ ఇన్ఛార్జ్ సందీప్ కుమార్కు అందజేసిన లేఖల్లోని అంశాలపై ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ లోతుగా సమీక్షించినట్లు పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఎం సందీప్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడానికి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 22న జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంతో పాటు విస్తృత స్థాయి పీసీసీ భేటీలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదనే అభిప్రాయాలు, నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం వంటి అంశాలు ఆయన దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన ప్రత్యేక భేటీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పనితీరు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగం పాత్రపై చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలకు, పార్టీ ఆలోచనలకు మధ్య వారధిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై ఇరువురు నేతలు ఒక అంచనాకు వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సందీప్ కుమార్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత, ముఖ్యమంత్రి అందించిన వివరాలను క్రోడీకరించి ఏఐసీసీ అధిష్ఠానానికి ఆయన ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే తెలంగాణ కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు, అసంతృప్త నేతల బుజ్జగింపు చర్యలపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.







