తెలంగాణలో స్టైల్ మారుస్తున్న బీజేపీ!
తెలంగాణలో బీజేపీ తన కార్యాచరణ శైలిని పూర్తిగా మార్చుకుంటోంది. ఇప్పటివరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి జాతీయ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించిన కమలనాథులు, ఇకపై రాష్ట్రంలోని స్థానిక సమస్యలనే ప్రధాన ఆయుధంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అధికార కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా డిసెంబర్ 1 నుంచి 25 రోజుల పాటు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుదీర్ఘ ఆందోళనలకు తెరలేపుతోంది.
ఈ భారీ ప్రజా ఉద్యమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. క్షేత్రస్థాయి పర్యటనలకు ముందే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి హైదరాబాద్, కామారెడ్డి, నల్గొండ వేదికలుగా ప్రత్యేక వర్క్‌షాపులను నిర్వహించనుంది. ఈ 25 రోజుల పాటు పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, స్థానికులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేపట్టనున్నారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ ప్రధానంగా రెండు కీలక రంగాలను ఎంచుకుంది. సాగునీరు, తాగునీటి సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. వరి సాగు చేయవద్దని రైతులకు సూచనలు అందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం అధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించకపోయినా, ఇతర పంటలకు అనుకూలంగా లేని భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా పంట నష్టపోయే రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశాన్ని బలంగా లేవనెత్తడం ద్వారా విద్యార్థులు, యువత మద్దతును కూడగట్టాలని పార్టీ యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో నిర్వహించిన ‘మహా పాదయాత్ర’, కరీంనగర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావడం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాదయాత్రలకు లభించిన ప్రజాదరణ చూసి కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేసిన ఆయన, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 90 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుందని రామచందర్ రావు జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూ, రానున్న రోజుల్లో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం తథ్యమని ఎద్దేవా చేశారు.
మొత్తానికి ఒకవైపు అగ్రనేతల పాదయాత్రలతో ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని నిలబెట్టుకుంటూనే, మరోవైపు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న 25 రోజుల క్షేత్రస్థాయి ఉద్యమంతో ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరింత వేడిని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది.







