మహిళా రిజర్వేషన్ .. డీ లిమిటేషన్ అమలు దిశగా ముందడుగు…!
డీలిమిటేషన్.. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం చారిత్రక ముందడుగేసింది. రాజ్యాంగ సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యను ఏకరీతిగా 50 శాతం పెంచనున్నారు. దీంతో ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్య దాదాపు 815 స్థానాలకు చేరనుంది. పెరిగిన ఈ స్థానాల సంఖ్యపై రాబోయే 25 ఏళ్ల పాటు.. అంటే 2051 వరకు ఎలాంటి మార్పు లేకుండా ‘ఫ్రీజ్’ (స్తంభింపజేయడం) విధించనున్నట్లు సమాచారం.
అన్ని రాష్ట్రాల ప్రస్తుత దామాషా (ప్రపోర్షనల్ షేర్) ప్రాతినిధ్యం మారకుండా యథాతథంగా కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. డీఎంకే వంటి విపక్ష పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాయి. వీటికి చెక్ పెట్టేందుకే అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచే ఫార్ములాను కేంద్రం తెరపైకి తెచ్చింది. తద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
నవంబరు 30 నుంచి డిసెంబరు 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. సభలో అత్యంత కీలక అంశాలపై చర్చ జరగనుందని, విపక్షాలు అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.
కేంద్రం తాజా ఎత్తుగడపై విపక్ష శిబిరంలో తీవ్ర చర్చ మొదలైంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ నిర్ణయంపై మండిపడ్డారు. ఇది బీజేపీ చేసిన అతిపెద్ద తప్పు’ అని, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు ‘ఇండియా’ కూటమి ఉమ్మడి వ్యూహం రచిస్తోంది.







