పార్లమెంటులో మరో పవర్ గేమ్..!
దేశ రాజకీయాల్లో మరో కీలక సమరం మొదలుకాబోతోంది! పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి బలపరీక్షకు రంగం సిద్ధమవుతోంది! ఈ నెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లు.. నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటున్న విపక్షాలు.. డీలిమిటేషన్ విషయంలో మాత్రం కేంద్రం ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి నష్టం జరగకూడదన్నది వాటి ప్రధాన డిమాండ్.
ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540. ముగ్గురు ఎంపీల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరై ఓటు వేసే సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు తప్పనిసరి. సభలో ఉన్న 540 మంది సభ్యులూ ఓటింగ్‌లో పాల్గొంటే బిల్లు నెగ్గడానికి కనీసం 360 మంది మద్దతు అవసరం అవుతుంది.
ఇవి కూడా చదవండి
ఎన్డీయే చేతిలో ఉన్న 320 మంది..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 320 మంది ఎంపీల మద్దతు ఉంది. బీజేపీకి చెందిన ఎంపీలు 241 మంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు చేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ NCPI)లో విలీనమైన 20 మంది రెబల్ ఎంపీలు ఇప్పటికే ఎన్డీయే పక్షాన నిలిచారు. మహారాష్ట్ర నుంచి ఏక్నాథ్ శిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 13 మంది ఎంపీలు కూటమిలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ (16), జేడీయూ (12), ఎల్జేపీ-రామ్ విలాస్ (5), ఆర్ఎల్డీ (2), జనసేన (2), జేడీఎస్ (2) తో పాటు ఇతర చిన్న పార్టీల ఎంపీలు కలిపి ఎన్డీయే బలం 320కి చేరింది. శివసేనతో పాటు టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ 360ని అందుకోవడానికి ఎన్డీయేకు ఇంకా 40 ఓట్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
గతంలో ఏప్రిల్ 17న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చినప్పుడు సభలో ఓడిపోయింది. అప్పుడు ఓటింగ్‌లో పాల్గొన్న 528 మందిలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అవసరమైన 352 ఓట్లలో 54 ఓట్ల కొరతతో బిల్లు వీగిపోయింది. ఇప్పుడు మరోసారి ఈ బిల్లు తెరపైకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ప్రాంతీయ పార్టీల నుంచి అదనపు ఓట్లు సాధిస్తారా? లేక విపక్ష సభ్యులను ఓటింగ్‌కు దూరం ఉంచి గట్టెక్కుతారా? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.







