తీవ్ర ఒత్తిడిలో గోల్డ్ లోన్ మార్కెట్..!
బంగారం ధరల పతనం.. గోల్డ్ లోన్ మార్కెట్ ను ఒత్తిడికి గురి చేస్తోంది. గతంలో పోలిస్తే పసిడి ధర.. గణనీయంగా పడిపోవడంతో…తాకట్టు పెట్టిన బంగారం విలువ పడిపోయింది. దీంతో రుణదాతలు రికవరీ చర్యలను ముమ్మరం చేస్తుండగా, రుణగ్రహీతలు మార్జిన్ కాల్స్, వేలం భయంతో ఆందోళన చెందుతున్నారు.
లోన్-టు-వాల్యూ ఉల్లంఘన
బంగారం ధర తగ్గడంతో, తాకట్టు పెట్టిన బంగారం విలువకు, తీసుకున్న రుణానికి మధ్య ఉండే నిష్పత్తి (ఎల్టీవీ) రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన పరిమితులను దాటుతోంది. దీంతో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వెంటనే అప్రమత్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఎల్టీవీని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చేందుకు గాను, ఖాతాదారులకు ‘మార్జిన్ కాల్స్’ జారీ చేస్తున్నాయి. బకాయి ఉన్న రుణంలో కొంత భాగాన్ని వెంటనే చెల్లించాలని లేదా అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని నోటీసుల ద్వారా కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి
పెరుగుతున్న మొండి బకాయిలు
ధరల క్షీణత కారణంగా రుణ వృద్ధి మందగించింది. క్రిసిల్ అంచనా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో 78 శాతంగా ఉన్న గోల్డ్ లోన్ ఆస్తుల వృద్ధి, 2027 నాటికి 40 శాతానికి పడిపోవచ్చు. మరోవైపు, మొండి బకాయిలు (ఎన్పీఏ) పెరుగుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రముఖ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్‌లో స్టేజ్-3 రుణాలు రెట్టింపునకు పైగా పెరిగి రూ. 7,267 కోట్లకు చేరాయి. అదేవిధంగా మణప్పురం ఫైనాన్స్‌లోనూ బకాయిల ఒత్తిడి పెరిగింది. దీంతో బకాయిలను వసూలు చేసుకునేందుకు రుణ సంస్థలు వేలం ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్, మణప్పురం వంటి సంస్థలు కొత్తగా స్వల్పకాలిక గోల్డ్ లోన్లు ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
ఆర్బీఐ కఠిన నిబంధనలు
గోల్డ్ లోన్ మార్కెట్‌ను ఆర్బీఐ నిశితంగా పర్యవేక్షిస్తోంది. రుణ పరిమాణాన్ని బట్టి ఎల్టీవీ పరిమితులను (రూ. 2.5 లక్షల వరకు 85 శాతం, రూ. 5 లక్షల వరకు 80 శాతం, ఆపైన 75 శాతం) నిర్దేశించింది. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, క్రెడిట్ తనిఖీలు, నెలవారీ వడ్డీ వసూళ్లలో పారదర్శకంగా ఉండాలని ఎన్బీఎఫ్సీలను హెచ్చరించింది. రుణగ్రహీతలు మార్జిన్ కాల్స్‌కు స్పందించని పక్షంలో, నోటీసు జారీ చేసి, వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చాకే వేలం నిర్వహించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, గోల్డ్ లోన్ తీసుకున్నవారు తమ రుణ స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.







