ఇక ఫోన్లోనే కాదు.. టీవీలోనూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ! మెటా కొత్త ఫీచర్ ఇదే!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ టైమ్ ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు కదా! ఒక్క వీడియో చూస్తామని మొదలుపెడితే.. అలా గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉంటాం. మరి అదే రీల్స్‌ను చేతిలో ఫోన్ పట్టుకోకుండా, హాయిగా సోఫాలో కూర్చొని టీవీలో చూస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ! సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతోంది. ఇకపై మొబైల్ స్క్రీన్‌కే పరిమితమైన ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెద్ద టీవీ స్క్రీన్‌పైనా సందడి చేయనున్నాయి. ఇందుకోసం ‘ఇన్స్టాగ్రామ్ ఫర్ టీవీ’ పేరుతో ప్రత్యేక యాప్‌ను భారత్‌లో లాంచ్ చేయబోతోంది.
నవంబర్ 27న ముంబైలో జరిగిన తన వార్షిక ‘హౌస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్’ క్రియేటర్ ఈవెంట్లో మెటా ఈ విషయాన్ని ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ యాప్ భారతీయ యూజర్లకు అందుబాటులోకి రానుంది. అంటే ఇక ఫ్యామిలీ అంతా కలిసి టీవీ ముందు కూర్చొని తమకు నచ్చిన రీల్స్, క్రియేటర్ల వీడియోలను ఎంజాయ్ చేయొచ్చన్నమాట!
మీ ఇంటి టీవీనే ఇన్స్టాగ్రామ్ స్క్రీన్‌గా మారిపోతుంది!
ఈ కొత్త యాప్‌ను ఉపయోగించడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మీ దగ్గర యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ లేదా గూగుల్ టీవీ వంటి సపోర్ట్ చేసే పరికరాలు ఉంటే చాలు. వాటిలో ఇన్స్టాగ్రామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని మీ పాత అకౌంట్‌తోనే లాగిన్ అవ్వొచ్చు. కావాలనుకుంటే టీవీ కోసం ప్రత్యేకంగా మరో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒకే ఇంట్లో ఐదు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల వరకు లింక్ చేసుకోవచ్చు. దీంతో ఇంట్లో అమ్మకు నచ్చిన వీడియోలు, నాన్న చూసే కంటెంట్, పిల్లలకు ఇష్టమైన రీల్స్ అన్నీ వేర్వేరుగా కనిపిస్తాయి. ఎవరి అకౌంట్ వాళ్లదే అన్నమాట! ఫ్యామిలీ అంతా ఒకే టీవీ ఉపయోగించినా ఎవరి అభిరుచులకు తగ్గట్టుగా వారికి ప్రత్యేక ఫీడ్ ఉంటుంది.
రీల్స్ మాత్రమే కాదు.. ఫొటోలు, స్టోరీస్ కూడా!
టీవీలో ఇన్స్టాగ్రామ్ అంటే కేవలం రీల్స్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇందులో స్టోరీస్, క్రియేటర్లు రూపొందించిన వీడియోలు, ఫొటోలు, క్యారసెల్ పోస్టులను కూడా చూడొచ్చు. సాధారణంగా ఫోన్లో నిలువుగా కనిపించే రీల్స్‌తో పాటు, టీవీకి అనుగుణంగా రూపొందించిన హారిజాంటల్ వీడియోలను కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాదు.. ఇతరుల ప్రొఫైల్స్‌లోకి వెళ్లి వారి బయో, ఫొటోలు, ఫాలోవర్ల వివరాలను కూడా చూసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఆయా అకౌంట్ల ప్రైవసీ సెట్టింగ్స్‌కు అనుగుణంగానే కనిపిస్తాయి.
మరో ప్రత్యేకత ఏంటంటే.. మీకు నచ్చే అంశాలను బట్టి రీల్స్‌ను ప్రత్యేక ఛానళ్లుగా విభజిస్తారు. ఉదాహరణకు ఫుడ్ వీడియోలు, కామెడీ, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఆసక్తికి తగ్గట్టుగా వీడియోలు చూడొచ్చు. రిమోట్ చేతిలో పట్టుకొని ఒక్కో వీడియోను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అవి ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంటాయి. ఇక మీరు ఫాలో అయ్యే వాళ్లు ఎక్కువగా చూసే వీడియోలు, పోస్టులను ఒకేచోట చూపించేందుకు ‘ఫ్రెండ్స్’ పేరుతో ప్రత్యేక ట్యాబ్ కూడా ఉంటుంది.
ఫోన్లో ఏదైనా రీల్ చూస్తున్నప్పుడు అది టీవీలోనూ చూడాలనిపిస్తే.. అదే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి టీవీకి కాస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం అన్ని పరికరాల్లో ఒకేలా అందుబాటులో ఉండకపోవచ్చు.
పిల్లలు కూడా చూస్తారు కదా.. అందుకే ప్రత్యేక జాగ్రత్తలు!
ఇంట్లో అందరూ కలిసి చూసే యాప్ కాబట్టి కంటెంట్ విషయంలో మెటా కొన్ని నియంత్రణలు తీసుకొస్తోంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లకు అనవసరమైన లేదా వయసుకు సరిపోని వీడియోలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. మొబైల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అమలు చేస్తున్న 13+ కంటెంట్ రేటింగ్ విధానం టీవీ యాప్‌లోనూ కొనసాగుతుంది.
టీనేజ్ అకౌంట్లకు ఇప్పటికే ఉన్న భద్రతా సెట్టింగ్స్ టీవీలోనూ పనిచేస్తాయి. అనుచితమైన ప్రొఫైల్స్, కామెంట్లు, కంటెంట్‌పై పరిమితులు ఉంటాయి. అంతేకాదు.. టీవీలో ఇన్స్టాగ్రామ్ చూస్తూ గడిపే సమయాన్ని కూడా మొత్తం స్క్రీన్ టైమ్‌లో లెక్కిస్తారు. నిద్రపోయే సమయానికి సంబంధించిన రిమైండర్లు కూడా ఉంటాయి.
అమెరికా తర్వాత ఇప్పుడు భారత్‌లోకి..
నిజానికి ఇన్‌స్టాగ్రామ్‌ను టీవీలోకి తీసుకురావాలనే ఆలోచన మెటాకు ఇప్పుడే రాలేదు. 2025 డిసెంబర్లోనే అమెరికాలో అమెజాన్ ఫైర్ టీవీ ద్వారా ఈ సేవలను పరీక్షించడం ప్రారంభించింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో గూగుల్ టీవీకి కూడా విస్తరించింది. ఇప్పుడు భారత్‌లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







